Share News

సాహసం సేయరా డింభకా!

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:27 AM

పాతాళ భైరవి ఈ సినిమా పేరు వినగానే- ‘సాహసం సేయరా డింభకా..’ డైలాగ్‌ అప్రయత్నంగా గుర్తుకొస్తుంది. ఈ డైలాగ్‌ తొలిసారి ఎప్పుడు విన్నానో గుర్తులేదు. కానీ జీవితంలో ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురయినప్పుడు ఈ డైలాగే...

సాహసం సేయరా డింభకా!

వెండితెర జానపద అద్భుతం - పాతాళ భైరవి. తెరపైన.. తెరవెనుక పనిచేసిన ప్రతిభావంతుల చాతుర్యం, కార్యదీక్ష తోడై పురుడుపోసుకున్న ఈ చిత్రం విడుదలై 75 సంవత్సరాలు పూర్తయింది. అయినా ఇప్పటికీ నిత్య నూతనంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

వశిష్ట, సినీ దర్శకుడు

పాతాళ భైరవి ఈ సినిమా పేరు వినగానే- ‘సాహసం సేయరా డింభకా..’ డైలాగ్‌ అప్రయత్నంగా గుర్తుకొస్తుంది. ఈ డైలాగ్‌ తొలిసారి ఎప్పుడు విన్నానో గుర్తులేదు. కానీ జీవితంలో ఏదైనా ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురయినప్పుడు ఈ డైలాగే గుర్తుకొస్తూ ఉంటుంది. ఈ డైలాగ్‌ తొలి సారి థియేటర్లలో ధ్వనించి 75 ఏళ్లు అయిందంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా తెలుగు ప్రేక్షకులు ఈ డైలాగ్‌ను ఆదరించటం కూడా గొప్ప విషయమే!

నేను నా జీవితంలో కొన్ని వేల సినిమాలు చూసి ఉంటా! వేల డైలాగ్‌లు విని ఉంటా. కానీ వీటన్నింటిలోను పాతాళ భైరవికి ఒక ప్రత్యేక స్థానముంది. నేను దర్శకుడిగా మారటంలో ఈ చిత్ర ప్రభావం కూడా ఎంతో ఉంది. మా నాన్నగారు ఒక నిర్మాత. దీనితో నా చిన్నతనమంతా సినీ ప్రపంచపు వీధుల్లోనే గడిచింది. కెమెరాలు, ఎడిటింగ్‌ సూట్స్‌, డైలాగ్‌ రిహార్సల్స్‌, లైట్లు, మేక్‌పలు నాకు కొత్త కాదు. కానీ ఇప్పటికీ కూడా ఎప్పుడైనా పాతాళ భైరవి సినిమాను చూసినప్పుడు- ఈ షాట్స్‌ను కె.వి. రెడ్డి ఎలా తీసి ఉంటారు?అనే ఆలోచన మెదడును తొలుస్తూనే ఉంటుంది. అన్ని పాళ్లు సమానంగా పడిన గుత్తి వంకాయ కూర ఎంత రుచిగా ఉంటుందో- పాతాళ భైరవి సినిమా కూడా అలాగే ఉంటుంది. నటీనటుల నటనా వైదుష్యం.. దర్శకత్వ ప్రతిభా విన్యాసం.. కళాదర్శకుల పనితనం.. కెమెరాను ఉపయోగించుకున్న తీరు- ఇప్పటికీ ఈ చిత్రాన్ని అపురూపమైన కళాఖండంగా నిలబెట్టాయి. ఒక దర్శకుడిగా నాకు ఈ విషయాలన్నీ పాఠాలే! ముందు కళాదర్శకుల పనితనం గురించి చెప్పుకుందాం! ఈ సినిమా మొత్తాన్ని ఒక స్టూడియోలో నిర్మించారు. నేపాళ మాంత్రికుడి గుహలు, పాతాళ భైరవి మాయా ప్రపంచం, కోటలు ఇవన్నీ సెట్స్‌ అంటే నమ్మబుద్ధి అవదు. మనకు అనేక ఆశలు.. భయాలు.. ఊహలు ఉంటాయి. ఇవన్నీ మన మనసులో మెదులుతున్నంత వరకూ పర్వాలేదు. వాటిని అక్షర రూపంలో పెట్టడం కూడా కొంత వరకు సాధ్యమే! కానీ వాటిని దృశ్యరూపంలో మలచటం అంత సులభం కాదు. సీజీ, ఏఐ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదీ అందుబాటులో లేని సమయంలో సీనుకు తగినటువంటి సెట్‌లను నిర్మించి ప్రేక్షకులను మెప్పించటం అసాధ్యమే! కానీ దర్శకుడు కె.వి.రెడ్డి దీనిని సుసాధ్యం చేశారనే చెప్పాలి. అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించటం ఎంత కష్టమో ఒక దర్శకుడిగా నాకు తెలుసు.


బింబిసార నాకు ఈ విషయంలో అనేక పాఠాలు నేర్పింది. ఇక ‘విశ్వంభర’లో రకరకాల ప్రపంచాలను సృష్టించటానికి నేను పడిన ప్రసవ వేదన నాకు మాత్రమే తెలుసు. కానీ నా అదృష్టమేమిటంటే కె.వి. రెడ్డి, విఠలాచార్య, సింగీతం శ్రీనివాసరావు వంటి దర్శక సృష్టలు తీసిన చిత్రాలు నాకు రిఫరెన్స్‌గా ఉపకరించాయి.

33-Navya.jpg

ట్రిక్‌ ఫోటోగ్రఫి...

ఒకప్పుడు మన సమాజంలో ఇంద్రజాలికులు ఉండేవారు. వారు మనుషులను మాయం చేయటం.. హఠాత్తుగా మంటలు పుట్టించటం.. గాలిలో నుంచి విభూది తీయటం వంటి ఆశ్చర్యకరమైన పనులు చేస్తూ ఉండేవారు. అలాంటి వారి ప్రదర్శనలలో కూడా వెలుగు, నీడలు చాలా కీలకమైన పాత్ర పోషించేవి. ఈ వెలుగు, నీడల సయ్యాటే పాతాళభైరవికి కొంత ఆకర్షణను తెచ్చిపెట్టింది. ఇక కెమెరామెన్‌ బార్ట్‌లే తీసిన ఒక ట్రిక్‌ ఫొటోగ్రఫి షాట్స్‌- ‘నిజమేనా’ అన్నట్లుగా ఆశ్చర్యచకితులను చేస్తాయి. విశ్వంభర సినిమాలో సీజేలో కొన్ని షాట్స్‌ను కంపోజ్‌ చేయాల్సి వచ్చినప్పుడు - పాతాళభైరవి సహా అనేక ఇతర సినిమాలలో షాట్స్‌ ఎంతో ఉపకరించాయి. ఆ సమయంలో ట్రిక్‌ ఫోటోగ్రఫి సన్నివేశాలను అర్రీ 11 సీబీఆర్‌ కెమెరాతో చిత్రీకరించడం విశేషమనే చెప్పాలి. సాధారణంగా ఇలాంటి ట్రిక్‌ ఫోటోగ్రఫి సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు టైమింగ్‌ చాలా ముఖ్యం. ఒక సెకను ఆలస్యమయినా మొత్తం దృశ్యం చెడిపోతుంది.

అపురూప నటన...

తోటరాముడిగా ఎన్టీఆర్‌, నేపాళ మాంత్రికుడిగా ఎస్వీఆర్‌గార్ల నటనా విశ్వరూపం ఈ సినిమాలో చూస్తాం. మంచి-చెడుల మధ్య పోరాటమనే స్పష్టమైన ఈ సినిమా కథాంశంలో పాత్రలలో అనేక భావోద్వేగాల పొరలు ఉంటాయి. వీటిని సున్నితంగా ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ప్రదర్శించటం అలనాటి ఆ నటులకే చెల్లింది. వీరి నటనకు పింగళి రాసిన జానపద సంభాషణలు ప్రాణం పోశాయి. ‘సాహసం సేయరా డింభకా..’, ‘ధైర్యం సేయరా రాజకుమారి వరిస్తుంది..’, ‘నిజం చెప్పమన్నారా అబద్దం చెప్పమన్నారా..’, ‘తప్పు తప్పు..’, ‘నరుడా ఏమి నీ కోరిక..’, ‘జై పాతాళభైరవి..’ లాంటి డైలాగులు; ‘డింభకా’, ‘డింగరి’ లాంటి మాటలు ప్రేక్షకులను అలరించడమే కాదు తెలుగు సంస్కృతిలోకి భాగమయిపోయాయి. ముఖ్యంగా ఒక చిత్రమైన యాసలో - ‘ధైర్యం సేయరా..’ అని నేపాళ మాంత్రికుడు చెప్పే డైలాగ్‌ ఒక విధమైన భయాన్ని కలిగిస్తుంది. అయితే ఆ భయం ప్రేక్షకులకు మాత్రమే కలుగుతుంది. తోట రాముడి అమాయకత్వంపై కోపం వస్తుంది.


చివరగా...

ఇలా చెప్పుకుంటూ పోతే- పాతాళభైరవికి సంబంధించిన విశేషాలు వందల కొలది ఉంటాయి. మళ్లీ అలాంటి సినిమా తీయగలమా? అనే ప్రశ్న అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటుంది. నా ఉద్దేశంలో అదే కథతో అలాంటి సినిమా మళ్లీ ఎప్పుడూ తీయలేరు.

3333-Navya.jpg

భారతీయ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌ను కొత్త మలుపు తిప్పి.. హీరోఇజం, హీరో వర్షిప్‌ అనే వాటికి అంకురార్పణ చేసిన తొలి సినిమా ‘పాతాళభైరవి’. సాంకేతికంగా భారతీయ వెండితెరపై అప్పటికి అందుబాటులో ఉన్న టెక్నాలజీని పది మెట్లు పైకి ఎక్కించిన సినిమా ‘పాతాళభైరవి’. అందుకే 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రదర్శనకు ఎంపికైన ఏకైక చిత్రంగా ‘పాతాళభైరవి’ ఘనతను దక్కించుకుంది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఘన విజయం సాధించి ఇప్పటి పాన్‌ ఇండియా పరిభాషకు అప్పట్లోనే బీజం వేసిన సినిమాగా కూడా ‘పాతాళభైరవి’ నిలిచింది.

- నందమూరి బాలకృష్ణ

ఘంటసాల, జిక్కి, పిఠాపురం, లీల, కమలాదేవి, కోమల, రేలంగి, వి.జె వర్మ తదితరులు పాడిన పాటలు నేటికీ సంగీత ప్రియులను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ‘ఎంత ఘాటు ప్రేమయో..’, ‘కలవరమాయే మదిలో..’, ‘వినవే బాలా..’, ‘ప్రేమ కోసమై వలలో పడెనే..’, ‘రానంటే రానే రాను..’ పాటలు విశేషంగా ప్రజాదరణ పొందాయి.

‘పాతాళభైరవి’ ... 1951 మార్చి 15న విడుదలైంది. పలు కేంద్రాల్లో శత దినోత్సవాలు జరుపుకున్న తొలి భారతీయ సినిమాల్లో ఇది ఒకటి. విజయ వాహిని స్టూడియో్‌సలో నిర్మించిన ఈ చిత్రానికి కె.వి రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్‌టీ రామారావు, ఎస్వీ రంగారావు, కె.మాలతి, గిరిజ తదితరులు ప్రధాన తారాగణం. మహానటి సావిత్రి.. అతిథి పాత్ర

(నర్తకి) పోషించారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌ను అదే ఏడాది మే 17న విడుదల చేశారు.


