Share News

మత్స్యరూపుడు వేద నారాయణుడు

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:55 AM

అధర్మం పెరిగిపోయి, ధర్మానికి హాని కలిగినప్పుడు... భక్తులను పరిరక్షించి, దుష్టులను శిక్షించి, ఈ లోకంలో ధర్మాన్ని సుస్థిరం చేయడానికి ప్రతి యుగంలో...

మత్స్యరూపుడు వేద నారాయణుడు

తెలుసుకుందాం

అధర్మం పెరిగిపోయి, ధర్మానికి హాని కలిగినప్పుడు... భక్తులను పరిరక్షించి, దుష్టులను శిక్షించి, ఈ లోకంలో ధర్మాన్ని సుస్థిరం చేయడానికి ప్రతి యుగంలో అవతరిస్తానని భగవద్గీతలో అర్జునుడితో శ్రీకృష్ణుడు చెప్పాడు. పురాణాలలో మనకు శ్రీరామచంద్రుడు లాంటి పూర్ణావతారాలు, తిరుమల వేంకటేశ్వరుని లాంటి అర్చావతారాలు, వ్యాసుడులాంటి అంశావతారాలు ఉన్నాయి. వీటిలో దశావతారాల గురించి, వాటి రూప లావణ్యాల గురించి తెలుసుకుందాం. ఈ పది అవతారాలలో ఏడు అవతారాల ఆలయాలు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నాయి.

మత్స్యావతారం

వామే శంఖం గదాం దక్షిణే ద్విభుజో మత్స్యరూపధృత్‌

నరాంఘ్రి ర్మత్స్యరూపో వా మత్స్యరూపీ జనార్దనః

చేప రూపాన్ని ధరించి అవతరించిన శ్రీ మహా విష్ణువు తెల్లని శరీరచ్చాయతో, రెండు చేతులతో ఉంటాడు. కుడి చేతిలో గద, ఎడమ చేతిలో శంఖం ధరిస్తాడు. నడుము కింది భాగం మత్స్యరూపంలో, పైభాగం మనుష్య రూపంలో ఉంటుంది. కొన్ని చోట్ల మనుష్య పాదాలు కలిగిన మత్స్యరూపంలో కూడా దర్శనమిస్తాడు. దశావతారాలలో మొదటిది అయిన ఈ మత్స్యావతారానికి ఒక భవ్య దేవాలయం... తిరుపతికి సుమారు 68 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి ‘వేదనారాయణ ఆలయం’ లేదా ‘మత్స్యనారాయణ ఆలయం’ అని పేరు. అక్కడ శ్రీవేదనారాయణ స్వామి రెండు చేతులలో శంఖాన్ని, చక్రాన్ని ధరించి, ఉభయ దేవేరులతో పశ్చిమాభిముఖంగా కొలువై ఉంటాడు. విశేషమేమిటంటే... అమ్మవారు ‘వేదవల్లీ తాయారు’ అనే పేరిట తూర్పు ముఖంగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.


రమణీయ శిల్పకళా నిలయం

శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలంలో పునర్నిర్మితమైన ఈ ఆలయం విజయనగర శిల్పుల నైపుణ్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. పంచ ప్రాకారాలు, సప్త ద్వారాలు కలిగిన ఈ ఆలయం అరుదైన శిల్పకళను సంతరించుకొని శోభాయమానంగా విరాజిల్లింది. ప్రస్తుతం తిరుమల-తిరుపతి దేవస్థానాలు ఈ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని మరమ్మతులు జరిపించాయి. శిథిల గోపురం స్థానంలో నూతన గోపురాలను నిర్మించి, అలనాటి శిల్ప, వాస్తు కళలను పరిరక్షిస్తున్నాయి. ఇక్కడ నిత్యారాధనాది సమస్త సేవా కైంకర్యాలు ఆగమోక్తంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు సూర్య కిరణాలు నేరుగా వచ్చి... మొదటి రోజున స్వామివారి పాదాలను, రెండో రోజున నాభి భాగాన్ని, మూడో రోజున ముఖ భాగాన్ని స్పృశించడం ఈ ఆలయ విశిష్టత. ఆ మూడు రోజులూ స్వామివారి సూర్య పూజోత్సవాలను నిర్వహిస్తారు.

డి.యన్‌.వి. ప్రసాద్‌,

స్థపతి, 9440525788

ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 04:55 AM