Share News

పిల్లల్లో క్రమశిక్షణ ఇలా...

ABN , Publish Date - Mar 23 , 2026 | 01:47 AM

పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలంటే తల్లిదండ్రులు ఓర్పుతో వ్యవహరించాలి. సమయపాలనతోపాటు ముందస్తు ప్రణాళిక...

పిల్లల్లో క్రమశిక్షణ ఇలా...

పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలంటే తల్లిదండ్రులు ఓర్పుతో వ్యవహరించాలి. సమయపాలనతోపాటు ముందస్తు ప్రణాళిక విధానాన్ని వివరిస్తూ, చిన్న చిన్న బాధ్యతలు అప్పగిస్తూ పిల్లలను దారిలోకి తీసుకురావచ్చు. అదెలాగంటే...

  • రోజూ నిద్ర లేవడం, చదువుకోవడం, ఆడుకోవడం తదితరాలన్నింటికీ సమయాన్ని నిర్దేశించాలి. దీనివల్ల పిల్లలకు సమయానుసారం పనులు పూర్తిచేయడం అలవడుతుంది.

  • స్కూల్‌కు వెళ్లే ముందు అవసరమైన పుస్తకాలను బ్యాగ్‌లో సర్దుకోవడం, లంచ్‌ బాక్స్‌ రెడీ చేసుకోవడం లాంటి పనులను పిల్లలకు నేర్పించాలి. సెలవు రోజుల్లో.. బట్టలు మడతపెట్టడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం, డైనింగ్‌ టేబుల్‌ను శుభ్రం చేయడం లాంటి పనులు ఆప్పగించాలి. వీటివల్ల పిల్లల్లో బాధ్యత భావం మొదలవుతుంది.

  • పిల్లలు ప్రతి క్షణం తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటి పనులను అప్పుడు పూర్తిచేస్తూ పిల్లలకు ఆదర్శంగా ఉండాలి.

  • పిల్లలు ఎక్కువసేపు టీవీ లేదా మొబైల్‌ చూడకుండా కచ్చితమైన స్ర్కీన్‌ టైమ్‌ను నిర్దేశించాలి.

  • పిల్లలు ఏమైనా పొరబాట్లు చేస్తే కోపం ప్రదర్శించకుండా మృదు స్వరంతో వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి.

  • పెద్దలను గౌరవించడం, అందరితో స్నేహంగా మెలగడం, అవసరం మేరకు సహాయ సహకారాలు అందించడం లాంటి వాటిని నేర్పిస్తుంటే పిల్లలకు క్రమశిక్షణతోపాటు చక్కని వ్యక్తిత్వం అలవడుతుంది.

  • పిల్లలు ఏమైనా మంచి పనులు చేసినా, ఆటపాటల్లో గెలిచినా, పరీక్షల్లో మంచి మార్కులు సాధించినా వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించాలి. దీనివల్ల పిల్లలకు క్రమశిక్షణ విలువ అర్థమవుతుంది. వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

  • రోజూ పిల్లలతో కొంతసేపు మాట్లాడుతూ ఉండాలి. వారి మనసులోని భావాలను ధైర్యంగా చెప్పనివ్వాలి. అప్పుడే పిల్లల అభిరుచులు, ఆసక్తుల గురించి తెలుసుకునే వీలుంటుంది. ఇలా ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం ఉండేలా చూస్తే పిల్లలు క్రమశిక్షణతో మెలగడం నేర్చుకుంటారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

Updated Date - Mar 23 , 2026 | 01:47 AM