దొంగ మాస్టారు!
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:58 AM
20వ శతాబ్దంలో ప్రపంచవాప్తంగా చెప్పుకోదగ్గ భారతీయ తత్వవేత్తల్లో భగవాన్ రజనీష్ (ఓషో) ఒకరు. తన చిన్నతనం గురించి.. ఆ సమయంలో ఎదురైన అనుభవాల గురించి- ఓషో తన...
వ్యాసపీఠం
20వ శతాబ్దంలో ప్రపంచవాప్తంగా చెప్పుకోదగ్గ భారతీయ తత్వవేత్తల్లో భగవాన్ రజనీష్ (ఓషో) ఒకరు. తన చిన్నతనం గురించి.. ఆ సమయంలో ఎదురైన అనుభవాల గురించి- ఓషో తన సన్నిహితులతో అనేక సందర్భాలలో పంచుకున్నారు. వాటన్నింటినీ గుదిగుచ్చి - ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగ్విన్- ‘గ్లింప్సెస్ ఆఫ్ గోల్డెన్ ఛైల్డ్‌హుడ్’ అనే గ్రంఽథాన్ని ప్రచురించింది. దీనిలోని ఒక ఆసక్తికరమైన భాగం..
‘‘నేను కుచ్‌వాడ అనే ఒక అందమైన గ్రామంలో జన్మించాను. కుచ్‌వాడకు బాహ్య ప్రపంచానికి ఎటువంటి సంబంధం ఉండేది కాదు. రైల్వే లైను, పోస్ట్ ఆఫీసు, పంచాయతీ ఆఫీసు- ఇలాంటివేమి ఉండేవి కావు. ఊరి మధ్యలో ఒక అందమైన చెరువు ఉండేది. ఈ చెరువు చుట్టూ పాకలు ఉండేవి. మాది మిగిలిన వారి కన్నా పెద్ద ఇల్లు. అంటే ఒక చిన్న పెంకుటిల్లు. నా చిన్నతనంలో మా అమ్మ, నాన్న పోట్లాడుకోవడం ఎప్పుడూ చూడలేదు. చాలా అన్యోన్యంగా ఉండేవారు. వారు పేదవారే కావచ్చు... కానీ వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం విషయంలో చాలా ఽసంపన్నులు. ఒకరి మాట ఒకరు జవదాటేవారు కాదు. నాన్నను అమ్మ- అవి ఇవి కావాలని కోరడం నేనెప్పుడూ చూడలేదు. నాన్న మరణం తర్వాత నేను, అమ్మ మా తాతగారింటికి వెళ్లిపోయాం. అమ్మమ్మ లావుగా, పొడవుగా ఉండేది. అందరినీ ఆదరించేది. కానీ తాతకు అమ్మమ్మ అంటే భయం. ఆ భయం ఎందుకో నాకు అర్ధమయ్యేది కాదు.
తాతయ్య భయం...
ఈ రోజుల్లో జరిగిన ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. దాన్ని ఇప్పటి దాకా ఎవరితోను పంచుకోలేదు. ఒక రోజు రాత్రి చాలా పెద్ద వాన కురుస్తోంది. హఠాత్తుగా ఒక దొంగ మా ఇంట్లోకి ప్రవేశించాడు. తాత గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆ కేకలకు దొంగ వసారాలో ఉన్న వరి బస్తాల వెనక దాక్కొన్నాడు. వాన చప్పుడు వల్ల తాత కేకలు ఇరుగుపొరుగు వారికి వినిపించలేదు. ఎవరు బయటకు రాలేదు. ఆ దొంగను ఎలా ఎదుర్కోవాలో తాతకు తెలియలేదు. తాత ఎప్పుడూ తమలపాకులు తింటూ ఉండేవాడు. దొంగ వచ్చాడనే భయంలో మరిన్ని ఆకులు ఎక్కువగా తినటం మొదలుపెట్టాడు. దొంగ దగ్గరకు వెళ్తే దాడి చేస్తాడనే భయంతో దూరంగా నిలబడి అతనిపై ఉమ్ము వేయడం మొదలుపెట్టాడు. నాకు ఆ దృశ్యం చాలా ఇబ్బందిగా అనిపించింది. అమ్మమ్మ దగ్గరకు వెళ్లి- ‘‘అతను దొంగ అవ్వచ్చు. కానీ తాత అలా ఉమ్ములు వేయడం సరైనది కాదు. అతన్ని తరిమికొట్టాలి లేదా అడిగింది ఇచ్చేయాలి’’ అన్నాను. అప్పుడు అమ్మమ్మ- ‘‘నువ్వయితే ఏం చేస్తావు?’’ అని అడిగింది. ‘‘లాగి కొడతాను’’ అన్నాను. అమ్మమ్మ- ‘‘అయితే కొట్టు’’ అంది. నేను కొట్టడానికి దొంగ దగ్గరకు వెళ్లాను. ఆ దొంగ ఎవరో కాదు- నాకు ప్రతి రోజు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పే మాస్టారే! నాకు కోపం మరింత పెరిగిపోయింది. అతని మీద పడి కొట్టడం మొదలుపెట్టా. ‘‘దొంగ అయితే వదిలేసేవాళ్లమేమో! కానీ మీరు నాకు ఉదయం మంచి మాటలు చెబుతారు. రాత్రి వచ్చి దొంగతనాలు చేస్తున్నారు. ఈ రెండింటికీ పొంతన లేదు. ఈ రెండింటిలో దేన్ని నేను నమ్మాలి?’’ అని అడిగాను. అమ్మమ్మ వచ్చి - అతన్ని బయటకు వెళ్ళిపొమ్మని చెప్పింది. అప్పుడు ఆయన- ‘‘తమలపాకు ఉమ్ములతో నా బట్టలు పాడైపోయాయి. నేను ఏం చేయాలి?’’ అని అమ్మమ్మను అడిగాడు. అప్పుడు అమ్మమ్మ - ‘‘రేపు రండి! కొత్త బట్టలు కొనిస్తాను’’ అంది. అయితే ఆ మర్నాడు ఆయన మా ఇంటికి రాలేదు. కానీ అమ్మమ్మే వాళ్లింటికి వెళ్లి బట్టలు ఇచ్చింది. ‘‘నువ్వు చేసింది తప్పు! కానీ మా ఆయన చేసింది కూడా తప్పే! నీకు ఎప్పుడు కొత్త బట్టలు కావాలన్నా మా ఇంటికి వచ్చి అడుగు’’ అని చెప్పింది. ఆ తర్వాత ఆయన నాకు పాఠాలు చెప్పటానికి మా ఇంటికి రాలేదు. కానీ నేనే అప్పుడప్పుడు ఆయన ఇంటి ముందుకు వెళ్లి- ‘‘ఆ రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తుందా?’’ అని అరుస్తూ ఉండేవాడ్ని.’’
గ్లింప్సెస్ ఆఫ్ గోల్డెన్ ఛైల్డ్‌హుడ్
ఓషో అనుభవాల సంకలనం
ఇవి కూడా చదవండి:
చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం