విషం ఇచ్చి మోక్షం పొందింది!
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:33 AM
నందుడు మధురను పాలించే కంసరాజుకు సామంతుడు. అతనికి ఏటేటా కప్పం కట్టాలి. దాని కోసం మధుర వెళ్ళాడు. పనిలో పనిగా మిత్రుడు వసుదేవుణ్ణి చూద్దామని అతని నివాసానికి వెళ్ళాడు....
భాగవతం
నందుడు మధురను పాలించే కంసరాజుకు సామంతుడు. అతనికి ఏటేటా కప్పం కట్టాలి. దాని కోసం మధుర వెళ్ళాడు. పనిలో పనిగా మిత్రుడు వసుదేవుణ్ణి చూద్దామని అతని నివాసానికి వెళ్ళాడు. పరస్పర కుశల ప్రశ్నల తరువాత ‘‘మీకు పుత్రుడు కలిగాడని విని సంతోషించాం. మీకు గొప్ప భాగ్యశాలులు’’ అన్నారు నందుడితో దేవకీ వసుదేవులు. రోహిణి గర్భాన జన్మించిన బలరాముడి గురించి వాళ్ళు ప్రస్తావిస్తున్నారని నందుడు అనుకున్నాడు. చిన్ని కృష్ణుడు దేవకి కడుపున పుట్టిన బిడ్డ అతనికి తెలీదు. ‘‘మీకు పుట్టిన బిడ్డలందరినీ ఆ పాపిష్టి కంసుడు పొట్టన పెట్టుకున్నాడు. అంతా విధి విలాసం’’ అని దేవకీ వసుదేవులను నందుడు అనునయించాడు. అంతలో వసుదేవుడికి గోకులంలో కొన్ని ఉత్పాతాలు ఆలోచనల్లో గోచరించాయి. ‘‘నందా! నువ్వు ఎక్కడా ఆగకుండా వెంటనే వ్రజపురానికి వెళ్ళు. నాకేదో భయం వేస్తోంది’’ అని హెచ్చరిస్తూ మిత్రుణ్ణి తొందర చేశాడు.
నందవ్రజంలో కలకలం
ఇదిలా ఉండగా... నందవ్రజం వీధుల్లో ఒక యువతి గోకులవాసులకు కనిపించింది. సౌందర్య నిధిలా ఉన్న ఆమె ఠీవిగా నడిచి వెళుతూ ఉంటే... ‘ఎవరీమె? మునుపెన్నడూ మన గోకులంలో చూడలేదే!’ అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఆమె నందుని ఇంటికి వెళ్ళింది. ‘యశోదమ్మకోసం వచ్చిన స్నేహితురాలు కాబోలు’ అని అనుకున్న గోపవనితలు ఆమెకు ఎదురు వెళ్ళారు. ‘‘రండి. ఎక్కడినుంచి వచ్చారు? ఎవరు కావాలి?’’ అని అడిగారు. ఆమె ఏమి చెప్పాలో తెలియక అటూ ఇటూ చూస్తూ... ఊయలలో ఉన్న పసివాణ్ణి చేతుల్లోకి తీసుకొని ముద్దాడింది. కానీ లోకేశ్వరుడైన కృష్ణయ్యకు వచ్చిందెవరో తెలియకపోతేగా! అతను మందహాసం చేశాడు. పసివాణ్ణి ఆమె ముద్దాడుతూనే... గుండెలకు చేర్చుకొని స్తన్యం ద్వారా విషం ఇవ్వడానికి ప్రయత్నించింది. కృష్ణయ్య కూడా ఆమె పైకి ఎగబాకాడు. వద్దని యశోద ఎంత వారించినా వినకుండా... ఆమె ఆ పసివాడికి పాలు ఇచ్చింది. శిశువు ఒక గుటక వేశాడు. సుందరాంగి కళ తప్పింది. మరొక గుటక వేశాడు. ప్రాణాలను పట్టి లాగినంతగా బాధపడుతూ మెలికలు తిరిగింది. మూడో గుటక వెయ్యబోతూ ఉండగా... ఆమె చావు భయంతో పెద్దగా అరిచింది. పసివాణ్ణి పక్కకు తోసేసింది.
