వివేకమే చుక్కాని
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:46 AM
రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను, మధుమేహాన్ని శ్రద్ధగా నియంత్రించుకొనే రోగులు ఒక కార్డియాలజిస్టుగా నా వృత్తిలో తరచూ నాకు తారసపడుతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఒత్తిడితో...
యోగా
రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను, మధుమేహాన్ని శ్రద్ధగా నియంత్రించుకొనే రోగులు ఒక కార్డియాలజిస్టుగా నా వృత్తిలో తరచూ నాకు తారసపడుతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఒత్తిడితో, ఆందోళనతో, నిరంతర అసమతుల్యతా భావంతో పోరాడుతూనే ఉంటారు. ఇది గమనించినప్పుడు... ఆరోగ్యం అంటే వ్యాధి లేకపోవడం మాత్రమే కాదనీ, అది శరీరం, మనస్సు, ఆత్మల సామరస్యపూర్వకమైన పనితీరు అని స్పష్టమవుతుంది. ఆ సామరస్యాన్ని సాధించడంలో మనకు సహాయపడే అత్యంత విలువైన గుణాల్లో ఒకటి- వివేకం. ‘విచక్షణ’ అనే పర్యాయపదం కూడా దానికి ఉంది. ప్రయోజనమైనదానికి, హానికరమైనదానికి, తాత్కాలికమైన దానికి, శాశ్వతమైన దానికి, ఆవేశానికి, జ్ఞానానికి మధ్య తేడాను గుర్తించగలిగే సామర్థ్యమే వివేకం. అది మనల్ని సమతుల్యమైన జీవితం వైపు నడిపించే అంతర్గత దిక్సూచి. ధ్యానం మనలోని చైతన్యాన్ని శుద్ధి చేసి, విచక్షణ శక్తిని మేలుకొలుపుతుందని మన దేశానికి చెందిన ఋషులు ఎప్పుడో బోధించారు.
నచికేతుని పాఠం
నచికేతుడు అనే యువ సాధకుడి కథ ద్వారా వివేకం తాలూకు ప్రాధాన్యతను ‘కఠోపనిషత్తు’ చక్కగా వివరించింది. అతను తన తండ్రి కృత్రిమ కానుకలను ప్రశ్నించి, మృత్యు దేవుడైన యముని ముందు నిలబడ్డాడు. యముడు సంపద, అధికారం, సుఖం, దీర్ఘాయువులను ఇవ్వజూపినా... నచికేతుడు వాటికి బదులు జ్ఞానాన్ని ఎంచుకున్నాడు. ఆత్మ తాలూకు సత్యాన్ని అన్వేషించాడు. నచికేతుడి వివేచనకు యముడు ముగ్ధుడై... శ్రేయ (మంచి), ప్రేయ (సుఖం) మధ్య భేదాన్ని బోధించాడు. ‘‘మంచి, సుఖం మనిషికి ఎదురవుతాయి. వివేకులు మంచిని ఎంచుకుంటారు. అవివేకులు సుఖాన్ని ఎంచుకుంటారు’’ అని చెప్పాడు. అదే వివేకం తాలూకు స్వచ్ఛమైన రూపం... ఆకర్షణీయంగా ఉన్నదానికి బదులు సరైన దాన్ని ఎంచుకొనే సామర్థ్యం.
ఆధునిక జీవితంలో వివేకం
ప్రతిరోజూ మనకు ఇలాంటి ఎంపికలు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆలవాట్లా? తక్షణమైన సంతృప్తా? అవగాహనా, కోపమా? అంతర్గత సంతృప్తా, అంతులేని కోరికా?... మన శారీరక, మానసిక శ్రేయస్సు చాలావరకూ ఇలాంటి ఎంపికలమీదే ఆధారపడి ఉంటుంది. వివేకం బలహీనంగా ఉన్నప్పుడు... మనల్ని ఆవేశాలు, భావోద్వేగాలు, బాహ్యమైన ప్రభావాలు నడిపిస్తాయి. ఇటువంటి జీవనం తరచుగా ఒత్తిడికి, అనారోగ్యకరమైన జీవనశైలికి, సంబంధాలు దెబ్బతినడానికి, చివరకు శారీరక అనారోగ్యానికి దారి తీస్తుంది. వివేకం బలంగా ఉన్నప్పుడు మనం సహజంగానే సమతుల్యతవైపు మొగ్గు చూపుతాం.
