వన దేవతలకు వీరపూజ
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:44 AM
అక్కడ విగ్రహాలు ఉండవు... గంటలు మోగవు... వేదమంత్రాలు వినిపించవు. ప్రకృతితో మాట్లాడినట్టు, అమ్మ చెంతకు వెళ్ళినట్టు... లక్షల హృదయాలను కదిలించే మహా...
మేడారం జాతర
అక్కడ విగ్రహాలు ఉండవు... గంటలు మోగవు... వేదమంత్రాలు వినిపించవు. ప్రకృతితో మాట్లాడినట్టు, అమ్మ చెంతకు వెళ్ళినట్టు... లక్షల హృదయాలను కదిలించే మహా ఆరాధన మేడారం జాతర. సమ్మక్క, సారలమ్మల జాతర కేవలం ఒక ఉత్సవం కాదు. గిరిజన జీవన విధానానికి, వారి సంస్కృతికి, వనదేవతలపై ఉన్న అచంచలమైన భక్తికి ప్రతిరూపం.
మేడారంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు భక్తుల నుంచి పూజలు అందుకుంటారు. సమ్మక్క, సారలమ్మల దర్శనమే మహా భాగ్యంగా జాతరకు వచ్చే భక్తులు భావిస్తారు. మేడారం జాతరకు సంబంధించి ప్రాచుర్యంలో అనేక కథలు ఉన్నాయి. ఎలాంటి విగ్రహాలు, ఆలయాలు లేని సమ్మక్కను తమ జాతి కోసం కాకతీయుల సేనలను ఎదిరించిన వీరవనితగా, ప్రకృతి దేవతగా భక్తులు కొలుస్తారు. సమ్మక్క కుమార్తె సారలమ్మను వీరత్వానికి ప్రతీకగా పూజిస్తారు. ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటంలో సారలమ్మ కత్తి దూసింది. తమ రాజాన్ని, తమ గిరిజనులను కాపాడుకునేందుకు యుద్దభేరి మోగించింది. కొలిచి మొక్కితే కోర్కెలు తీర్చే తల్లిగా సారలమ్మను భక్తులు విశ్వసిస్తారు. ఇక సమ్మక్క సొదరి అయిన నాగులమ్మ కూడా పగిడద్దరాజును వివాహం చేసున్నట్టు ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. కాకతీయులతో జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడిన నాగులమ్మ సంపెంగ వాగు (జంపన్నవాగు) వద్ద వీరమరణం పొందటంతో అక్కడే ఆమె గద్దె ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జంపన్నవాగు సమీపంలోని నాగులమ్మ గద్దె వద్ద భక్తులు సంతానం కోసం మొక్కుకుంటారు. పిల్లలులేని దంపతులు నాగులమ్మను సంతాన లక్ష్మిగా కొలుస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన ప్రతి ఒక్కరూ నాగులమ్మకు తొలి మొక్కు అప్పగిస్తారు. మేడారంలో ఈ ముగ్గురు వీర వనితల పూజే ప్రధానం.

జాతర గద్దెలకు కొత్త కళ
ఎనిమిది శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతర ఈ సారి కొత్త రూపును సంతరించుకుంది. ఇనుప గ్రిల్స్ మధ్య, వెదురు బొంగుల రూపంలో ఉండే వనదేవతల గద్దెలను పునర్‌నిర్మించారు.
గతంలో సమ్మక్క, సారలమ్మల గద్దెలు మాత్రమే ప్రధానంగా ఉండేవి.. వీటికి దక్షిణం వైపు కాస్త చిన్న గద్దెల రూపంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉండేవారు. ప్రభుత్వం ఇటీవల ఈ గద్దెలు ఉన్న ప్రాకారం విస్తీరాన్ని పెంచింది. గతంలో ఈ ప్రాకారంలో 2500 మంది భక్తుల దాకా ఉండటానికి అవకాశముండేది. ప్రస్తుతం తొమ్మిది వేల మంది దాకా ఈ ప్రాకారంలో పడతారు. సమ్మక్క, సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను కూడా ఒకే వరుసలోకి తీసుకువచ్చారు. భక్తులు మొదట సమ్మక్క గద్దె దగ్గర మొక్కులు చెల్లించిన తరువాత వరుసగా సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుని బయటకు వెళ్లేలా ఈ నిర్మాణం రూపుదిద్దుకుంది. ఇక వనదేవతల గద్దెల చుట్టూ గ్రానైట్ రాతితో శిలా తోరణాలను ఏర్పాటు చేశారు.
నాలుగు గద్దెల చుట్టూ నిర్మిస్తున్న 32 గ్రానైట్ స్తంభాల మీద ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు, గొట్టుగోత్రాలు, సంప్రదాయాలు, చరిత్రను తీర్చిదిద్దారు. మేడారం గద్దెలు, ప్రాకారం చుట్టూ ఉన్న గ్రానైట్ రాతి స్తంభాలపై ఆదివాసీ చరిత్ర, గొట్టుగోత్రాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన ఏడు వేలకు పైగా శిల్పాలను ఏర్పాటు చేశారు. సమ్మక్క, సారమ్మలతో పాటు ఆదివాసీల 3,4,5,6,8 గొట్టుగోత్రాలను బొమ్మలుగా చెక్కారు. రాతి స్తంభాల మధ్యలో వెదురు బొంగుల రూపంలో ఉన్న వన దేవతలను యథావిధిగా ఉంచారు. ఆచార సంప్రదాయాలకు, గొట్టుగోత్రాలకు ప్రతిరూపంగాభావించే సూర్యచంద్రులు, త్రిశూలం, నెలవంక , బండి చక్రాలు, కంకవనం, అడ్డ, నిలువు గీతలకు గ్రానైట్ రాతి స్తంభాలపై చోటు దక్కింది.
తడుక రాజనారాయణ, వరంగల్
ఫొటోలు: హరీష్
గొట్టుగోత్రాలు,
వంశాల దేవతల పూజా వృక్షాలు
గోత్రం దేవతవృక్షం పూజిత వృక్షం
3వ గొట్టు
(సారలమ్మ వంశం) ఇప్ప కస్సు
4వగొట్టు
(పగిడిద్దరాజు, గోవిందరాజు) మద్ది బూరుగ
5వ గొట్టు
(సమ్మక్క వంశం) వెదురు మారేడు
6వ గొట్టు
(బేరం బోయినరాజు వంశం) బండారి వేపచెట్టు
8వ గోట్టం
(సిద్దబోయిన వంశం) నెమలినార మర్రి
Also Read:
గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..
అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు నాటండి.!
బడ్జెట్ 2026: పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ చెబుతారా.. ఈ 4 అంశాలపై సానుకూలంగా స్పందిస్తారా.?