Share News

జ్ఞాన మార్గదర్శి

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:02 AM

శ్రీరమణ మహర్షి ‘మౌనముని’గా ప్రసిద్ధి చెందారు. మౌన ధ్యానాన్ని ఆయన ఎక్కువగా బోధించేవారు. అరుణాచలంలోని ఆశ్రమంలో తనను దర్శించుకోవడానికి వచ్చిన వారు....

జ్ఞాన మార్గదర్శి

చింతన

శ్రీరమణ మహర్షి ‘మౌనముని’గా ప్రసిద్ధి చెందారు. మౌన ధ్యానాన్ని ఆయన ఎక్కువగా బోధించేవారు. అరుణాచలంలోని ఆశ్రమంలో తనను దర్శించుకోవడానికి వచ్చిన వారు వ్యక్తపరిచే సందేహాలను తీర్చాల్సి వచ్చినప్పుడు, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా క్లుప్తంగానే చెప్పేవారు. అయితే ఆ తక్కువ మాటల్లోనే మార్గదర్శనం చేసేవారు.

శ్రీరమణులను గురువుగా ఆరాధించే ఒక వ్యక్తి ఆయనను కలిశాడు. ‘‘స్వామీ! నేను నా గ్రామాన్ని వదిలిపెట్టి, అడవికి వెళ్ళి తపస్సు చేయాలనుకుంటున్నాను. మీ అనుమతి, ఆశీస్సులు కావాలి’’ అని అడిగాడు. ‘‘ఎవరైనా గ్రామాన్ని విడిచిపెట్టవచ్చేమో కానీ ఆత్మను వదిలిపెట్టలేరు. గ్రామం అనేది ఆత్మకన్నా వేరుగా ఉన్నట్టయితే... దాన్ని వదిలిపెట్టడం సాధ్యమయ్యేదేమో. ఆత్మ ఉండే చోటికి అంతర్ముఖంగా చేరుకొని, అక్కడ ఏకాంతంగా జీవించకుండా... గ్రామాన్ని వదిలిపెట్టి అరణ్యంలో నివసించడం వల్ల ప్రయోజనం లేదు. అది నగరంలో నివసించడం లాంటిదే. ఈ ప్రపంచాన్ని త్యజించానని భావించేవాడు నిజమైన సన్యాసి కాదు. తాను ఒక గృహస్థుడినని భావించని గృహస్థుడే నిజమైన సన్యాసి. తాను సర్వస్వాన్నీ త్యజించానని భావించే వ్యక్తి కన్నా... తన కర్మలన్నిటినీ తానే చేస్తున్నానని భావించని వాడు ఎంతో శ్రేష్టుడు’’ అని బదులిచ్చారు శ్రీరమణులు.

అవన్నీ అసత్యం

ఒక సందర్భంలో శ్రీరమణులు ఒక కథ చెబుతూ ‘‘ఒక వ్యక్తి తన ఇంట్లో గాఢంగా నిద్రపోతూ కలగన్నాడు. అతని కలలో... ఎవరో వచ్చి అతని ముక్కులో ఏదో మందు పోశారు, తరువాత కళ్ళకు గంతలు కట్టారు. చేతులను కట్టేశారు. అడవి మధ్యలో వదిలేశారు. అతను దారి తెలియక చాలాసేపు రాళ్ళు, ముళ్ళ మధ్య అడవిలో తిరిగాడు. చివరకు ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక దేవత ప్రత్యక్షమై ‘‘ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? ఇక్కడకు ఎందుకు వచ్చావు?’’ అని అడిగింది. కళ్ళకు గంతలతో ఉన్న ఆ వ్యక్తి తన వివరాలు చెప్పి ‘‘ఎవరో నాకు ఏదో మందు ఇచ్చి, ఇక్కడికి తెచ్చి వదిలేశారు’’ అన్నాడు. అప్పుడు ఆ దేవత అతని కట్లన్నీ విప్పేసి, దారి చూపించి ఈ దారిలో వెళ్తే నీ గ్రామానికి చేరుకుంటావు’’ అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ ఆదేశాలను అనుసరించి అతను క్షేమంగా ఇల్లు చేరుకొని, మంచం మీద పడుకున్నాడు. అక్కడితో కల పూర్తయింది. అతనికి నిద్ర నుంచి మెలకువ వచ్చింది. తను అడవికి వెళ్ళలేదనీ, ఇంట్లోనే నిద్రపోయి కలగన్నాననీ అర్థమయింది. మనం భగవంతుని నుండి వేరుగా ఉన్నామనే భావన, మరియు ఆయనను చేరుకోవడానికి మనం ఏదో కఠోరమైన సాధన చేయాలనే భావన... ఈ వ్యక్తికి తన కలలో కలిగిన ఆలోచనల్లాగానే అసత్యమైనవి.


