Share News

పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో భారతీయం

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:57 AM

పాశ్చాత్య నాగరికతకు రాజధానిగా భావించే పారి్‌సలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నుదుట సిందూరం, ముఖమంతా తెల్లటి రంగు, చీరను పోలిన వినూత్న శైలి వస్త్రధారణతో మోడళ్లు ర్యాంప్‌పై నడుస్తుంటే...

పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో భారతీయం

పాశ్చాత్య నాగరికతకు రాజధానిగా భావించే పారి్‌సలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. నుదుట సిందూరం, ముఖమంతా తెల్లటి రంగు, చీరను పోలిన వినూత్న శైలి వస్త్రధారణతో మోడళ్లు ర్యాంప్‌పై నడుస్తుంటే వీక్షకులు విస్తుపోయారు. సరిహద్దులు దాటిన సంస్కృతి, సామాజిక వివక్షకు గురవుతున్న సమూహాల ఆవేదనను ఈ షో ప్రతిబింబించింది.

పారి్‌సలోని ఐకానిక్‌ ‘ప్లేస్‌ డి లా రిపబ్లిక్‌’ వేదికగా సాగిన ఈ ప్యాషన్‌ షో దుస్తుల ప్రదర్శన గానే కాకుండా శక్తిమంతమైన సామాజిక ప్రకటనలా సాగింది. స్టీవెన్‌ రాజ్‌ భాస్కరన్‌, హన్నా రోజ్‌ అనే ఇద్దరు డిజైనర్లు ‘మాటియర్స్‌ ఫేకాల్‌’ బ్యానర్‌పై రూపొందించిన ఈ స్ర్పింగ్‌/ సమ్మర్‌ 2027’ కలెక్షన్‌ ఫ్యాషన్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. కెనడాలోని మాట్రియల్‌లో ఉన్న ఒక పేద నివాస ప్రాంతంలో గడిపిన తన బాల్య జ్ఞాపకాలను, అక్కడ తాను చూసిన విభిన్న సంస్కృతులు, మతాల కలబోతను రాజ్‌ భాస్కరన్‌ ఈ డిజైన్లలో అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రధాన స్రవంతి ఫ్యాషన్‌ జగత్తులో స్థానం దక్కని వలసదారులు, సమాజం నుంచి వేరుగా చూడబడే వ్యక్తులు, అణచివేతకు గురైన సమూహాలకు గౌరవం అందించడమే ఈ ఫ్యాషన్‌ షో ప్రధాన ఉద్దేశం. ‘‘ఫ్యాషన్‌ రాజధాని అని పిలిచే ఈ నగరంలో, ఈ వాతావరణంలో గొంతుక లేని వేలాదిమంది ప్రతినిధులుగా మేము ఇక్కడ మాట్లాడాము’’ అని భాస్కరన్‌ చెప్పుకొచ్చారు.

భారతీయ మూలాలు

ఈ షోలో ప్రదర్శించిన దుస్తులు ఆకర్షణీయమైన రీతిలో అల్లిన ఆకారాలతో అందరినీ ఆకట్టుకున్నాయి. పెద్ద పెద్ద స్కర్టులతో కూడిన ఓవర్‌ సైజ్డ్‌ బ్లేజర్లు, సంప్రదాయ భారతీయ చీరకట్టును ఆధునిక ట్రెండ్‌కు అనుగుణంగా మార్చిన శైలి ఈ సేకరణలో ప్రత్యేకంగా నిలిచింది. నీలం, తెలుపు, ఎరుపు రంగుల దుస్తులను ఎంతో నైపుణ్యంతో డ్రేపింగ్‌ చేసిన విధానం చూసేవారిని ముగ్ధులను చేసింది. డిజైనర్‌ భాస్కరన్‌ సగం శ్రీలంక, సగం గయానీస్‌ మూలాలున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. అందుకే ఈ ప్రదర్శన తన మూలాలకు, తన పూర్వీకులకు, సామాజిక అంచుల్లో నివసించే శ్రమజీవులకు ఆయన ఇచ్చిన అరుదైన నివాళిగా నిలిచింది. ఆధునిక శైలిని సంప్రదాయ మూలాలతో మేళవించిన తీరు ఫ్యాషన్‌ ప్రియులను ఆలోచనల్లో పడేసింది.


సిందూరం.. శ్వేత వర్ణం..

ఈ ప్రదర్శనలో దుస్తులకంటే ఎక్కువగా వీక్షకులను ఆశ్చర్యపరిచింది మోడళ్ల మేకప్‌ శైలి. పలువురు మోడళ్లు తమ ముఖమంతటికీ దట్టమైన తెల్లటి రంగు వేసుకుని, పెదవులకు గాఢమైన ఎరుపు రంగు దిద్దుకున్నారు. ముఖ్యంగా వారి నుదుటిపై ఎర్రటి సిందూర రేఖలు ముక్కుపైకి ప్రవహిస్తున్నట్లుగా చిత్రించిన తీరు భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మికతను గుర్తుచేసింది. మరికొందరు మోడళ్లు తెల్లటి మేక్‌పతో పాటు నల్లటి పెదవులతో కనిపించారు. వింతైన దుస్తులు, ఈ వినూత్న సౌందర్య శైలి కలగలిసి ర్యాంప్‌పై ఒక రకమైన అశాంతిని, లోతైన ఆలోచనను రేకెత్తించే వాతావరణాన్ని సృష్టించాయి. దక్షిణాసియా, ముఖ్యంగా భారతీయ మూలాలను ప్రతిబింబించే సిందూరం, చీరల వాడకం ఈ షోకి సరికొత్త గంభీరతను తెచ్చిపెట్టింది.

భిన్న స్పందనలు

పారిస్‌ ర్యాంప్‌పై ఆవిష్కృతమైన ఈ విచిత్రమైన, నాటకీయ ప్రదర్శనపై సోషల్‌ మీడియాలో విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఈ ప్రదర్శనను సాంస్కృతిక గౌరవంగా కొనియాడగా, మరికొందరు దీని శైలిని ప్రశ్నించారు. ‘‘నల్లటి ఆసియా మోడళ్లపై వాడిన ఎరుపు, నీలం రంగులు సమాజంలో పెత్తందారీ వర్గాలు ఇతర సంస్కృతులను ఏ విధంగా చూస్తాయో ప్రశ్నించేలా ఉన్నాయి. ఎంతో లోతైన ఆంతర్యం ఉన్న ఈ డిజైన్‌ నన్ను భావోద్వేగానికి గురిచేసింది’’ అని ఒక నెటిజన్‌ వ్యాఖ్యానించారు. మరొకరు అగ్రశ్రేణి డిజైనర్‌ అలెగ్జాండర్‌ మెక్‌క్వీన్‌ శైలిని గుర్తుచేస్తూ ప్రశంసలు కురిపించారు. ‘‘ఇదొక ఆలోచనాత్మకమైన, రాజకీయ కోణమున్న కళారూపం’’ అని కొందరు కామెంట్‌ చేశారు. ‘‘ఏది ఏమైనా డిజైనర్‌ తన శ్రీలంక, తమిళ మూలాలను ఎంతో ధైర్యంగా ప్రదర్శించారు’’ అని మరికొందరు కొనియాడారు. సంప్రదాయ చట్రాలను బద్దలు కొడుతూ చేసిన ఈ ప్రయత్నం ఫ్యాషన్‌ లోకంలో సరికొత్త చర్చలకు తెరలేపింది.

ఈ వార్తలూ చదవండి

దుబాయ్‌-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..

దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో హైజాక్ సంకేతాలు..

Updated Date - Oct 01 , 2026 | 01:57 AM