Share News

లోకోత్తరం... నటరాజ స్వరూపం

ABN , Publish Date - Feb 13 , 2026 | 02:37 AM

ఆనందతాండవ స్వరూపం పరమేశ్వరుడి సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహాలనే పంచకృత్యాలకు ప్రతీక. పరమేశ్వరుని లారూపాలలో నటరాజస్వామి అత్యంత ప్రసిద్ధి చెందిన....

లోకోత్తరం... నటరాజ స్వరూపం

తెలుసుకుందాం

ఆనందతాండవ స్వరూపం పరమేశ్వరుడి సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహాలనే పంచకృత్యాలకు ప్రతీక. పరమేశ్వరుని లారూపాలలో నటరాజస్వామి అత్యంత ప్రసిద్ధి చెందిన రూపం. కైలాసంలో పార్వతీదేవితో కలిసి పరమేశ్వరుడు ప్రదర్శించే నృత్యానికి ‘తాండవం’ అని, పార్వతీదేవి ప్రదర్శించే నృత్యానికి ‘లాస్యం’ అని పేరు. శివతాండవం గంభీరంగా ఉంటే, పార్వతీదేవి ప్రదర్శించే లాస్యం మృదువుగా, సౌకుమార్యంతో కూడి మనోహరంగా ఉంటుంది.

సందర్భానుసారంగా తాండవాన్ని, నృత్యాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. శివుడు మహదానందంతో చేసే నృత్యాన్ని ‘ఆనందతాండవం’ అనీ, ప్రదోషవేళలో (సాయంత్రవేళ) చేసే నృత్యాన్ని ‘సంధ్యాతాండవం’ అనీ, గౌరీదేవితో చేసే నృత్యాన్ని ‘గౌరీతాండవం’ అనీ, కాళికాదేవితో చేసే నృత్యాన్ని ‘కాళికాతాండవం’ అనీ, త్రిపురాసుర సంహార సమయంలో చేసిన నృత్యాన్ని ‘త్రిపురతాండవం’ అని, దుష్టశిక్షణ సమయంలో చేసే నృత్యాన్ని ‘సంహారతాండవం’ అనీ, ఉమాదేవితోకూడి పరమ లాలిత్యంగా, ఉల్లాసంగా చేసే నృత్యాన్ని ‘ఉమాతాండవం’ అనీ అంటారు. ఇవేకాదు... శివుని నృత్యరూపాలు అనేకం. అవి ‘108 కరణాలు’గా ప్రసిద్ధి చెందాయి. చిదంబరం నటరాజస్వామి ఆలయం గోపుర ద్వారాలకు ఇరువైపులా, తంజావూరులోని బృహదీశ్వరాలయం విమానగోపురంపైనా ఈ తాండవ శిల్పాలు దర్శనమిస్తాయి.

ఆనందతాండవం: స్వామి తన ఎడమకాలిని తన కుడికాలిపై అడ్డంగా నిలిపి, కుడికాలును కొంచెం పక్కకు వంచి నిలబడతారు. ఎడమవైపు శరీరాన్ని కాస్త కుడివైపు తిప్పి, ఎడమ చేతిని కుడివైపు బారుగా చాపుతారు. ఎడమ హస్తాన్ని కిందకు వదిలి... లోకాలన్నిటినీ ఆశీర్వదిస్తున్నట్టుగా కుడిచేతిని అభయముద్రగా ఎడమచేతిపై ఉంచుతారు. అలాగే తన పర (వెనుక) హస్తాలలోని కుడిచేతిలో ఢమరుకం, ఎడమచేతిలో అగ్ని ధరించి ఉంటారు. ప్రసన్నమైన చూపులతో, నర్మగర్భమైన చిరునవ్వులతో నిండిన, శాంతభావం ఉట్టిపడే ముఖంతో.. చుట్టూ ప్రజ్వలిస్తున్న అగ్ని శిఖలతో నిండిన ‘ప్రభావళి’ అనే మకరతోరణం మధ్యలో ఆనందంగా నాట్యమాడుతూ దర్శనమిస్తారు. చరాచరజగత్తును లయం చేసుకోగలిగే ఆ స్వామి ఆశ్చర్యం కలిగించేలా ఒక షట్కోణంలో అమరిపోయి ఉంటారు. దీనికే ‘ఆనందతాండవమూర్తి’ అని పేరు. ఈ రూపంలో శివుడు ధరించిన ఆయుధాలనుబట్టి హస్త, పాదముద్రలు ఆయన పంచకృత్యాలను సూచిస్తాయి. ఢమరుకం సృష్టికి, కుడిచేతి అభయముద్ర స్థితికి, పరహస్తాలలోని అగ్ని సంహారానికి, పద్మపీఠం మీద మోపిన కుడిపాదం తిరోధానానికి, గాలిలోకి లేపి ఉంచిన ఎడమపాదం అనుగ్రహానికి ప్రతీకలు.


అపస్మారుడు: శివుడి పాదాలకింద అణగి ఉన్న ఒక పొట్టి భూతానికి ‘అపస్మారుడు’ అని పేరు. ఇతడు చతుస్తాళంలో, మరుగుజ్జురూపంలో... నటరాజు కుడిపాదం కింద బోర్లా పడుకొని, కుడిచేత్తో కత్తిని ఎడమచేతితో పామును పట్టుకొని ఉంటాడు. ఈ భూతం తల నటరాజస్వామి వారి కుడివైపు తిరిగి ఉంటుంది.

శిరోలంకారం: నటరాజస్వామి శిరస్సు కొంగ ఈకలను పూలగుత్తి మాదిరిగా వరుసగా అమర్చినట్టు అలంకరించి ఉంటుంది. అలాగే ఒక పాము, ఉమ్మెత్త, జిల్లేడు తదితర పుష్పాలతో... మధ్యలో ఒక పుర్రె, తలకు కుడిపక్కన చంద్రవంక ఉంటాయి. మిగిలిన కేశాలు జడలుగా, ఆయన వేగవంతమైన నృత్యరీతులకు అనుగుణంగా, వదులుగా గాలిలో ఎగురుతున్న జటాజూటంగా అమరి ఉంటుంది. స్వామివారి కుడివైపు జడల మధ్యలో గంగాదేవి ఉంటుంది. పైభాగం స్త్రీరూపంలో, కిందిభాగం చేపలా విలక్షణంగా కరండ మకుటంతో, అంజలిముద్రతో ఉంటుంది.

ఆభరణాలు: ఆనందతాండవమూర్తి తన కంఠంలో వివిధ హారాలు, భుజం పైనుంచి యజ్ఞోపవీతం, ఎడమచెవికి తాటంకం, కుడిచెవికి మకరకుండలం, చేతికి కంకణాలు, భుజాలకు కటక వలయాలు, పాదాలకు పాదసరాలు, కుడిచేతికి వీరకంకణం, కాలివేళ్ళకు పాద అంగుళీయకాలు, చేతివేళ్ళకు ఉంగరాలు ధరించి ఉంటారు. స్వామి పొట్ట చుట్టూ ఉండే ఉదరబంధం... ఆయన చుట్టూ ఉన్న మకరతోరణానికి ఆనుకునేటట్టు ఉంటుంది.

భుజంగవలయం: విలాసంగా నృత్యం చేస్తున్న స్వామి చెంత అంతే వయ్యారంగా పడగవిప్పి ఆడుతున్నట్టు ఉండే పాముల వరసలను ‘భుజంగ వలయం’ అంటారు. ఆ మూర్తికి వస్త్రంగా నడుముచుట్టూ పులితోలు ఉంటుంది.

ప్రభావళి: ఈ ప్రభావళి గుండ్రంగా లేదా అండాకారంలో ఉంటుంది. పీఠం దగ్గర ఉన్న మకరాల నోటి నుంచి బయటికి వస్తున్నట్టు ఉంటుంది. దాని చుట్టూ అగ్నిశిఖలు వరుసగా మండుతున్నట్టు... సూర్యుడికి ప్రతీకగా అమరి ఉంటుంది. ప్రభావళి మీద ప్రకృతికి ప్రతీకగా లతలు, పద్మాలు ఉంటాయి. సూర్యుడు తన తేజస్సు ద్వారా ప్రపంచాన్ని స్వాధీన పరచుకొని సృష్టిని నడుపుతున్నట్టు... ఈ ప్రభావళిలోని నటరాజస్వామి పంచకృత్యాలు నడుపుతున్నాడనే సూచికగా ఈ ప్రతిమ ఉంటుంది.

శివకామసుందరి: ఆనందతాండవమూర్తి రూపాన్ని విస్మయంతో చూస్తున్నట్టు... స్వామికి ఎడమ పక్కన సంభ్రమంతో నిండిన పార్వతీదేవి... కుడిచేతితో నీలోత్పలం పట్టుకొని, ఎడమచేతిని డోలాహస్తంగా కిందికి వదిలి, కరండ మకుటం లేదా జటామకుటంతో కూడిన భంగిమలో... ‘శివకామసుందరి’గా నిలబడి ఉంటుంది.


ఆభాసభంగం: నిలబడిన భంగిమలో ఉండే విగ్రహాలు శిల్పశాస్త్రాలలోని భంగ లక్షణం ప్రకారం ‘ఆభంగం, సమభంగం, అతిభంగం’ అనే మూడు విధాలుగా ఉంటాయి. నాట్యపద్ధతిలో ఉన్న విగ్రహాలకు ‘ఆభాసభంగ విగ్రహాల’ని పేరు. నటరాజస్వామి ఆనందతాండవ రూపం... ఆభాసభంగ ప్రతిమలకు గొప్ప ఉదాహరణ. తాళమానాన్ని అనుసరించి ఈ మూర్తిని ఉత్తమ దశతాళ విగ్రహ ప్రమాణంలో కానీ, మధ్యమ దశతాళ ప్రమాణంలో కానీ తయారు చేయాలి.

డి.యన్‌.వి. ప్రసాద్‌, స్థపతి, 9440525788

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 02:37 AM