వివేకాన్ని పెంచే ధ్యానం
ధ్యానం కేవలం ఒక రిలాక్సేషన్ పద్ధతి మాత్రమే కాదు. మనం గ్రహించే శక్తిని శుద్ధి చేసే పరివర్తనాత్మకమైన ఒక ప్రక్రియ. ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ధ్యానంలో... మనసు ప్రశాంతంగా, హృదయం తేలికగా మారేకొద్దీ... మన జీవితాన్ని మరింత స్పష్టంగా గ్రహించడం ఆరంభిస్తాం. ఈ అంతర్గత స్పష్టత సహజంగానే వివేకంగా వ్యక్తమవుతుంది. ‘‘హృదయం నిర్మలంగా ఉన్నప్పుడు... ఏది సరైనదో, ఏది కాదో మనకు సహజంగానే తెలుస్తుంది. అప్పుడు జ్ఞానం మన చర్యలకు మార్గనిర్దేశం చేస్తుంది’’ అని దాజీ బోధించారు. ఆయన చెప్పిన జ్ఞానం... వివేకం తప్ప మరొకటి కాదు. విచక్షణ లోతుగా పెరిగేకొద్దీ... జీవితంలో సంక్లిష్టత తగ్గుతుంది. గుడ్డిగా ప్రతిస్పందించడం మానేసి, చేతనతో స్పందించడం ఆరంభిస్తాం. ప్రేమ, కరుణ, ఆరోగ్యం, అర్థవంతమైన సంబంధాలు, అంతర్గతమైన ఎదుగుదల లాంటి వాస్తవికంగా ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం నేర్చుకుంటాం.
శ్రేయో హృదయం
జీవితంలో గొప్ప ఎంపికలు ఎల్లప్పుడూ మంచి చెడుల మధ్య ఉండవనీ, చాలా సందర్భాల్లో ఆహ్లాదమైనదానికీ, నిజంగా ప్రయోజనకరమైనదానికి మధ్య ఉంటాయని నచికేతుడి కథ మనకు గుర్తు చేస్తుంది. ధ్యానం అంతర్గత నిశ్చలతను పెంపొందిస్తుంది. వివేకం దానినుంచే పుడుతుంది. సమతుల్యతను కాపాడుకోవడంలో వివేకం మనకు సాయపడుతుంది. భావోద్వేగ సామరస్యాన్ని సమతుల్యత పెంపొందిస్తుంది. భావోద్వేగ సామరస్యం శారీరకమైన ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుండెను ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుందో ఒక కార్డియాలజిస్టుగా నేను ప్రతిరోజూ చూస్తాను. ధ్యానం జీవితాలను అంతర్గతంగా ఎలా మారుస్తుందో కూడా హార్ట్‌ఫుల్‌నెస్ శిక్షకుడిగా గమనిస్తూ ఉంటాను. ఈ రెండు పరిశీలనల మధ్య వారధి... వివేకం. అంటే తెలివిగా ఎంచుకొనే జ్ఞానం. మనం ధ్యానం ద్వారా విచక్షణను పెంపొందించుకున్నప్పుడు... మనం జీవితాలకు కేవలం సంవత్సరాలనే కాకుండా... మనం జీవించే ప్రతి క్షణానికి గాఢతను, అర్థాన్ని, సమతుల్యతను జోడిస్తాం. ఆధ్యాత్మిక ప్రయాణంలాగానే... నిజమైన ఆరోగ్య ప్రయాణం కూడా హృదయంలోనే ప్రారంభమవుతుంది.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్
ట్రైనర్ హార్ట్‌ఫుల్‌నెస్, 9440087532
ఇవి కూడా చదవండి..
కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్
పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష
Read Latest TG News And Telugu News