భక్తి జ్ఞాన సాధకుడు
ABN , Publish Date - Feb 20 , 2026 | 05:07 AM
బోధన, సాధన... ఈ రెండిటికీ సమస్థానం ఇవ్వడమే రామకృష్ణ పరమహంస విలక్షణత. ఆయనది నిరంతర అన్వేషణ. ఆధ్యాత్మికతను బోధించడంతోపాటు అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఆ క్రమంలో...
బోధన, సాధన... ఈ రెండిటికీ సమస్థానం ఇవ్వడమే రామకృష్ణ పరమహంస విలక్షణత. ఆయనది నిరంతర అన్వేషణ. ఆధ్యాత్మికతను బోధించడంతోపాటు అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఆ క్రమంలో పరిపూర్ణత కోసం ఎంతగానో అన్వేషించి, చివరకు సఫలీకృతులు అయ్యారు. ‘నిత్య ధ్యానం’ అనే ఒకే ఒక అంశం మీద సంపూర్ణ ధ్యాసతో... ఆ సంకల్పశాలి సాధించినది అనంతం. భక్తి, జ్ఞాన, కర్మ యోగాల మిశ్రిత రూపం ఆయన జీవితం.
శ్రీరామకృష్ణుల తొలి పేరు గదాధరుడు. ఆయన స్వస్థలం మన దేశంలోని బెంగాల్ ప్రాంతంలో ఉన్న ఒక పల్లెటూరు. ఆయన బాల్యమంతా కళాభిరుచితో కొనసాగింది. ప్రకృతితో నిత్యానుబంధం బలపడింది. వయసు పెరుగుతున్నకొద్దీ ఆధ్యాత్మిక అంశాలపై చూపు కేంద్రీకృతమవుతూ వచ్చింది. దక్షిణేశ్వర కాళీమాత ఆలయాన పూజాదికాల నిర్వహణ ప్రధాన బాధ్యత అయింది. భక్తి భావ తన్మయత్వం ఆయనను ‘పరమహంస’గా తీర్చిదిద్దింది. పరమసత్యం ఆయన అనుభవంగా మారింది. సంప్రదాయ గురుప్రబోధం నవ్య కాంతి కిరణంగా భాసించింది. పర్యవసానంగా నిర్పికల్ప సమాధి స్థితి భావన ఒక అనుభూతి రూపాన్ని సంతరించుకుంది. శారదాదేవితో వివాహం, ఆమె ధార్మికంగా ఆయన శిష్యురాలు కావడం, దీక్షాయుత జీవిత సాధనం... ఇవన్నీ పరిణామ క్రమంలో భాగాలు. కథలు, పాటలు, నిత్య జీవన ఉదాహరణల వివరణతో కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆయనను చూడడానికి వచ్చిన నరేంద్రుడు అడిగిన (దైవాన్ని మీరు చూశారా? అనే) ఒక ప్రశ్నకు సమాధానమే వారి గురుశిష్య బంధాన్ని చరిత్రాత్మకంగా మలచింది. ఆనందుల కృషి ఫలంగానే రామకృష్ణ మిషన్ సంస్థాపన, విస్తరణ జరిగింది.
