స్వర్గానికి దారి
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:48 AM
ఈ ప్రపంచం ఒక తాత్కాలికమైన ఆశ్రయం. ఇక్కడికి మనం శాశ్వతంగా ఉండడానికి రాలేదు. ఒక పరీక్ష కోసం వచ్చాం. మనుష్యులను పరీక్షించడానికే ఈ జీవితాన్ని అల్లాహ్ ఇచ్చాడని..
సందేశం
ఈ ప్రపంచం ఒక తాత్కాలికమైన ఆశ్రయం. ఇక్కడికి మనం శాశ్వతంగా ఉండడానికి రాలేదు. ఒక పరీక్ష కోసం వచ్చాం. మనుష్యులను పరీక్షించడానికే ఈ జీవితాన్ని అల్లాహ్ ఇచ్చాడని అంతిమ దివ్యగ్రంథమైన ఖుర్‌ఆన్ చెబుతోంది. ఈ లోకంలో కాదు... పరలోకంలో విజయం సాధించినవాడే నిజమైన విజేత. ఈ ప్రపంచంలో ధనం, ప్రతిష్ట, ఆనందాలు, కష్టాలు... ఇవన్నీ పరీక్షలే. ఆ పరీక్షల్లో విజయవంతమైనవారికి అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలం స్వర్గం. మరి ఆ స్వర్గానికి దారి ఎక్కడ ఉంది?
దైవ ప్రవక్త మహమ్మద్ దగ్గరకు ఒకసారి ఒక పేద వ్యక్తి వచ్చి ‘‘నాకు స్వర్గానికి దారి చూపించండి’’ అని అర్థించాడు. ‘‘అల్లా్‌హను పూజించు. తప్పనిసరిగా నమాజ్ చెయ్యి. జకాత్ (దానం) ఇవ్వు, సత్యంగా జీవించు. నువ్వు స్వర్గానికి చేరుకుంటావు’’ అని దైవ ప్రవక్త బదులిచ్చారు. విశ్వాసం (ఇమాన్) స్వర్గానికి ప్రధాన ద్వారం. అల్లాహ్ మీద విశ్వాసం లేకపోతే... చేసిన పనులేవీ పూర్తిగా ఫలించవు. ‘‘విశ్వాసం మాటల్లో కాదు... హృదయంలో, పనుల్లో, ప్రవర్తనలో కనిపించాలి. నీ హృదయం మంచి పనిని చూసి ఆనందపడితే, చెడు పనిని చూసి బాధపడితే... అదే నిజమైన విశ్వాసం’’ అని దైవ ప్రవక్త చెప్పారు. విశ్వాసం దీపం లాంటిది. జీవితంలో చీకటి ఎదురైనప్పుడు... అది వెలుగును ఇస్తుంది. అలాగే స్వర్గానికి నడిపించే మార్గం నమాజ్. అది సాధారణమైన ఆరాధన కాదు. మన ఆత్మకు ఆహారం. శరీరానికి బలాన్ని, మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. రోజూ అయిదుసార్లు అల్లాహ్ ముందు నిలబడి ప్రార్థన చేయడం అంటే... మొత్తం జీవితాన్ని ఆయనకే అంకితం చేయడం. ‘‘నమాజ్... విశ్వాసికి, అవిశ్వాసికి మధ్య ఉన్న గీత’’ అని దైవ ప్రవక్త స్పష్టం చేశారు.
పూర్వం ఒక యువకుడు అనేక చెడు పనులు చేసేవాడు. కానీ నమాజ్‌ను మాత్రం వదిలిపెట్టలేదు. ఒక రోజు అతను నమాజ్ చేస్తూ... ‘‘నేను అల్లాహ్ ముందు నిలబడుతున్నాను. కానీ పాపం చేస్తున్నాను’’ అని అంతర్మథనానికి దురయ్యాడు. ఆ తరువాత క్రమంగా చెడు పనులను విడిచిపెట్టాడు. మరింత దృఢమైన విశ్వాసిగా మారాడు. తన జీవితాన్ని సరి దిద్దుకున్నాడు. నమాజ్ మనిషిలో ఉన్న చెడును తొలగిస్తుంది. ఒక విశ్వాసి నమాజ్ వ్యవస్థను పరిరక్షిస్తే... అల్లాహ్ అతని జీవితాన్ని సరిదిద్దుతాడు.
మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహుపై స్వదేశంలో విమర్శలు..
ఏబీఎన్ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు