పట్టుపై ఎంఎస్ రాగాలు
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:57 AM
ఎంఎస్ గారికి ఎంతో ఇష్టమైన శంకరాభరణం, భైరవి, కల్యాణి.. ఇలా అయిదు రాగాలను ఎంచుకుని రాగా ఎడిషన్ కింద డిజైన్లు రూపొందించాం. వీటి తయారీలో మాత్రం...
ఎంఎస్ గారికి ఎంతో ఇష్టమైన శంకరాభరణం, భైరవి, కల్యాణి.. ఇలా అయిదు రాగాలను ఎంచుకుని రాగా ఎడిషన్ కింద డిజైన్లు రూపొందించాం. వీటి తయారీలో మాత్రం ఆధునిక పద్ధతులను పాటించాం. ఇప్పటికే శంకరాభరణం చీరను ఎంఎస్ బయోపిక్ ప్రారంభోత్సవంలో రష్మిక కట్టుకున్నారు.
ఎంఎస్ సుబ్బులక్ష్మి పేరు వినగానే ‘సుప్రభాతం’ గుర్తుకువస్తుంది. వెంటనే ప్రత్యేకమైన చీరకట్టు, ముక్కు పుడక, మల్లెపూల చెండుతో ఆమె అందమైన రూపం కళ్లముందు నిలుస్తుంది. ఆ సంగీత విద్వాంసురాలి జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎంఎస్- ఎ లెగసీ ఆన్‌స్ర్కీన్’ పేరుతో తెరకెక్కిస్తున్న బయోపిక్‌లో రష్మిక.. ఎంఎస్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె కట్టుకొచ్చిన కంజీవరం పట్టు చీర అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చీరని ‘సుస్వరం రాగ ఎడిషన్’ కోసం ‘ఐక్యత’ హ్యాండ్‌లూమ్ బ్రాండ్ ప్రత్యేకంగా రూపొందించింది. ‘ఎంఎస్ బ్లూ’గా పేరొందిన ఈ నీలి రంగు పట్టుచీర గురించి ‘ఐక్యత’ యజమాని యశ్వంత్ సుంకు ‘నవ్య’కు చెప్పిన విశేషాలివి.
మా నాన్నగారు నాగసుందరం. ఆయనది హిందూపురం సమీపంలోని లేపాక్షి. బెంగళూరులో చదువుకున్నారు. 1978లో చీరల వ్యాపారం మొదలుపెట్టారు. చీరలను తయారుచేసి రిటైలర్లకు పంపేవారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా వ్యాపారం జరిగేది. ప్రస్తుతం బెంగళూరులో మూడు స్టోర్లు, 70 మగ్గాలు ఉన్నాయి. వీటిని నేను, తమ్ముడు చూసుకుంటున్నాం. మా దగ్గరికి వచ్చేవాళ్లు ఎక్కువగా వింటేజ్ కలెక్షన్లు, ఎంఎస్ బ్లూ చీర గురించి అడుగుతుంటారు. ఒకసారి ఎంఎస్ ముని మనవరాళ్లు ఐశ్వర్య, సౌందర్య మా స్టోర్‌కు వచ్చారు. మాటల సందర్భంలో ఎంఎస్ కట్టుకున్న చీరలు వాళ్లదగ్గర ఇంకా ఉన్నాయని తెలిసింది. వాటినోసారి చూడాలని అడిగాను. వాళ్లుకూడా బెంగళూరులోనే ఉంటారు కాబట్టి చూపించడానికి ఒప్పుకున్నారు. మొత్తం 22 చీరలు ఉన్నాయి. వాటి డిజైన్లు చూశాక అలాంటి వింటేజ్ చీరలనే తయారుచేయాలనిపించింది. ఎంఎస్ మనవడు శ్రీనివాసన్ అనుమతి కూడా తీసుకున్నాం. ఈ వింటేజ్ కలెక్షన్‌లో ఏడు చీరలను ఆర్కైవ్ ఎడిషన్ కింద రీక్రియేట్ చేశాం. వీటికి పూర్తిగా సంప్రదాయ పద్ధతులనే అనుసరించాం. ఇప్పటికి మూడు చీరలను మాత్రమే లాంఛ్ చేశాం. ఎంఎస్ గారికి ఎంతో ఇష్టమైన శంకరాభరణం, భైరవి, కల్యాణి.. ఇలా అయిదు రాగాలను ఎంచుకుని రాగా ఎడిషన్ కింద డిజైన్లు రూపొందించాం. వీటి తయారీలో మాత్రం ఆధునిక పద్ధతులను పాటించాం. ఇప్పటికే శంకరాభరణం చీరను ఎంఎస్ బయోపిక్ ప్రారంభోత్సవంలో రష్మిక కట్టుకున్నారు. కాన్సెప్ట్, కలర్ రీత్యా అది బాగా వైరల్ అయింది. మిగిలిన వాటిని దశలవారీగా లాంఛ్ చేస్తాం. మహిళలు ఎక్కువగా అడిగే ఎంఎస్ బ్లూ చీరల కోసమే ఈ ప్రాజెక్టులు ప్రారంభించాం.
