పట్టుదలగా ప్రార్థించాలి
ABN , Publish Date - Oct 02 , 2026 | 04:18 AM
ఒక వ్యక్తి ఇంటికి అర్ధరాత్రి సమయంలో అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టాడు. ఆ స్నేహితుడు చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నాడు, ఆకలితో ఉన్నాడు. అయితే అతనికి పెట్టడానికి ఆ యజమాని దగ్గర...
దైవ మార్గం
ఒక వ్యక్తి ఇంటికి అర్ధరాత్రి సమయంలో అతని స్నేహితుడు వచ్చి తలుపు తట్టాడు. ఆ స్నేహితుడు చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నాడు, ఆకలితో ఉన్నాడు. అయితే అతనికి పెట్టడానికి ఆ యజమాని దగ్గర ఆహారం లేదు. దానితో పొరుగింటికి వెళ్ళి, ఆ ఇంట్లో నివసించే వ్యక్తిని తలుపు బయటి నుంచే పిలిచాడు. ‘‘నా స్నేహితుడు వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏదీ లేదు. మూడు రొట్టెలు అప్పుగా ఇవ్వు’’ అని అడిగాడు. ‘‘నన్ను ఇబ్బంది పెట్టకు. తలుపులు వేసి ఉన్నాయి. నాతో పాటు నా పిల్లలు కూడా పడుకున్నారు. ఇప్పుడు లేచి, నీకు ఏదైనా ఇచ్చే పరిస్థితిలో లేను’’ అని బదులిచ్చాడు ఆ పొరుగింటి వ్యక్తి. అయినప్పటికీ... ఇతను ఏమాత్రం సిగ్గుపడకుండా పదే పదే బతిమాలుకున్నాడు. ఆ ఇంటి తలుపు తడుతూనే ఉన్నాడు. చివరకు అతని పట్టుదలను చూసిన పొరుగువాడు లేచి, అతనికి అవసరమైనవి ఇచ్చాడు.
ఏసు చెప్పిన ఈ కథ లూకా సువార్తలోనిది. విశ్వాసులు ప్రార్థనలో ఎంత పట్టుదల చూపించాలో ఈ కథ ద్వారా ఏసు వివరించాడు. శ్రద్ధతో, స్థిరంగా ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా కరుణిస్తాడని స్పష్టం చేశాడు. ఏసు ఇక్కడ పొరుగువాడితో పోల్చింది దేవుడి స్వభావాన్ని కాదు. పదేపదే అడిగితే... మామూలు మనిషే విసుక్కుంటూనైనా సాయం చేసినప్పుడు... ప్రేమస్వరూపుడైన దేవుడు తన బిడ్డల ప్రార్థనలు కచ్చితంగా వింటాడనీ, మనం అడిగిన దానికన్నా ఎక్కువే ఇస్తాడనీ ఒక సూచన దీనిలో ఉంది. తనను భక్తితో ప్రార్థించేవారిని అనుగ్రహించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి పూర్తి విశ్వాసంతో ప్రార్థించాలి. అలాంటి ప్రార్థన మనసుకు శాంతి కలిగిస్తుంది, దేవుడిపై మన ఆలోచనలను స్థిరంగా ఉంచుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ..
హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగపడిన అభిమానులు..