Share News

ప్రహ్లాద వరదుడు నారసింహుడు

ABN , Publish Date - May 01 , 2026 | 05:17 AM

శ్రీమహా విష్ణువు దశావతారాల్లో నాలుగోది నరసింహావతారం. ఈ అవతారంలో... సగం నరుడు, సగం సింహం రూపంలో స్వామి దర్శనమిస్తారు. నరసింహ, నారసింహ, నృసింహ, నరహరి....

ప్రహ్లాద వరదుడు నారసింహుడు

తెలుసుకుందాం

శ్రీమహా విష్ణువు దశావతారాల్లో నాలుగోది నరసింహావతారం. ఈ అవతారంలో... సగం నరుడు, సగం సింహం రూపంలో స్వామి దర్శనమిస్తారు. నరసింహ, నారసింహ, నృసింహ, నరహరి... ఇవన్నీ ఆ అవతారాన్ని వర్ణించే నామాలే.

కశ్యపుడు, దితి దంపతులకు జన్మించిన రాక్షసుడు హిరణ్యకశివుడు. పగలు రేయి కాని సమయం, మానవులు జంతువులు కానివారు, నేల మీద పైన కాని స్థితిలో, ఆయుధాలు కాని వాటితో మాత్రమే మరణించేలా తపోబలంతో అతను వరం పొందాడు. తను అజేయుణ్ణనీ, తనకు మరణం లేదని విర్రవీగుతూ సకల లోకాలను బాధించసాగాడు. విష్ణువును సదా ద్వేషించే హిరణ్యకశిపుడికి గొప్ప విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జన్మించాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి ద్వారా నారాయణ అష్టాక్షరీ మంత్రోపదేశం పొందాడు. తన శత్రువుకు ప్రహ్లాదుడు భక్తుడు కావడం సహించలేక... అతణ్ణి హిరణ్యకశిపుడు ఎన్నో బాధలు పెట్టాడు. అయినా ప్రహ్లాదుడు హరిభక్తిని విడిచిపెట్టకపోవడంతో... అతని ప్రాణాలు తీయాలని విఫలయత్నం చేశాడు. చివరకు... తన భక్తుణ్ణి రక్షించడానికి స్తంభం నుంచి నరసింహుడిగా ఆవిర్భవించిన శ్రీహరి... గడప మీద కూర్చొని, హిరణ్యకశిపుణ్ణి తన తొడల మీద పెట్టి, సంధ్యా సమయంలో, గోళ్ళతో చీల్చి చంపి... లోకానికి శాంతి కలిగించాడు. ఇదంతా మన తెలుగు నేల అయిన అహోబిలంలో... కృత యుగంలో జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి.

నరసింహమూర్తి ప్రతిమలలో నాలుగు భేదాలున్నాయి. అవి:

గిరిజా నృసింహమూర్తి: ఈ స్వామి కొండ గుహలలో ఉంటాడు. ఒంటరివాడు కాబట్టి ‘కేవల నృసింహుడు’ అని కూడా పిలుస్తారు. ఆయనకు రెండు లేదా నాలుగు భుజాలుంటాయి. స్ఫటిక వర్ణంతో ఉంటాడు. చతుర్భుజ స్వామి పరహస్తాలలో కుడిచేత చక్రాన్ని, ఎడమ చేత శంఖాన్ని ధరించి, నిజ హస్తాలు రెండిటినీ తన మోకాళ్ళ మీద పెడతాడు. కాళ్ళని కత్తెరలా ఉంచి, మోకాళ్ళకు యోగపట్టంతో... పద్మపీఠం మీద ఆసీనుడై ఉంటాడు. ఆయనను వైఖానస ఆగమం ‘యోగనరసింహుడి’గా కీర్తించింది. అలాగే మరో రూపంలో... సింహాసనంపై కూర్చొని, ఎడమకాలును మడిచి పీఠం మీద ఉంచి, కుడికాలును కిందకు చాచి, సుఖాసన స్థితిలో ఉంటాడు. చతుర్భుజాలతో... పరహస్తాలలో శంఖ చక్రాలను ధరించి, నిజ హస్తాలలో కుడిచేతిని అభయముద్రతో, ఎడమ చేతిని నడుముపై ఉంచి... కట్యావలంబిత ముద్రతో కనిపిస్తాడు. ఈ స్వామికి కుడివైపున భూదేవి ఉంటుంది. ఇదే పీఠంపై శ్రీదేవి పద్మాన్ని, భూదేవి నీలోత్పల పుష్పాలను ధరించి, సర్వాభరణ భూషితలై కూర్చున్నట్టు రూపొందించవచ్చని వైఖానస ఆగమం వివరించింది.


స్థాణ నృసింహ స్వామి: స్తంభం నుంచి ఆవిర్భవించడం వల్ల ఈ మూర్తిని ‘స్థాణ నృసింహమూర్తి’ అంటారు. ఎంతో కోపంగా చూస్తూ ఉండడంతో ‘ఉగ్రనరసింహమూర్తి’ అని కూడా అంటారు. ఈ మూర్తి నాలుగు చేతులతో... పై రెండు చేతుల్లో శంఖ, చక్రాలతో, కుడిచేతిని అభయ ముద్ర లేదా వరద ముద్రతో, ఎడమ చేతిని తొడపై ఆన్చి... సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. ఎర్రని వస్త్రాన్ని ధరించిన ఈ స్వామి తెల్లటి శరీరం కలవాడు. వైఖానస ఆగమంలో మరో చోట... ఈ మూర్తి 12 లేదా 16 చేతులతో త్రిభంగిమలో ఉంటాడని, తన ఎడమ తొడపై హిరణ్యకశిపుణ్ణి చీలుస్తున్నట్టు శిల్పంగా మలచాలని సూచించింది. కేవలం ఎనిమిది చేతులు ఉన్నప్పుడు... నాలుగింటిలో శంఖం, చక్రం, గద, పద్మాలను, రెండు చేతులతో హిరణ్యకశిపుణ్ణి చీలుస్తున్నట్టు, మిగిలిన రెండు చేతులతో ఆ రాక్షసుడి శరీరం నుంచి లాగిన పేగులను మాలలుగా ధరిస్తున్నట్టు చూపించాలని పేర్కొంది. ఈ మూర్తిని బంగారు రంగులో లేదా పసుపు చాయ ఉన్న గోధుమ రంగులో లేదా నీలి రంగులో చూపించాలని తెలిపింది.

యానక నరసింహమూర్తి: ప్రయాణం చేస్తున్న రూపం. ఈ మూర్తి గరుత్మంతుడు లేదా ఆదిశేషుడు మోస్తున్నట్టు ఉంటాడు. స్వామి నాలుగు చేతులలో... పై ఎడమ, కుడి చేతుల్లో శంఖ, చక్రాలు ధరించి ఉంటాడు. నరసింహుని శిరస్సుపై అయిదు పడగల ఆదిశేషుడు గొడుగులా నీడ ఇస్తూ ఉంటాడు. ఈ విధమైన యానక నరసింహమూర్తి ప్రతిమ అతి అరుదైనది.

లక్ష్మీ నరసింహమూర్తి: ఈ మూర్తి పద్మాసనంలో కూర్చొని ఉంటాడు. ఎడమ తొడపై లక్ష్మీదేవి ఉంటుంది. ఆమె పాదాలను ఒక పద్మం తాకుతూ ఉంటుంది. పర హస్తాలలో ఎడమ, కుడి చేతులు శంఖ చక్రాలను ధరించి ఉంటాయి, కుడిచేయి అభయముద్రతో, ఎడమ చేయి లక్ష్మీదేవిని ఆలింగనం చేసుకున్నట్టు ఉంటుంది. లక్ష్మి తన కుడి చేతిని నరసింహుని వీపుపై ఉంచి, ఎడమ చేతితో పద్మాన్ని ధరించి ఉంటుంది. ఆలీఢాసనంలో గరుత్మంతుడు కూడా ఈ విగ్రహం కింది భాగంలో ఉంటాడు.

డి.యన్‌.వి. ప్రసాద్‌ స్థపతి

9440525788

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి జిల్లాలోనూ నారసింహ క్షేత్రాలున్నాయి. సింహాచలం, ఆహోబిలం, మంగళగిరి, వేదాద్రి, యాదాద్రి, మాల్యాద్రి, అంతర్వేది, పెంచలకోన తదితర క్షేత్రాలు వీటిలో ప్రసిద్ధమైనవి.

ఇవి కూడా చదవండి

స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రెగ్యులర్‌గా మార్పు

చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు

Updated Date - May 01 , 2026 | 05:17 AM