ఆమె చీరల ప్రత్యేకత...
అప్పట్లో కంచి పట్టు చీరలను కోర్వే టెక్నిక్‌లో నేసేవారు. అంటే చీర, బోర్డర్ రెంటినీ వేర్వేరుగా రూపొందించి ఆపైన జోడించేవారు. ఎంఎస్ గారు ఎంపిక చేసుకున్న చీరలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆమె చీరల్లో గోపురం, టెంపుల్ డిజైన్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక సెంటీమీటర్లో డిజైన్ చేస్తున్నాం కానీ అప్పట్లో అర సెంటీమీటర్లోనే రూపొందించేవారు. చాలా శ్రమించి శ్రద్ధగా కళాత్మకంగా నేసేవారు. వీటినే ‘కళాక్షేత్ర’ బోర్డర్స్ అనేవారు. ప్రస్తుతం రెండు దారాలతో ‘టూ ప్లై’ విధానంలో నేస్తున్నారు. కానీ ఆమె చీరలన్నీ ‘త్రీ ప్లై’ అంటే మూడు లేదా అంతకంటే ఎక్కువ దారాలతో నేసి ఉన్నాయి. దీనివల్ల చీర మందంగా ముదురు రంగులో మెరుస్తూ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె చీరలన్నీ ప్యూర్ సిల్వర్ జరీపై గోల్డ్ టచ్‌తో నేసి ఉన్నాయి. జరీ అంటే సిల్క్ థ్రెడ్ మీద గోల్డ్, సిల్వర్, కాపర్, కాడ్మియం అల్లాయ్‌ని కోట్ చేస్తారు. మనకు కావాల్సిన రంగును బట్టి అల్లాయ్ శాతాన్ని మారుస్తారు. సిల్క్ థ్రెడ్ మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రంగు మీదనే గోల్డ్ లేదా సిల్వర్ జరీ బాగా మెరుస్తూ కనిపిస్తుంది.

వింటేజ్ శారీ సాధ్యమేనా...
ప్రస్తుతం చీర పొడవు మారలేదు కానీ నాణ్యత, నేసే విధానం, డిజైన్లు చాలావరకు మారాయనే చెప్పాలి. అపట్లో అన్నీ చేతి మగ్గాలే. వీటిని డెర్బీ లూమ్స్ అనేవారు. వీటిమీద డిజైన్లను ఓ లెక్కతో రూపొందించేవారు. అవి చాలా సహజంగా కళగా కనిపించేవి. ఇప్పుడు జాక్వర్డ్ లూమ్ పద్ధతిని అనుసరిస్తున్నారు. వీటిద్వారా నేయడం చాలా సులువు. కానీ ఓ వింటేజ్ శారీని అలాగే రీక్రియేట్ చేయాలంటే నాణ్యతలో రాజీపడకపోయినా పాత మగ్గంలో వచ్చినట్లు కొత్తదానిమీద రాదు. డిజైన్‌లో కనిపించే ఓ విధమైన అసమానతలే హ్యాండ్‌లూమ్ చీరల ప్రత్యేక గుర్తింపు. అందుకే పాత మగ్గాలు, ఆ పనితనం తెలిసిన నేతగాళ్లు దొరికితేనే వింటేజ్ శారీని యథాతథంగా సృష్టించగలం.
ఎంఎస్ లాగే కనిపిస్తామా..?
ఎంఎస్ వేదిక మీద కచేరీ చేస్తుంటే నేతవారితో సహా ప్రేక్షకులందరూ ఆమెని ఓ దేవతలా చూసేవారు. మనం చీరని ఎంత బాగా రీక్రియేట్ చేసినా ఆమెకు వచ్చిన గ్రేస్ అందరికీ రాకపోవచ్చు. చీర ఒక భాగం మాత్రమే. కట్టు బొట్టు, మల్లె చెండు, ముక్కు పుడకలు, గాత్ర మాధుర్యం అన్నీ కలిసి ఆమెకు ఓ ప్రత్యేకతను తెచ్చి పెట్టాయి. ఎంఎస్‌కు బ్లూ రంగంటే చాలా ఇష్టం. ఆమె ఓసారి నీలి రంగు దారాన్ని ముత్తు చెట్టియార్ అనే వీవర్‌కు ఇచ్చి ఆ రంగు చీరని నేసివ్వమన్నారట. ఆయన ఎంతో కష్టపడి ఎంఎస్ కోసం ప్రత్యేకంగా ఆ రంగును సృష్టించినట్లు చెబుతారు. బ్లూ రంగు వల్ల ఆమె ముఖం ప్రస్ఫుటంగా కనిపించేది. ఆమె సంగీతంలాగే ఆమెకిష్టమైన బ్లూ కలర్ కూడా ఎంఎస్ బ్లూగా ప్రసిద్ధి పొందింది. ఎంఎ్‌సగారిపై చాగంటివారు రూపొందించిన ఓ వీడియోని నాన్నగారు నాకు షేర్ చేవారు. అందులో ఎంఎస్ చీరల డిజైన్లు ముఖ్యంగా ఆ బ్లూ కలర్‌ని చూశాక అలాంటివే తయారుచేయాలని నిర్ణయించుకున్నా. అంతలా నన్ను ప్రభావితం చేసింది ఆ రంగు.

రాగా కలెక్షన్స్...
రాగాలను అనుసరించి చీరల మీద డిజైన్లు తయారుచేసుకున్నాం. ఉదాహరణకు శంకరాభరణం అనేది నటరాజును కీర్తించే రాగం. కాబట్టి బిల్వ పత్రం డిజైన్‌తో బోర్డర్‌ను రూపొందించాం. అలాగే పల్లూ బోర్డర్ మీద నటరాజ స్వామి తాండవ రూపాలను మోటిఫ్స్‌లా తీర్చిదిద్దాం. వాటి కింద గంగానదిని గీతల మాదిరి చూపించాం. మొత్తమ్మీద చూస్తే గంగానదిపై శివుడు నాట్యం చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మనం శివుడిని నీలకంఠుడిగా భావిస్తాం. అందుకే చీరకు నీలి రంగును ఎంచుకున్నాం. అలాగే భైరవి రాగం.. దేవి అమ్మవారి శక్తిని ప్రతిబింబిస్తుంది. అందుకే చీరకు ఎరుపు రంగును ఎంపిక చేశాం. కాంభోజీ అనేది దేవునికి మేలుకొలుపు రాగం. కాబట్టి చీర మీద టెంపుల్ డిజైన్స్ రూపొందించాం. కల్యాణి రాగం శృంగారానికి సంబంధించింది కాబట్టి చీరమీద అలాంటి మోటిఫ్స్ ఉంటాయి. రోజు మొత్తమ్మీద తామర పూవు ఎలా రూపు మార్చుకుంటుందో డిజైన్ల రూపంలో చూడవచ్చు.
ఖరీదు ఎక్కువే అయినా...
ఆర్కైవ్ ఎడిషన్ చీరలు రూ.60,000ల నుంచి 1.4 లక్షల వరకు ప్రారంభ ధరతో లభ్యమవుతున్నాయి. రాగా ఎడిషన్స్ మాత్రం రూ.30,000ల నుంచి రూ.90,000ల వరకు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతానికి చీరలు పరిమితంగానే ఉన్నాయి. శంకరాభరణం చీరను నేయడానికి మా దగ్గర ఒక మగ్గం మాత్రమే ఉంది. కానీ చాలామంది అడుగుతున్నారు. ఎంత ఎక్కువ ఖరీదైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. శారీతోపాటు బాక్సులో మల్లెపూల దిండు, వెండి ముక్కెర, ఎంఎస్ ప్రిజ్ మ్యాగ్నెట్స్, పర్ఫ్యూమ్, ఎంఎస్ బ్లూ కలర్ శారీ సాచెట్ ఉన్న టేబుల్ టాప్ ఫ్రేమ్, ఎంఎస్ మునిమనవరాలి లెటర్, సర్టిఫికెట్ ఆఫ్ అథెంటిసిటీలను ఉంచుతున్నాం. మాకు డూప్లికేట్ల బెడద కూడా ఎక్కువే ఉంటుంది. లాంఛ్ చేసిన మూడో రోజునే అలాంటి చీరలు చాలా తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. కాబట్టి చీరల డిజైన్లు, ధరలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్కో చీరకు కనీసం 700 గ్రాముల పట్టు దారాలు ఉండేలా చూస్తాం. కిలో పట్టు రూ.7000ల వరకు ఉంటుంది. కాబట్టి మంచి కంచిపట్టు చీర రూ.18,000 నుంచి 20,000ల వరకు ధర పలుకుతుంది. అలాగే జరీల విషయంలో కూడా రాజీ పడం.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్