సంకల్ప శుద్ధితో ఉపవాసం
ABN , Publish Date - Feb 20 , 2026 | 04:02 AM
రంజాన్ ఉపవాస దీక్ష పాటించడానికి ముందు సహరీ, ఇఫ్తార్‌ల గురించి పరిజ్ఞానం ఉండడం చాలా అవసరం. నిర్ణీత సమయానికి ముందు కానీ, సమయం దాటిన తరువాత కానీ సహరీ, ఇఫ్తార్ చేస్తే ఉపవాసం...
సందేశం
రంజాన్ ఉపవాస దీక్ష పాటించడానికి ముందు సహరీ, ఇఫ్తార్‌ల గురించి పరిజ్ఞానం ఉండడం చాలా అవసరం. నిర్ణీత సమయానికి ముందు కానీ, సమయం దాటిన తరువాత కానీ సహరీ, ఇఫ్తార్ చేస్తే ఉపవాసం వ్యర్థమయ్యే ప్రమాదం ఉంది. నమాజ్‌లో కానీ, రోజా (ఉపవాసం)లో కానీ, హజ్ సమయంలో కానీ సమయపాలనకు, క్రమశిక్షణకు ఇస్లాం చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ఏది చేసినా పరిజ్ఞానంతో చేయాలి. దానికోసం అంతిమ మహాప్రవక్త మహమ్మద్ తన ఆచరణ ద్వారా నిర్ధారించిన నియమాలను మాత్రమే అనుసరించాలి. ‘‘రాత్రి నల్లదనం నుంచి ఉషోదయపు తెల్లదనం ప్రస్ఫుటం అయ్యేవరకూ ఆహారం, పానీయాలు తీసుకోండి. తరువాత రాత్రి చీకటి పడేవరకూ ఉపవాసం ఉండండి’’ అని దీని గురించి దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ ఆదేశించారు.
సహరీ, ఇఫ్తార్ అంటే...
రాత్రి చివరి, మూడో జాములో చేసే భోజనాన్ని ‘సహరీ’ అంటారు. ‘‘సహరీ పాటించండి. అందులో మీకు చాలా శుభం ఉంది’’ అని దైవ ప్రవక్త తెలిపారు. ‘‘మీలో మంచి వైపు పిలిచేవారు, చెడు వైపు వెళ్ళకుండా వారించేవారు తప్పకుండా ఉండాలి. అటువంటి వారికి శిక్షణ సహరీ నుంచే లభిస్తుంది. సహనం, సమయపాలన, త్యాగం, ఓర్పు, క్షమ, లైంగిక వాంఛలను అదుపులో ఉంచడం, మనో నిగ్రహం, జవాబుదారీతనం... వీటన్నిటికి దారి ఏర్పడుతుంది. దీనికి సంకల్పశుద్ధి తప్పనిసరి. ఇతరుల మెప్పుకోసం కాఉండా, అల్లాహ్ ప్రసన్నతను, అనుగ్రహాన్ని పొందడానికే చెయ్యాలి. కాబట్టి మనసులో గట్టిగా సంకల్పించుకోవాలి’’ అని ఉపదేశించారు. ఇక, మగ్రిబ్ నమాజ్‌కు ముందు ఉపవాసాన్ని విరమిస్తూ తీసుకొనే ఆహారాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. సూర్యుడు అస్తమించిన వెంటనే ఇఫ్తార్ చేయాలి. జాప్యం చేయకూడదు. ఎందుకంటే ఉపవాస లక్ష్యం ఆకలితో ఉంచడం కాదు... విధేయతా భావం జనించడానికి మాత్రమే.
సుగుణాలు పెరగడానికి...
రంజాన్ మాసం స్నేహ సంబంధాలను పెంపొందించే నెల. తోటివారికి సేవలందించే నెల. తమ ప్రేమను, ఆనందాన్ని తినుబండారాల రూపంలో, రుచికరమైన ఫలాల రూపంలో ఇఫ్తార్ సమయంలో పంచుతారు. ఇది చాలా పుణ్యప్రదమైన కార్యం. ‘‘ఉపవాసం పాటించిన వ్యక్తితో ఇఫ్తార్ చేయించినవారి అపరాధాలను అల్లాహ్ మన్నించడం జరుగుతుంది. అతను చేసే ఈ సత్కార్యం అతణ్ణి నరకాగ్ని నుంచి విమోచనం కలిగించే సాధనం. ఇఫ్తార్‌లో ఖర్జూర పండ్లు వినియోగించడం ప్రవక్త సంప్రదాయం. ఇఫ్తార్ సమయంలో ఉపవాసం చేసిన వ్యక్తి చేసిన విజ్ఞాపనను దైవం స్వీకరిస్తాడు. తిరస్కరించడు’’ అని ‘హదీస్’ గ్రంథం స్పష్టం చేస్తోంది. ఉపవాసాల ద్వారా మనిషి ఆకలి అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. తద్వారా సమాజంలోని నిరుపేదలను, అన్నార్తులను ఆదుకొనే గుణం అలవడుతుంది. ఉపవాస వ్రతం వల్ల మనిషిలో దైవభీతి, పాపభీతి, జవాబుదారీతనం లాంటి సుగుణాలు జనిస్తాయి.
మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం