నోరు మంచిదైతే...
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:07 AM
‘‘మంచి మాట ఒక మంచి వృక్షం లాంటిది. దాని వేరు గట్టిగా ఉంటుంది. దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతాయి. అది ప్రభువు ఆజ్ఞతో ప్రతి కాలంలోనూ ఫలాలను ఇస్తుంది’’ అని పవిత్ర ఖుర్‌ఆన్‌లో...
సందేశం
‘‘మంచి మాట ఒక మంచి వృక్షం లాంటిది. దాని వేరు గట్టిగా ఉంటుంది. దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతాయి. అది ప్రభువు ఆజ్ఞతో ప్రతి కాలంలోనూ ఫలాలను ఇస్తుంది’’ అని పవిత్ర ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ చెప్పాడు. ఈ మాటలు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మంచి మాటలు విత్తనం లాంటివి. అవి హృదయంలో నాటుకుంటే... ప్రేమ, విశ్వాసం, కరుణ, క్షమ, సోదరభావం అనే ఫలాలను ఇస్తాయి. తోటి మనిషి హృదయాన్ని చేరుకొనే దారి చాలాసార్లు మాటల ద్వారానే ఉంటుంది. కత్తి గాయం కాలంతో మానిపోవచ్చు. కానీ కఠినమైన మాటలు చేసే గాయం కొన్నిసార్లు జీవితాంతం మానదు. అందుకే నాలుకను జాగ్రత్తగా ఉపయోగించాలని ఇస్లాం పదేపదే బోధిస్తుంది.
దైవ ప్రవక్త మహమ్మద్ తన జీవితమంతా మృదు భాషణకు ప్రతీకగా, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎవరినీ అవమానించడం, దూషించడం ఎన్నడూ చేయలేదు. చిన్నవారిని ప్రేమగా, పెద్దవారిని గౌరవంగా పలకరించేవారు. ఆయన ముఖంలో చిరునవ్వు, నోటిలో తీయని మాట ఎప్పుడూ ఉండేవి. ఒకసారి మసీదులో ఒక గ్రామీణుడు తెలియక తప్పు చేశాడు. మిగినవారందరూ అతనిపై కోపగించుకున్నారు. దైవ ప్రవక్త వారిని ఆపి... ఆ వ్యక్తికి ప్రేమతో, ఓర్పుతో సరైన మార్గాన్ని వివరించారు. తన మృదువైన మాటలతో అతని తీరును మార్చారు. కోపంతో చేసే ఉపదేశం కన్నా... ప్రేమతో చెప్పిన ఒక్క మాట ఎక్కువ ప్రభావం చూపుతుంది.
సమాజాన్ని పరిశీలిస్తే... చాలా కుటుంబాలు విడిపోవడానికి, స్నేహాలు తెగిపోవడానికి, బంధాలు దూరమవడానికి... నియంత్రణ లేని నాలుకే కారణమవుతోంది. పిల్లల్ని ప్రోత్సహించేలా తల్లిదండ్రులు మాట్లాడితే వారు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. భార్యాభర్తలు పరస్పర గౌరవంతో మాట్లాడుకొనే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. పొరుగువారితో మృదువుగా మాట్లాడితే... సమాజంలో సోదరభావం ఏర్పడుతుంది. ఖుర్‌ఆన్ చదివి, అల్లాహ్‌ను స్మరించే నోటితో ఎవరినైనా బాధ పెట్టడం ఎంత తప్పో ఆలోచించుకోవాలి. ‘‘ఈ రోజు నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట అల్లాహ్‌కు ఇష్టమైనదే కావాలి. నా మాటతో ఎవరి హృదయాన్ని నొప్పించకూడదు. నా మాట వల్ల కనీసం ఒక్క మనిషి ముఖంలోనైనా చిరునవ్వు పూయాలి’’ అని ప్రతి రోజూ ఉదయం సంకల్పం చేసుకోవాలి. తీయని మాటలు కేవలం మనుషుల హృదయాన్ని గెలవడమే కాదు, అల్లాహ్ కరుణకు కూడా పాత్రమవుతాయి. ప్రపంచంలో ప్రేమను పెంచుతాయి.
మహమ్మద్ వహీదుద్దీన్
ఈ వార్తలనూ చదవండి:
ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!
ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు