మధురమైన దండన
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:08 AM
మన దేశానికి చెందిన ఎన్నో ఆధ్యాత్మిక ఉత్సవాలను భక్తివేదాంత శ్రీల ప్రభుపాదులు ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. అలాంటి వాటిలో ‘దండన మహోత్సవం’ (పానిహటి చిడా-దహి) ఒకటి...
హరేకృష్ణ
మన దేశానికి చెందిన ఎన్నో ఆధ్యాత్మిక ఉత్సవాలను భక్తివేదాంత శ్రీల ప్రభుపాదులు ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. అలాంటి వాటిలో ‘దండన మహోత్సవం’ (పానిహటి చిడా-దహి) ఒకటి. ప్రతి ఏడాది జూన్ మాసంలో... బ్రహ్మ-మధ్వ-గౌడీయ సంప్రదాయాన్ని అనుసరించేవారు దాన్ని కన్నులపండువగా జరుపుకొంటారు. ఆ ఉత్సవం గురించి, దాని వెనుక ఉన్న ఇతిహాసం గురించి తెలుసుకుందాం.
‘దండన’ అంటే అపరాధికి వేసే శిక్ష. మరి ‘దాన్ని ఉత్సవంగా నిర్వహించుకోవడం ఏమిటి?’ అనే సందేహం ఆ ఉత్సవం గురించి తెలియనివారికి కలగవచ్చు. ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా అయిదువందల ఏళ్ళ క్రితం, క్రీస్తుశకం 1506లో, పశ్చిమబెంగాల్‌లోని పానిహటి అనే చోట... శ్రీ చైతన్య మహాప్రభువుల కాలంలో నిర్వహించారు. వేలాదిమంది భక్తులకు అటుకులు (చిడా), పెరుగు (దహీ)తో చేసిన మధుర పదార్థాలను అందించారు. బ్రహ్మ-మధ్వ-గౌడీయ సంప్రదాయంలో శ్రీకృష్ణనామ సంకీర్తన మార్గాన్ని విశేషంగా ప్రచారం చేసిన ఆచార్యులు ఎందరో ఉన్నారు. చైతన్య మహాప్రభువు ప్రధాన శిష్యులైన, ‘షడ్గోస్వాములు’గా పేరు పొందిన ఆరుగురిలో ఒకరైన శ్రీల రఘునాథ దాస గోస్వామి ఈ ఉత్సవానికి మూలకారకులు. ఆయన పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలోని సప్తగ్రామ్ అనే నగరానికి రెండు మైళ్ళ దూరంలో ఉన్న శ్రీకృష్ణపురం అనే గ్రామంలో, సంపన్న కుటుంబంలో జన్మించారు. బాల్యంలో శ్రీల హరిదాస ఠాకూర్ ప్రభావం వల్ల భోగాలపై ఆయనలో అనాసక్తి కలిగింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆయనకు వివాహం చేశారు. వ్యాపార నిర్వహణ నేర్పించడం ఆరంభించారు. షడ్గోస్వాములలో శ్రీ చైతన్య మహాప్రభువును కలిసిన మొదటివారు శ్రీ రఘునాథ దాస గోస్వామే. శ్రీచైతన్యులను దర్శించి ఇంటికి వెళ్ళాక... లౌకిక ప్రపంచం పట్ల పూర్తిగా ఆసక్తిని కోల్పోయారు. అప్పటి నుంచి ఆయన ఇంటినుంచి పారిపోవడం, తల్లిదండ్రులు ఆయనను వెతికి పట్టుకొని ఇంటికి తేవడం సాధారణమైపోయింది.
