Share News

పితృపక్షం... మహాలయం

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:07 AM

భాద్రపద మాసం శుక్ల పక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకూ... ప్రతి సంవత్సరం ఈ పదిహేను రోజులను ‘మహాలయ పక్షం’ లేదా ‘పితృపక్షం’ అని పిలుస్తారు. పితృదేవతలకు తర్పణాలు, పిండ...

పితృపక్షం... మహాలయం

విశేషం

భాద్రపద మాసం శుక్ల పక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకూ... ప్రతి సంవత్సరం ఈ పదిహేను రోజులను ‘మహాలయ పక్షం’ లేదా ‘పితృపక్షం’ అని పిలుస్తారు. పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు నిర్వహించడానికి తద్వారా వారిని తలచుకోవడానికి పూర్వులు నిర్దేశించిన పుణ్యకాలం ఇది. ఈ పక్షంలో ఆఖరి రోజైన అమావాస్యను ‘మహాలయ అమావాస్య’, ‘సర్వపితృ అమావాస్య’ అంటారు.

మహాలయ పక్షం ప్రాధాన్యత గురించిన కథలు పురాణాల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. పితృదేవతలకు ఈ 15 రోజులు యమధర్మరాజు స్వల్ప విరామాన్ని ఇచ్చి... వారి వారి సంతతిని సందర్శించడానికి అనుమతి ఇస్తాడట. ఆ సమయంలో పితృదేవతలు వాయు రూపంలో తమ వారసుల ఇళ్ళకు వస్తారనే నమ్మకం ఉంది. అలాగే కర్ణుని వృత్తాంతం కూడా ప్రసిద్ధమైనదే. దాని ప్రకారం... మహాభారత యుద్ధంలో మరణించిన కర్ణుడు తాను చేసిన దాన ధర్మాల ఫలితంగా స్వర్గానికి చేరాడు. అక్కడ అతనికి ఆహారంగా బంగారం, వెండి మాత్రమే లభించేది. దీనికి కారణమేమిటని అతను యముణ్ణి అడిగినప్పుడు... ‘‘నువ్వు ఎన్నో దాన ధర్మాలు చేశావు. కానీ ఎన్నడూ పితృకర్మలు చేయలేదు’’ అని చెప్పాడు. యముడి అనుమతితో కర్ణుడు 15 రోజుల పాటు భూలోకానికి వచ్చి... పితృదేవతలకు తర్పణాలు వదిలి, పిండ ప్రదానం నిర్వహించి, అన్నదానాలు చేశాడు. అప్పటి నుంచి ఆ రోజులను ‘మహాలయ పక్షం’గా పాటిస్తున్నారు.

ఇలా చేయాలి...

గతించిన పూర్వులకు, కుటుంబంలో అకాల మరణం చెందినవారికి ప్రతి సంవత్సరం శ్రాద్ధ తిథులను నిర్వహించడం కొందరికి వీలు కాకపోవచ్చు. అలాగే జాతకరీత్యా పితృదోషాలు ఉండవచ్చు. అటువంటివారు మహాలయ పక్షంలో శ్రార్థ కర్మలను నిర్వహించడం ద్వారా పితృదేవతల ఆశీస్సులు పొందుతారని, పితృదోషాల నుంచి విముక్తి పొందుతారని శాస్త్రవాక్యం. మహాలయ పక్షంలో ప్రతిరోజూ ప్రత్యేకమైనదే, ఆయా రోజుల్లో నిర్వహించాల్సిన నిర్దేశిత కర్మలు ఉన్నాయి. అయితే ఆఖరి రోజైన అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తమ పూర్వీకులు మరణించిన తిథి తెలియనప్పుడు... అమావాస్య నాడు పిండ ప్రదానాలు, తర్పణాలు నిర్వహిస్తే... వారికి ఫలితాలు అందుతాయి. బంధువులకు, స్నేహితులకు, బాగా కావలసినవారికి కూడా మహాలయ పక్షంలో తర్పణాలు, పిండప్రదానాలు నిర్వహించవచ్చు. అలాగే పేదలకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, పక్షులకు... ప్రధానంగా కాకులకు, జంతువులకు ఆహారం పెట్టడం, పురోహితులకు స్వయంపాకాలు ఇవ్వడం శ్రేయస్కరమని, పితృదేవతలు సంతృప్తి చెందితేనే కుటుంబ వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని పెద్దలు చెప్పారు.

సి.ఎన్‌.మూర్తి

8328143489

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ..

హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగపడిన అభిమానులు..

Updated Date - Oct 02 , 2026 | 05:07 AM