బాల కృష్ణుడి చిద్విలాసం
ఆమె అరుపులకు నందగోకులం గజగజలాడిపోయింది. ఆమె సుందర శరీరం వికృతంగా మారి, పర్వతంలా నేల కూలింది. ఆ ధ్వనికి భూమి దద్దరిల్లింది. కానీ కృష్ణయ్య మాత్రం ఏమీ ఎరగనట్టు వెల్లకిలా పడి ఉన్న ఆమె గుండెల మీద కూర్చొని, నవ్వుతూ ఆడుకుంటున్నాడు. ఇది చూసిన యశోద, రోహిణి, తక్కిన గోపకాంతలు ఆ లీలా శిశువును దూరంగా తీసుకువెళ్ళారు. స్నానం చేయించారు. అతని పాలబుగ్గ మీద చుక్కపెట్టారు. దృష్టి తీశారు, రక్షలు కట్టారు. మధుర నుంచి తిరిగి వచ్చిన నందుడు... మహా పర్వతంలా పడి ఉన్న ఆ శరీరాన్ని చూశాడు. జరిగినదంతా విన్నాడు. మధురలో వసుదేవుడు చేసిన హెచ్చరిక గుర్తుకువచ్చింది. మనసులోనే మిత్రుడికి కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు. ఇదంతా గమనిస్తున్న జగద్రక్షకుడైన స్వామి చిద్విలాసంగా నవ్వుకున్నాడు.
పూర్వజన్మలో రత్నమాల
ఆ రాక్షసి ఎవరో మీకు తెలుసు... పూతన. కంసుడి అనుచరురాలు. కంసుణ్ణి చంపేవాణ్ణి వెతుక్కుంటూ వచ్చి, చివరకు అతని చేతుల్లోనే చచ్చింది. ఏమైతేనేం... అదృష్టవంతురాలు. కృష్ణదేవుని స్పర్శతో ఆమె పాపాలన్నీ తొలగిపోయి పరమపదం చేరుకుంది. పూతన పూర్వ జన్మలో బలి దానవుడి కుమార్తె. పేరు రత్నమాల. బలిని పాతాళానికి పంపడానికి వామనుడిగా శ్రీహరి అతని యజ్ఞవాటికకు వెళ్ళాడు. అక్కడే ఉన్న రత్నమాల... వామనుణ్ణి చూసి ‘చక్కని వటువు. మనోహరంగా ఉన్నాడు. అతణ్ణి ఎత్తుకొని పాలు ఇచ్చిన తల్లి ఎవరో! ఆ అదృష్టం నాకు లేకపోయింది’ అని వ్యధ చెందింది. అది గ్రహించిన శ్రీహరి... ఈ విధంగా ఆమె కోరికను తీర్చాడు.
ఆ కథ మనకు ఏం చెబుతోంది?
పూతన అందమైన రూపంలో ఎంతో అమాయకంగా యశోద ఇంటికి వచ్చింది. ఎంతో ప్రేమను నటించింది. కానీ లోపల విషాన్ని దాచుకుంది. ఇదే విధంగా సమాజంలో మంచిగా, నమ్మకంగా కనిపిస్తూనే మోసపూరితమైన ఆలోచనలు ఉన్నవారు ఉంటారు. కాబట్టి బాహ్య రూపాన్ని చూసి, ఆకర్షించే మాటలను విని మోసపోకూడదు. అదే విధంగా, పూతన కథ చెడుపై ఎప్పటికీ మంచిదే విజయం అని చెబుతుంది. కృష్ణుణ్ణి చంపడానికి వెళ్ళిన ఆమె నాశనంకాక తప్పలేదు. తనను చంపాలనే ఉద్దేశంతోనే పూతన వచ్చినప్పటికీ... తనకు తల్లిలా పాలు ఇచ్చినందుకు ఆమెకు స్వామి ఉత్తమ గతులను ప్రసాదించాడు. కపటంతోనైనా సరే... తనను ఆశ్రయించేవారికి ఆయన సద్గతి ప్రసాదిస్తాడని పూతన ఉదంతం తెలియజేస్తోంది.
ప్రయాగ రామకృష్ణ
ఈ వార్తలనూ చదవండి
వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్