ఫ్యాషన్ పోల్కీ చోకర్స్...
ABN , Publish Date - Jul 27 , 2026 | 05:58 AM
భారీగా కనిపిస్తున్నప్పటికీ తేలికగా ఉంటూ రాజసాన్ని ఒలికించే ఫ్యాషన్ పోల్కీ చోకర్స్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. సానపట్టని అన్‌కట్ డైమండ్లతో వీటిని రూపొందిస్తారు...
భారీగా కనిపిస్తున్నప్పటికీ తేలికగా ఉంటూ రాజసాన్ని ఒలికించే ఫ్యాషన్ పోల్కీ చోకర్స్ ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. సానపట్టని అన్‌కట్ డైమండ్లతో వీటిని రూపొందిస్తారు. సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్లకు తగ్గట్టు విభిన్నమైన సింపుల్ డిజైన్లు ఎన్నో నేడు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పటి రాణుల నగలను తలపిస్తూ వింటేజ్ లుక్‌తో మెరిసే ఈ ఫ్యాషన్ పోల్కీ చోకర్ల వివరాలు మీకోసం...
సంప్రదాయ పోల్కీ నగల మాదిరిగానే వీటిని మెడకు హత్తుకుని ఉండేలా తయారుచేస్తారు. స్వచ్ఛమైన బంగారు లేదా వెండి రేకులను చోకర్ ఆకారంలో మలిచి వాటిపై రకరకాల డిజైన్లు రూపొందిస్తారు. ఈ డిజైన్లలోనే పోల్కీలను పొదుగుతారు. పోల్కీలకు అద్దంలాంటి మెరుపు వచ్చేందుకు ఈ డిజైన్లలో అత్యంత సూక్ష్మమైన బంగారు లేదా వెండి పొరను అతికిస్తారు. రత్నాలను జోడించేటప్పుడు వాటి అంచుల చుట్టూ సన్నని బంగారం, వెండి, లక్క పట్టీలను అమరుస్తారు. ముత్యాలు, లోరియల్స్ (రంగుల పూసలు) వేలాడదీసి అదనపు హంగులద్దుతారు. మెడలో ధరించడానికి వీలుగా మెత్తటి పత్తి దారాన్ని డోరీలా తయారుచేసి జతచేస్తారు. చివరగా పాలిష్ చేసి అందంగా మెరిసే పోల్కీ చోకర్లను అందుబాటులోకి తెస్తారు. ముత్యాల గుత్తులు చేర్చిన రాయల్ పెర్ల్స్ పోల్కీ చోకర్లను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పెద్ద పెద్ద కెంపులు, పచ్చలతో కూడిన మల్లీలేయర్డ్ పోల్కీ సెట్లకు డిమాండ్ అధికంగా ఉంటోందంటున్నారు డిజైనర్లు. సెలబ్రిటీల నుంచి సామాన్య మహిళల వరకు అందరూ వీటికే ఓటేస్తున్నారు. ఫ్లవర్ మోటి్‌ఫలతో రూపొందించినవి, బీడ్స్ జతచేసినవి, యాంటిక్ లుక్‌తో మెరిసేవి కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి.
డీప్ నెక్‌తో ఉన్న లెహంగాలు, అనార్కలీ డ్రెస్‌లపై మల్టీలేయర్డ్ పోల్కీ చోకర్లు ధరిస్తే గ్రాండ్ లుక్ వస్తుంది. డిజైనర్ బ్లౌజ్‌తో పట్టుచీరలు కట్టుకున్నప్పుడు కూడా వీటిని పెట్టుకోవచ్చు. ఫ్యూజన్ వేర్, మోడరన్ గౌన్లమీద మినిమలిస్టిక్, సింగిల్ స్ట్రింగ్ ఫ్యాషన్ పోల్కీ చోకర్లు బాగుంటాయి. ఆఫ్ షోల్డర్, స్ట్రాప్‌లెస్ డ్రెస్‌లపై బోల్డ్ పోల్కీ సెట్లు, మింట్ ఫ్లోరైట్ లేదా మదర్ ఆఫ్ పెర్ల్ చోకర్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పచ్చలు, కెంపులు చేర్చి చోకర్ వెనక ఎనామెల్ రంగులతో మీనాకారి డిజైన్ చేసిన పోల్కీ సెట్లు పెళ్లికూతురి అలంకరణకు చక్కగా సూటవుతాయి. ఆక్సిడైజ్డ్ సిల్వర్ ప్లేటింగ్, మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్‌తో ఉన్న చోకర్లు ఇండో వెస్ట్రన్ డ్రెస్‌లపై మోడరన్ లుక్‌నిస్తాయి. పోల్కీ చోకర్స్ పెట్టుకున్నప్పుడు లూజ్ హెయిర్ స్టయిల్స్ నప్పవు. టైట్ అప్డో, హై పోనీటయిల్, అందమైన బన్ స్టయిల్స్ వేసుకుంటే బాగుంటుంది. చెవులకు సన్నని పొడవాటి డాంగ్లర్లకు బదులు వెడల్పాటి పోల్కీ స్టడ్స్, పొట్టిగా ఉండే భారీ జుంకాలు పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు.
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు