‘నక్షి’ నగలతో నైస్‌గా...
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:46 AM
సంప్రదాయ ఆభరణాల్లో ‘నక్షి’ నగలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని యంత్రాలతో కాకుండా చేతి పనితనంతో రూపొందిస్తారు. ఇవి....
సంప్రదాయ ఆభరణాల్లో ‘నక్షి’ నగలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని యంత్రాలతో కాకుండా చేతి పనితనంతో రూపొందిస్తారు. ఇవి దేవాలయ శిల్పకళను ప్రతిబింబిస్తుంటాయి కానీ టెంపుల్ జ్యువెలరీకి పూర్తిగా భిన్నం. లోపల గుల్లగా పైకి ఉబ్బెత్తుగా తక్కువ బరువుతో నిండుగా కనిపిస్తుంటాయి ఈ నక్షి ఆభరణాలు.
‘నక్షి’ అంటే ‘చెక్కడం’ అని అర్థం. సుత్తి, ఉలి లాంటివాటిని ఉపయోగిస్తూ బంగారం లేదా వెండి రేకుల మీద డిజైన్లు గీసి వాటి ప్రకారం అందమైన నగిషీలను 3డీ ఎంబోజింగ్‌లా చెక్కుతారు. లోహాన్ని వెనక నుంచి ముందుకు నొక్కుతూ డిజైన్లను పూర్తిచేస్తారు. ఒక్కో ఆభరణం తయారుచేయడానికి కొన్ని నెలలు పడుతుంది. ఈ నగలపై వినాయకుడు, లక్ష్మీదేవి, అష్టలక్ష్ములు, శ్రీనివాసుడు, దశావతారాలు, రాధాకృష్ణులు, ఆంజనేయుడు లాంటి దేవతామూర్తులతోపాటు నెమళ్లు, హంసలు, ఏనుగులు, తామరలు, పూలు, లతలను అద్భుతంగా తీర్చిదిద్దుతారు. పూర్వం చోళ రాజుల కాలం నుంచే ఈ నక్షి కళ ప్రాచుర్యంలో ఉందని తెలుస్తోంది. ఒకప్పుడు రాజవంశీయులకే పరిమితమైన నక్షి నగలు నేడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. వివాహాది శుభకార్యాలు, వేడుకలు, పండుగలప్పుడు మహిళలు వీటిని ధరించడానికి ఇష్టపడుతున్నారు.
నక్షి ఆభరణాలను తయారుచేసిన తరువాత వాటికి చింతపండు గుజ్జు, కరక్కాయ రసం లాంటి సహజ పదార్థాలతో మెరుగు పెడతారు. దీనివల్ల లోతైన భాగాలు నల్లగా, ఉబ్బుగా ఉన్నవి బంగారు వర్ణంలో మెరుస్తుంటాయి. ఇలా నక్షి ఆభరణాలకు యాంటిక్ ఫినిషింగ్ చేకూరుతుంది. ఇవి బంగారు జరీతో నిండిన కాంజీవరం, బెనారస్, కంచి పట్టుచీరలమీద గ్రాండ్‌గా కనిపిస్తాయి.
ప్రస్తుతం లైట్ వెయిట్ నక్షి డిజైన్లు అధికంగా లభ్యమవుతున్నాయి. పెండెంట్ చోకర్లు, లాంగ్ అండ్ షార్ట్ నెక్లె్‌సలు, మ్యాచింగ్ జుంకాలు, చాంద్‌బాలీలు, పాపిడి బిళ్లలు ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్‌తో మెరిసే కాసుల హారాలు, నక్షి పెండెంట్లు జోడించిన గుట్ట పూసల సెట్లు, వడ్డాణాలు, కడియాలు, గాజులను యువతులు ఎక్కువగా కొంటున్నారు. ఒకవైపు సీజెడ్‌లు, కెంపులు, పచ్చలు, ముత్యాల వర్క్... మరో వైపున ప్లెయిన్ నక్షి వర్క్‌తో రెండు రకాలుగా ధరించడానికి వీలుగా రూపొందించిన కస్టమైజ్డ్ హారాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
నక్షి ఆభరణాలపై ఉండే అద్భుతమైన పనితనం తరతరాలకూ నిలిచి ఉంటుంది. ప్రతి ఆభరణం దేనికదే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఏ రెంటికీ సారూప్యం కనిపించదు. వీటిని ఇతర నగలతో కలిపి పెట్టకూడదు. మెత్తని కాటన్ గుడ్డలో చుట్టి ఉంచాలి. లేదా వెల్వెట్ బాక్సుల్లో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. వీటిపై పర్ఫ్యూమ్‌లు పడకుండా, మేకప్ ఉత్పత్తులు అంటకుండా చూసుకోవాలి.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్