అతను మంచం మీద సుఖంగా పడుకుని ఉన్నాడు. అంటే మనం అప్పటికే ఆత్మలో నిక్షిప్తమై ఉన్నామని అర్థం. కానీ అతను ఒక అడవిలో బాధపడుతున్నట్టు (అంటే, ఈ ప్రపంచం వాస్తవమని, మనం దానికి లోబడి ఉన్నామనే నమ్మకంలో చిక్కుకొని), మళ్ళీ మంచం మీదకు చేరడానికి గొప్ప ప్రయత్నం చేయాలని (అంటే, ఆత్మను చేరుకోవడానికి లేదా భగవంతుని సాక్షాత్కరించుకోవడానికి సాధన చేయాలని) అతని కల నమ్మేలా చేసింది. భగవంతుణ్ణి పొందాలనే ఆలోచన ఆగిపోయినవారే భగవంతుణ్ణి పొందుతారు, వారు ఆత్మ స్థితిలోనే నిలిచి ఉంటారు. ఆలోచనలు ఎక్కడ ఉద్భవిస్తాయో ఆ ప్రదేశాన్ని మనం గమనించుకుంటూ ఉంటే చాలు’’ అని వివరించారు.

అదే ఆత్మ... అదే ముక్తి

‘‘ఆత్మజ్ఞానం పొందాలనీ, నా అనుభవాన్ని ఈ లోకానికి, ప్రజానీకానికి చాటాలని ఉంది? దానికి మార్గమేమిటి?’’ అని శ్రీరమణులను ఒక భక్తుడు అడిగాడు. దానికి ఆయన సమాధానమిస్తూ... ‘‘ఇతరులకు బోధించాలన్న ఆలోచనను విడిచిపెట్టి... ముందు నిన్ను నువ్వు తెలుసుకో. ఆ తరువాత లోకం సంగతి ఆలోచించు. తనను తాను తెలుసుకోకుండా లోకానికి సాయపడాలని ప్రయత్నించడం అంటే... దృష్టిలోపం ఉన్న వ్యక్తి నేత్ర సమస్యలున్న ఇతరులకు వైద్య చిట్కాలు సూచించడం లాంటిది’’ అని చెప్పారు. ‘‘నిన్ను నువ్వు తెలుసుకో... అని మీరు చెబుతున్నారు. నేనెవరినో నాకు తెలియడం లేదు’’ అని ఒకరు సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు... ‘‘మనం ఎవరనేది మనకు తెలియకుండానే వేరే ఏదో సాధించాలని కోరుకుంటున్నాం. మనం సాధించాలని కోరుకునేది... వాస్తవానికి మనకు ఇప్పటికే ఉంది. మనకు కలిగే ఏ అనుభవమైనా... అది ఎంత గొప్పదైనా... చివరకు కనుమరుగైపోతుంది. ఏది వస్తుందో, ఏది పోతుందో అది ఆత్మ కాదు. ప్రతి ఒక్కరి అనుభవంలోనూ ఎల్లప్పుడూ నిలిచి ఉండేది ఏదో, అదే మన నిజమైన ఆత్మ, అదే ముక్తి. అదే జ్ఞానోదయం’’ అని స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 05:02 AM