పరిణామం ఆగిపోతేం
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:26 AM
మనిషి జీవితంలో స్తబ్దత అంటే... పరిణామం చెందడం ఆగిపోవడం. స్తబ్దతను మనం వ్యక్తిగత వైఫల్యంగా, ఆ వ్యక్తికి మాత్రమే నష్టం కలిగిస్తుందని అనుకుంటాం. కానీ జీవితంలోని...
యోగా
మనిషి జీవితంలో స్తబ్దత అంటే... పరిణామం చెందడం ఆగిపోవడం. స్తబ్దతను మనం వ్యక్తిగత వైఫల్యంగా, ఆ వ్యక్తికి మాత్రమే నష్టం కలిగిస్తుందని అనుకుంటాం. కానీ జీవితంలోని వివిధ దశల్లో పరిణామం చెందడం ఆపేసిన వ్యక్తి... తనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి ఎదుగుదలను నిశ్శబ్దంగా అడ్డుకుంటాడు. కార్డియాలజిస్టుగా, హార్ట్‌ఫుల్‌నెస్ అభ్యాసకుడిగా... విభిన్నమైన ఆ రెండు రంగాల్లోనూ ఇది జరగడం గమనించాను. అది... ‘మనం నిరంతరం ఎలా పరిణామం చెందాలి? ఆ మార్గంలో కొనసాగడానికి తగిన స్ఫూర్తిని మనకు ఏది ఇస్తుంది? అన్నిటికన్నా ముఖ్యంగా, మన చుట్టూ ఉన్నవారు దానికి మూల్యం చెల్లించేలోపు మనం ముందుకు సాగడం ఆపేశామని ఎలా గుర్తించాలి?’ అనే ప్రశ్నలవైపు నన్ను నడిపించింది.
మనలోని స్తబ్దతను గుర్తించడానికి రెండు విషయాలు అవసరం. మొదటిది వినయం, ఆ తరువాత ‘మీరు ఏది కాగలరు?’ అనే అవగాహన. వినయం లేకుండా మీ లోపాన్ని మీరు అంగీకరించలేరు. లోపాన్ని అంగీకరించకపోతే... భవిష్యత్తులో మీరు ఏది కాగలరనేది లెక్కించే ప్రమాణం ఉండదు. నా వృత్తినే తీసుకుంటే... నాకు ఏదైనా నాకు తెలియదని అంగీకరించడానికి నిరాకరిస్తే... దాన్ని నేర్చుకొనే అవకాశాన్ని కోల్పోతాను. నేను నేర్చుకోకపోతే, అందుబాటులో ఉన్న ఆధునికమైన, అత్యంత ప్రభావవంతమైన సంరక్షణను రోగులకు అందించలేను. వేరేలా చెప్పాలంటే... నా స్తబ్దత ప్రభావం నామీద పడకముందే నా రోగుల మీద పడుతుంది. ఈ తర్కాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే... జీవితంలోని ఏ దశలోనైనా ఎదుగుదలను పరిశీలించకుండా నిరోధిస్తే... అది మనకే కాదు, మన చుట్టూ ఉన్నవారికి కూడా హాని చేస్తుంది.
ప్రేరణ ఎలా పొందాలి?
మరి విజ్ఞాన శాస్త్రంలోనైనా, ఆధ్యాత్మికతలోనైనా నిరంతరం పరిణామం చెందడానికి అవసరమైన ప్రేరణ ఎలా పొందగలం? ఈ రెండు రంగాల్లోనూ... వినయమే మనల్ని మనం నిజాయితీగా పరిశీలించుకొనేలా చేస్తుంది. ‘మనం ఏది కాగలం?’ అనే అవగాహనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సైన్సుకు, ఆధ్యాత్మికతకు ఉన్న వ్యత్యాసం ప్రక్రియలో కాదు... ఆధారంలో ఉంది. ప్రత్యక్షంగా కానీ, పరికరాల ద్వారా కానీ గ్రహించే విషయాలతో సైన్స్ వ్యవహరిస్తుంది. సైన్స్‌లో అవగాహనను అనేక స్వతంత్ర వనరుల నుంచి పొందగలం. అయితే... ఇంద్రియాలకు అతీతమైన దాని గురించిన ఆధ్యాత్మికతను మనం అదే విధంగా పొందడం సాధ్యం కాదు. అంతర్గతమైన జాగృతికి సంబంధించి ఏ ప్రయోగం కూడా వేరొకరి విషయంలో ఒకే ఫలితాన్ని ఇవ్వదు. అందుకే దానికి నిజమైన సామర్థ్యం ఉన్న గురువు అవసరం. జ్ఞానోదయం ఎలా ఉంటుందో ఒక పుస్తకం మీకు చెప్పగలదు. కానీ గురువు ద్వారా జరిగే సజీవ ప్రసారం మాత్రమే ఆ స్థితిని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి దోహదపడుతుంది. అందుకే శాస్త్రీయమైన జీవితంలో స్తబ్దతను గుర్తించడం కన్నా ఆధ్యాత్మిక జీవితంలో దాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. దాన్ని కొలవడానికి బాహ్యమైన పరికరం ఏదీ లేదు. అదే మార్గంలో మరింత ముందుకు వెళ్ళినవారి మార్గదర్శకత్వం మాత్రమే ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ సంక్లిష్టమైన చిక్కుముడిని విప్పగలిగితే... సైన్సు పరంగా, కుటుంబపరంగా, సామాజికంగా మనం చేపట్టే అన్ని విషయాలు మనకు సులభసాధ్యం అవుతాయి.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్
ట్రైనర్ హార్ట్‌ఫుల్‌నెస్, 9440087532
ఈ వార్తలనూ చదవండి
వృద్ధురాలి పాలిట మృత్యువులా వచ్చిన కోతి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అహ్మదాబాద్ విషాదం.. విద్యార్థినిపైకి దూసుకెళ్లిన క్రేన్.. వీడియో వైరల్