333-Navya.jpg

విజయ వాహిని స్టూడియోస్‌ మొదటి అంతస్తులో చిన్న ఆఫీస్‌ ఉండేది. అక్కడే చిత్ర కథలు, హీరోల ఎంపిక, సినిమా బడ్జెట్‌ తదితర అంశాల గురించి చర్చలు జరుగుతుండేవి. ఒక రోజు కెవి. రెడ్డి, బి. నాగిరెడ్డి, చక్రపాణిలు కలిసి పాతాళభైరవి సినిమాకు హీరో ఎవరైతే బాగుంటుందో చర్చించుకుంటున్నారు. అంతలో కెవి రెడ్డి.. ఆఫీస్‌ కిటికీ వద్దకు వచ్చి గ్రౌండ్‌లో షటిల్‌ ఆడుతున్న ఎన్‌టీఆర్‌ను చూశారు. వెంటనే వెనక్కి తిరిగి ‘హీరో దొరికాడు’ అని అరిచారు. మిగిలిన ఇద్దరు.. ముందు అనుకున్నట్లుగానే హీరో ఏఎన్నారే అనుకుంటూ బయలుదేరడానికి సమాయత్తమయ్యారు. వెంటనే కెవి రెడ్డి వారిని ఆపుతూ ‘నేను హీరో పేరు చెప్పలేదు. అప్పుడే వెళ్లిపోతున్నారేంటి?’ అంటూ కిటికీలో నుంచి ఎన్టీఆర్‌ను చూపించారు. దీంతో చక్రపాణి జానపద చిత్రాలకు ఏఎన్నార్‌ చక్కగా సూటవుతారంటూ వాదించారు. అందుకు కెవి రెడ్డి ఒప్పుకోలేదు. పాతాళభైరవికి కొత్త ముఖాన్ని పరిచయం చేయాలనుకుంటున్నానంటూ అది ఎన్టీఆరే అని ఫిక్స్‌ చేస్తూ ఎవరికైనా అభ్యంతరం ఉంటే తాను ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటానని చెప్పడంతో మిగిలిన ఇద్దరికీ ఒప్పుకోక తప్పలేదు. 1951 మార్చి 15న విడుదలైన పాతాలభైరవి సినిమా ఏకధాటిగా 200 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. అలాగే ఈ సినిమా ఎన్టీఆర్‌కు స్టార్‌డమ్‌ను తీసుకొచ్చింది. ఈ మూవీ తర్వాత జానపద హీరోగా ఎన్టీఆర్‌ ఏకంగా 58 సినిమాల్లో నటించారు.

పాతాళభైరవి విడుదలైన మూడు నెలల తరువాత ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ప్రజల్లో సినీ గ్లామర్‌కు ఉన్న క్రేజ్‌ను చూసి రాజకీయ నాయకులే నివ్వెరబోయిన క్షణాలవి. అది 1951 జూన్‌ నెల.. మండు వేసవి.. వడగాల్పులు వీస్తున్నాయి. మద్రాస్‌ మెయిల్‌.. గుంతకల్‌ స్టేషన్‌లో ఆగింది.. అప్పటి కేంద్ర హోం మంత్రి సి. రాజగోపాలాచారి (రాజాజీ) రైల్లో నుంచి దిగి అక్కడి ప్రజలను పలుకరిస్తున్నారు. అప్పుడే మరో రైలు వచ్చి ఎదుటి ప్లాట్‌ఫామ్‌పై ఆగింది. అది చూసి జనమంతా ఆ రైలువైపు పరుగెత్తారు. వారిలో ఒకరిని ఆపి ఏమైందంటూ రాజాజీ ప్రశ్నించారు. అందుకు అతను ‘పాతాళభైరవి సినిమా వంద రోజుల వేడుకల్లో పాల్గొనేందుకు హీరో ఎన్‌టీఆర్‌ సహా చిత్ర బృందమంతా ఆ రైల్లోనే బళ్లారి వెళుతున్నారు. రైలు ఇక్కడ కొద్దిసేపే ఆగుతుంది. వాళ్లందరినీ దగ్గరగా చూడాలని, ఎన్‌టీఆర్‌తో మాట్లాడాలని పరుగెడుతున్నాం’ అని చెప్పడంతో సినిమావాళ్లమీద ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఆశ్చర్యపోయారు రాజాజీ.

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 05:27 AM