Share News

చలవనిచ్చే దోసపండు

ABN , Publish Date - Jun 27 , 2026 | 01:42 AM

కర్బూజా లేదా ఖర్భుజా అనే పేరు గురించి పండితుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది అరబ్బీ మూల పదం. మరికొందరు ‘కరపుచ్చ, కరబుచ్చ, కరబుజ, కరబూజ’ అనే...

చలవనిచ్చే దోసపండు

భోజన కుతూహలం

కర్బూజా లేదా ఖర్భుజా అనే పేరు గురించి పండితుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది అరబ్బీ మూల పదం. మరికొందరు ‘కరపుచ్చ, కరబుచ్చ, కరబుజ, కరబూజ’ అనే రూపాంతరాల ద్వారా కర్బూజా లేదా ఖర్భుజా అనే పేరు ఏర్పడిందని భావిస్తారు. ‘ఆంధ్ర వాచస్పత్యం’ గ్రంథం కూడా ‘కరపుచ్చ’ పదమే ‘కరబూజ’గా పరిణామం చెందిందనే అభిప్రాయాన్ని సమర్థిస్తూ, దీనికి ‘చలవనిచ్చే ఒకానొక దోస’ అని అర్థం తెలిపింది. కుకుమిద్‌ అల్టిసిమస్‌: ‘కుకుమిస్‌’ అంటే దోస కుటుంబానికి చెందినదని. ‘అల్టిసిమస్‌’ అంటే అత్యంత ఉపయోగకరమైనదనీ అర్థం. ఆ విధంగా ఇది పేరుకు తగిన ఆహార ఔషధ ఫలం.

సంస్కృతంలో దోసకాయను ‘కర్కటీ, త్రపుషా’ అని పిలుస్తారు. దోసకాయ జాతిలో అనేక రకాలున్నాయి. వాటిలో పెద్ద దోస (రాజకర్కటీ), నక్క దోస (కోష్టుశీర్షా), ముళ్ల దోస (కంటకోర్వార), చేతి దోస (హస్తిపర్ణీ), కర్బూజా (వృత్తకర్కటి), ఏనుగు దోస (హస్తికర్కటీ) మొదలైనవి ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావించారు. కర్బూజాని ‘సోమకర్కటీ’ అని కూడా పిలుస్తారు. కొన్ని తెలుగు ప్రాంతాల్లో ‘సిద్ధవటం దోస’ అంటారు. వృక్ష శాస్త్ర రచయిత గోటేటి జోగరాజు... సిద్ధవటం ప్రాంతంలో నాలుగు రకాల కర్బూజాలు సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కర్బూజా... దోస జాతికి చెందిన మేలు జాతి పండు. ఉష్ణ మండల పంట అయినప్పటికీ, ఆసేతుహిమాచలం బాగా పండుతుంది. ఒకప్పుడు కర్నూలు జిల్లా కర్బూజాల సాగుకు ప్రత్యేక ఖ్యాతిని సంపాదించింది. కొన్ని రకాల కర్బూజాల్లో కస్తూరి పరిమళం ఉండటంవల్ల వాటిని ‘కస్తూరి కర్బూజా’ అంటారు. వీటి ఆకులు, గింజలు దోసకాయను పోలి ఉన్నప్పటికీ, ఆకారంలో కొద్దిగా పెద్దవిగా ఉంటాయి. కొన్నిటిపై మచ్చలు లేదా చారలు కనిపిస్తాయి కనుక ‘స్నేక్‌ గోర్డ’ అని పిలుస్తారు.

బాగా పండిన కర్బూజా పండ్లలోని దూదివంటి భాగాన్ని, గింజలను వేరు చేస్తారు. గింజలకు కొద్దిగా బూడిద పట్టించి ఎండబెట్టి, తరువాత శుభ్రపరచి నిల్వ ఉంచుతారు. ఈ విధంగా ఆరబెట్టిన గింజలు ఏడాది వరకు చెడిపోకుండా నిల్వ ఉంటాయి.


రక్త శుద్ధి...

కర్బూజా శరీరానికి సమశీతోష్ణ స్థితిని కలిగిస్తుంది. శరీర వేడిని తగ్గించి, మూత్రంలో మంటను నివారిస్తుంది. శరీరానికి పుష్టిని అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బుద్ధివర్ధక ఫలంగా కూడా దీనికి మంచి పేరుంది. వృద్ధాప్యంలో కర్బూజాను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే జ్ఞాపకశక్తి క్షీణతను తగ్గించడంలో తోడ్పడుతుందని భావిస్తారు. కిడ్నీలకు బలాన్నిచ్చి, వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. త్రిదోషాలను సమస్థితిలో ఉంచడంలో సహకరిస్తుందని ఆయుర్వేదం పేర్కొంటుంది.

గంగరాజు అరుణాదేవి

మూత్రపిండాలకు మేలు...

లివర్‌ను శక్తిమంతం చేసి, కాలేయ వ్యాధులతో బాధపడేవారికి మేలు చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో, చిన్న రాళ్లను కరిగించడంలో సహాయకారిగా పని చేస్తుంది. టైఫాయిడ్‌ జ్వరంలో పథ్యాహారంగా కూడా దీనిని ఉపయోగిస్తారు. పేగు పూతను తగ్గించి, క్షార గుణం కారణంగా ఏర్పడే ఎసిడిటీని నివారిస్తుంది. కొన్ని విషదోషాల ప్రభావాన్ని తగ్గించడంలో ఉపకరిస్తుంది. ఎగ్జీమా వంటి కొన్ని చర్మ వ్యాధులలో కూడా కర్బూజాను ఔషధాహారంగా వినియోగించే సంప్రదాయం ఉంది. ఆహారం, ఔషధం, శరీరానికి చల్లదనం... ఈ మూడింటినీ ఏకకాలంలో అందించే అరుదైన దోస జాతి ఫలం కర్బూజా.

ఇవి కూడా చదవండి

విగ్ కారణంగానే కేతన్ హత్య.. తండ్రి ఏమన్నారంటే..

IND vs IRE: టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరిదంటే..

Updated Date - Jun 27 , 2026 | 01:42 AM