పఠనం కన్నా సాధనే మిన్న
సృష్టి సమస్తం ఏకత్వమే. అన్నిటా ఉండేది దైవత్వమే. భగవాన్ ఒక్కరే, మతాలన్నిటి ప్రబోధం ఒక్కటే.. ఇవీ పరమహంస ప్రధాన బోధనలు, ఆచరణ రూపాలు. మానవ సేవను మాధవసేవగా ఆయన దర్శించారు. జీవశక్తికి, జ్ఞాన యుక్తికీ అవినాభావ సంబంధం ఎటువంటిదో ఆయన జీవితమే నిరూపిస్తోంది. ఆనందం అంటే ఏమిటి, ఎక్కడ ఉంటుంది? దృశ్య-అదృశ్య ప్రపంచాల మధ్య ఏముంది? భక్తి అనేది ఏ అనుభవాన్ని ఇస్తుంది?... వీటికి జవాబులు పరిపూర్తిగా లభించేది శ్రీరామకృష్ణుల నుంచే. భారతీయ తత్త్వ సారాంశమంతటినీ రంగరించి ఆయన లోకానికి అందించారు. సందేశ వాహిని ఖండాంతరాలకు చేరేలా పూలబాటను పరిచారు. అలా ఆయన సమస్త భారతీయుల హృదయాలను ప్రభావితం చేశారని విదేశీ చరిత్రకారులెందరో ప్రస్తుతించారు. ‘ఎప్పుడూ తీసుకోవడం కాదు, ఇవ్వడం అలవరచుకోవాలి. ఎదిగిన వ్యక్తిగా లోకం గుర్తించాలంటే ఒదిగి ఉండాల’ని ఆయన హితవు పలికేవారు. పఠనం కన్నా సాధన మార్గమే సదా పరిరక్షిస్తుందని రామకృష్ణ పరమహంస ప్రగాఢ విశ్వాసం, స్వీయ అనుభవం కూడా. భక్తి, భజన, స్తోత్ర రూపాలలో సత్ఫలితాలు కలుగుతాయని నిరూపించారు. ఆయనది ఒక అవతార పరంపర. త్యాగ చింతన, భక్తి వాహిని ఆయనలోని అంతర్భాగాలు. మానవులు కోరాల్సిందీ, వారికి కావాల్సిందీ ధనార్జన కాదు, ధర్మ ఆర్జన. ఆ సంపాదన ఏ రీతిలో ఉండాలో ఆ మహనీయుడి జీవితమే వెల్లడిస్తుంది.
సత్య చింతనకు మారుపేరే దైవం
‘లోకంలోని అన్ని మార్గాలు సత్యానికే దారి చేస్తాయి. ఆ సత్య చింతనకు మారుపేరే దైవం’ అనేది రామకృష్ణుల నమ్మకం. ఆయన ఎప్పుడూ దక్షిణేశ్వర కాళీ ఆలయాన... ఆ తల్లి పాదాల దగ్గరే ఉండేవారు. ఆహారం లేదు. నిద్ర రాదు, అసలు అలసటే తెలియదు. గంటలూ, రోజుల తరబడీ అమ్మ పద సన్నిధిలోనే ఉండేవారు. భవ్య దీపాన్ని గురువుగా ఆయన వెలిగిస్తే, అది కలకాలం పదిలంగా ఉండేలా మనసా వాచా కర్మణా పరిశ్రమించినవారు స్వామి వివేకానంద. విద్య, వైద్య, సామాజిక సేవారంగాల్లో సైతం రామకృష్ణ మిషన్ ఎప్పుడూ ముందువరుసనే ఉంటోంది. ఇప్పటికీ ఆధ్యాత్మికపరంగా మార్గదర్శకత్వం వహిస్తోంది.
జంధ్యాల శరత్ బాబు
9948345013
రామకృష్ణులది దివ్య చరితం. అది నిరంతర కథామృతం. అన్ని యోగాల సారాన్ని ఒడిసిపట్టిన బోధన ఆయనది. అనేక మానవ నవ సందేహాలు, సమస్యలకు భవ్య దివ్య పరిష్కారాలు ఆయనవి. అవన్నీ వేద ప్రబోధానికి ఆచరణీయ సాధన మార్గాలే. ఆయన సరికొత్త సిద్ధాంతమేదీ ప్రతిపాదించలేదు. భక్తి ఉద్యమంలాంటిది సాగించాలని ప్రయత్నించలేదు. విరివిగా పుస్తక రచనలు కొనసాగించలేదు. తన విశ్వాసాల వ్యాప్తి గురించి కనీస ఆలోచనైనా చేసేవారు కాదు. దైవం ఉనికి గురించి మాత్రమే పరితపించిన మనసు ఆయనది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం