Share News

హరినామప్రదాత

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:39 AM

శ్రీచైతన్య గౌడీయ సంప్రదాయంలో శ్రీనిత్యానంద ప్రభువుకు ఉన్న స్థానం అద్వితీయమైనది. ఆయనను సాక్షాత్తూ బలరాముని అవతారంగా పరిగణిస్తారు. శాస్త్రాల విశ్లేషణ ప్రకారం...

హరినామప్రదాత

హరేకృష్ణ

రేపు నిత్యానంద త్రయోదశి

శ్రీచైతన్య గౌడీయ సంప్రదాయంలో శ్రీనిత్యానంద ప్రభువుకు ఉన్న స్థానం అద్వితీయమైనది. ఆయనను సాక్షాత్తూ బలరాముని అవతారంగా పరిగణిస్తారు. శాస్త్రాల విశ్లేషణ ప్రకారం బలరాముడు గురుతత్త్వానికి మూలపురుషుడు. కృష్ణుడి వివిధ లీలల్లో ఆయనకు తోడుగా నిలిచిన బలరాముడు... ఆ పరమాత్మ స్వరూపాన్ని భక్తులకు పరిచయం చేసిన ఆదిగురువు. శ్రీకృష్ణుడు కలియుగంలో చైతన్య మహాప్రభువుగా అవతరించినప్పుడు... ఆయనకు సంకీర్తనా యజ్ఞంలో తోడ్పడడం కోసం బలరాముడు శ్రీ నిత్యానంద ప్రభువుగా ఆవిర్భవించారు. మహా ప్రభువు చేపట్టిన హరినామ ప్రచారంలో నిత్యానందుల పాత్ర ఎంతో కీలకమైనది. ‘శ్రీ చైతన్య భాగవతం’, ‘చైతన్య చరితామృత’ లాంటి గ్రంథాలు ఆయనను ‘బలరామ స్వరూపం’గా నిర్ధారించాయి.

కరుణకు ప్రతిరూపం

నిత్యానంద ప్రభువు కరుణామయుడిగా ప్రసిద్ధి చెందారు. ఆ కరుణతత్త్వం ద్వారానే ప్రజలకు చేరువయ్యారు. నవద్వీపధామంలో జగాయి, మధాయి అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు మద్యపానం, జూదం లాంటి దురలవాట్లకు లోనయ్యారు. అందరితోనూ అమర్యాదగా ప్రవర్తించేవారు. హింసా ప్రవృత్తితో భయపెట్టేవారు. వారిని ఉద్ధరించాలనే సంకల్పంతో శ్రీనిత్యానందుడు వారి వద్దకు వెళ్ళి, హరినామ సంకీర్తన చేయాలని కోరారు. మధాయి కోపంగా ఒక మట్టి కుండ పెంకుతో ఆయనపై దాడి చేశాడు. నిత్యానందుల నుదుటి నుంచి రక్తం ప్రవహించింది. అయినప్పటికీ ఆయన కోపగించుకోకుండా... ‘‘నన్ను కొట్టినా పరవాలేదు. ఒక్కసారి కృష్ణ నామాన్ని జపించండి’’ అని వేడుకున్నారు. ఈ వార్త తెలిసిన చైతన్య మహాప్రభువు ఆగ్రహంతో వారిని శిక్షించడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించారు. నిత్యానందులు అడ్డుపడి, వారిని క్షమించాలని ప్రార్థించారు. ఈ అసమానమైన కరుణను చూసిన జగాయి తక్షణమే శరణాగతి పొందగా, మధాయి కూడా తన తప్పు తెలుసుకొని ప్రభువు పాదాలపై పడ్డాడు.


ఆది గురువు

మాయావాద సంప్రదాయంలో అగ్రగణ్యుడైన సార్వభౌమ భట్టాచార్య... జగన్నాథపురిలో శ్రీ చైతన్య మహాప్రభువును దర్శించి, శిష్యుడిగా మారారు. ఆయన శ్రీనిత్యానందులను ‘హరినామప్రదం దేవం’ అని కొనియాడారు. అంటే ‘హరినామాన్ని ప్రసాదించే దైవం’ అని అర్థం. బద్ధ జీవులకు (సంసారంలో బందీలు అయిన వారికి) హరినామాన్ని ప్రసాదించే ఆది గురువు శ్రీనిత్యానంద ప్రభువు. జీవాత్మను శ్రీ చైతన్య మహాప్రభువుకు, పవిత్ర హరినామానికి అనుసంధానం చేసే వారధి ఆయనే. తనను కలిసిన ప్రతి ఒక్కరికీ భగవత్‌ ప్రేమను ఎలాంటి వివక్ష లేకుండా పంచారు. ఆయనకు ప్రతినిధిగా విశ్వగురువు శ్రీల ప్రభుపాదులు అందించిన సూచనలు, ఆదేశాలను పాటించడం ద్వారా ఎవరైనా తమ జీవితంలో అత్యున్నతమైన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందవచ్చు. సాధారణ జీవితం సైతం నిత్యానంద ప్రభువు కృపతో, శ్రీల ప్రభుపాదుల మార్గదర్శకత్వంతో శాంతియుతంగా, పరమానందభరితంగా మారుతుంది. ‘హరేకృష్ణ’ మంత్రాన్ని జపించడం ద్వారా శ్రీకృష్ణుడిపట్ల అచంచలమైన భక్తి అనురాగం ఏర్పడతాయి. ఉన్నతమైన ఆ కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి స్వార్థాన్ని విడిచిపెట్టి, పరోపకారమే పరమార్థంగా జీవిస్తాడు.

శ్రీ నిత్యానంద ప్రభువు ఆవిర్భవించిన రోజైన మాఘ శుద్ధ త్రయోదశిని ‘నిత్యానంద త్రయోదశి’గా ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్‌, హరేకృష్ణ మందిరాలు నిర్వహిస్తాయి. భక్తులు మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి... శ్రీ నిత్యానందుని కృప కోసం ప్రార్థిస్తారు. ఆలయాల్లో శ్రీచైతన్య, శ్రీ నిత్యానంద విగ్రహాలకు మహాభిషేకం, విశేష అలంకారాలు చేసి, వందల రకాల పిండివంటలతో రాజభోగ్‌ నైవేద్యం సమర్పిస్తారు. వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. నిత్యానందుని లీలలు, ఆయన చూపిన కరుణ, భక్తిమార్గంపై పండితులు ప్రవచనాలు చేస్తారు. రాత్రి నగర సంకీర్తన, విందులతో కార్యక్రమాలు ముగుస్తాయి.

శ్రీసత్యగౌర చంద్రదాస ప్రభూజీ

అధ్యక్షులు, హరే కృష్ణ మూవ్‌మెంట్‌,

హైదరాబాద్‌, 9640086664

ఇవి కూడా చదవండి..

సిట్ అధికారులకు లేఖ రాసిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి..

కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..

Updated Date - Jan 30 , 2026 | 05:39 AM