దొంగకు శిక్ష
కొన్నాళ్ళ తరువాత పానిహటిలోని రాఘవ పండితుల ఇంటికి శ్రీనిత్యానంద ప్రభువు వచ్చారని తెలిసి, రఘునాథుడు ఆయన దగ్గరకు వెళ్ళారు. కానీ ఆయనను కలవడానికి అర్హుణ్ణి కాదని దూరం నుంచే సాష్టాంగ వందనం సమర్పించారు. అయితే నిత్యానందుల సేవకుడొకరు ఆయనను గుర్తించి, నిత్యానందులకు చూపించాడు. అప్పుడు నిత్యానందులు ‘‘రఘునాథా! ఎందుకు దొంగలా దూరం నుంచే నమస్కరిస్తున్నావ్? ఇటురా!’’ అని పిలిచారు. తనను సమీపించి, పాదాక్రాంతుడైన రఘునాథుని శిరస్సుపై తన పాదాన్ని ఉంచారు. ‘‘నువ్వు దొంగలా దూరం నుంచే నమస్కరిస్తూ ఉంటే నేను పట్టుకున్నాను. కనుక నిన్ను శిక్షించాలి. నువ్వు సంపన్నుడివి కాబట్టి ఇక్కడ ఉన్న నా అనుచరులందరికీ అటుకులు, పెరుగుతో విందు చెయ్యి’’ అన్నారు నిత్యానందులు. రఘునాథుడు ఎంతో ఆనందించి, సేవకులతో పాటు దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళి... కావలసినవన్నీ తీసుకువచ్చారు. వేడి వేడి పాలలో అటుకులు నానబెట్టారు, దానిలో సగభాగాన్ని పెరుగు, చక్కెర, అరటి పండ్ల మిశ్రమంతో, మిగిలిన భాగాన్ని బాగా మరిగించిన పాలు, కర్పూరం, నెయ్యి, ప్రత్యేకమైన రకం అరటిపండ్లు, చక్కెరతో కూడిన మరో మిశ్రమంలో కలిపారు. రెండు కుండలతో వాటిని తీసుకొచ్చి నిత్యానందులకు, వారి అనుచరులకు అందజేశారు. ఈ సంగతి తెలిసిన గ్రామస్తులు అక్కడికి తండోపతండాలుగా వచ్చారు. స్థలంలేక గంగానదిలో కూడా కొందరు నిలబడి ప్రసాదాలను ఆస్వాదించారు. హరినామ సంకీర్తనతో, నృత్యాలతో పండుగ చేసుకున్నారు. ఎంతో సంతృప్తి చెందిన నిత్యానందులు తన మనస్సులో శ్రీచైతన్య మహాప్రభువుని స్మరించి, ఆహ్వానించారు. చైతన్య మహాప్రభువు అక్కడకు సూక్ష్మరూపంలో వచ్చి, భక్తులతో కలిసి నృత్య, సంకీర్తనలు చేస్తూ, మధుర పదార్థాలను స్వీకరించారు.
ఉత్సవం ఆంతర్యం
సాక్షాత్తూ బలరామ స్వరూపులైన శ్రీనిత్యానందులు తన భక్తునికి వేసిన తీపి దండన ఇది. దేవుని దండన సైతం ఎంత మధురంగా ఉంటుందో కదా! అది తెలుపడమే దీని ఆంతర్యం. రఘునాథులు తదనంతర కాలంలో శ్రీనిత్యానందుల కృపతో శ్రీచైతన్య మహాప్రభువుల సంకీర్తనోద్యమంలో ప్రథములై, గోస్వామి స్థాయికి చేరారు. ఆనాటి ‘తీపి దండన’కు గుర్తుగా ఈ ఉత్సవాన్ని ‘చిడా-దహి’ మహోత్సవంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. భక్తులు తమ ఇళ్ళలో అటుకులు, పాలు, చక్కెర లేదా బెల్లం, పండ్లతో వంటకాలు సిద్ధంచేసి, స్వామికి నివేదించి, కుటుంబంతో కలిసి స్వీకరించడం ద్వారా, ‘హరేకృష్ణ హరేరామ’ మంత్రం జపించడం ద్వారా భగవంతుని ఆశీస్సులు పొందవచ్చు.
శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ
అధ్యక్షుడు, హరే కృష్ణ మూవ్‌మెంట్,
హైదరాబాద్, 9396956984
నేడు చిడా-దహి మహోత్సవం
ఇవి కూడా చదవండి:
పెళ్లి పేరుతో మోసం.. స్టార్ క్రికెటర్‌పై సంచలన ఆరోపణలు!
కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!