అమ్మ, అయ్య అంటే వారే!
ABN , Publish Date - Feb 13 , 2026 | 02:32 AM
ఎక్కడైనా, ఎప్పుడైనా ‘శివయ్య’ అంటాం గానీ ‘నారాయణయ్య’, ‘విష్ణయ్య’ అని అనం. ‘లలితమ్మ’, ‘పార్వతమ్మ’, ‘బాలమ్మ’ అంటాం కానీ ‘లక్ష్మమ్మ’ అనం. లోకంలో వ్యక్తులకు ఆ పేర్లు ఉండవచ్చు. కానీ...
పర్వదినం
15న మహాశివరాత్రి
ఎక్కడైనా, ఎప్పుడైనా ‘శివయ్య’ అంటాం గానీ ‘నారాయణయ్య’, ‘విష్ణయ్య’ అని అనం. ‘లలితమ్మ’, ‘పార్వతమ్మ’, ‘బాలమ్మ’ అంటాం కానీ ‘లక్ష్మమ్మ’ అనం. లోకంలో వ్యక్తులకు ఆ పేర్లు ఉండవచ్చు. కానీ లక్ష్మీదేవిని ‘లక్ష్మమ్మ’ అనే పేరుతో వ్యవహరించం. ఎందుకని? నిజమైన అమ్మ, అయ్యలు పార్వతీ పరమేశ్వరులు కావడమే. అందుకే పూర్వం ఎవరో చనువుతో శివుణ్ణి ‘‘ఓ శివయ్యా! నీ పెళ్ళి ఎప్పుడు చేయమంటావు?’’ అని అడిగితే... మంచి చిగుర్లు పండ్లు, కోకిలలు... ఇలా ఆనందంగా ఉండే వసంత ఋతువును పిల్లలైన మీరే ఉంచుకోండి. ఆకులు రాలిపోతూ, నీరు దాదాపుగా ఇంకిపోతూ ఉండే శిశిర ఋతువులో పెట్టండి’’ అన్నాడు. ‘‘సరే! మంచి వెన్నెల ఉండే శుక్ల పక్షంలో పెడదాం’’ అనగానే... ‘‘అస్సలు వద్దు. చీకటి రోజురోజుకూ పెరిగిపోతూ ఉండే బహుళ పక్షంలో పెట్టండి. శుక్లపక్షం వెన్నెలను మీ ఆనందం కోసం మీరే ఉంచుకోండి’’ అన్నాడు. ‘‘ఆ బహుళ పక్షంలోని మొదటి అయిదురోజులూ వెన్నెల ఉంటుందిగా! అప్పుడు పెడదాం పెళ్ళి’’ అంటే ‘‘కన్ను పొడుచుకున్నా కనిపించని చిమ్మ చీకటిగా ఉండే... అమావాస్యకు రెండు రోజుల వెనుక త్రయోదశిని కేటాయించండి’’ అన్నాడు. లోకంలో కూడా ఏవైనా పండ్లు కొన్నట్టయితే... వాటిలో కొద్దిగా డాగులు పడినవి, కాస్త మెత్తబడినవి... ఇలా సరిగ్గా లేనివాటిని తల్లిదండ్రులు తీసుకుంటారు. చక్కగా ఉన్నవే సంతానానికి ఇస్తారు. అలాంటి తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులు.
‘‘మంచిదేనయ్యా! పెళ్ళికి చంపకం, పున్నాగ, మల్లిక, సురపొన్న లాంటి పరిమళాలు వెదజల్లే పుష్పాలను తేస్తాన’’ని అంటే... ‘‘వద్దు... ఆకర్షణ లేనివి, పరిమాణంలో చిన్నవి, సువాసన లేనివి అయిన తమ్మిపూలను పట్రండి’’ అన్నాడు శివుడు. ‘‘మరి చందనాల్లో పసుపు పచ్చని గంధచందనం (హరిద్రా), తెల్ల చందనం, రక్త చందనం... వీటిలో ఏవి తెమ్మంటావు? మూడింటినీ కలిసి వాడుదామా పెళ్ళిలో?’’ అంటే ‘‘అవన్నీ మీరే అనుభవించండి. చక్కని మెత్తని భస్మాన్ని పట్రండి’’ అన్నాడాయన. ‘‘వాద్యాలుగా 18 తీరులవి సిద్దం చేయిస్తున్నాం. వాద్యకారులు కూడా సిద్ధం. ఏవి ఏర్పాటు చేద్దాం పెళ్ళికి?’’ అని అడిగితే ‘‘నా చేతిలో డమరుకం ఉంది కదా! దాన్ని మోగించడానికి అభ్యాసం అక్కర్తేదు. ఎవరి చేతికి ఇచ్చినా క్షణంలో మోగించగలరు. పదిమందికి పది డమరుకాలిస్తే... ఆ వాద్య ధ్వని ఎంత ఘనంగా ఉంటుందో!’’’ అన్నాడు భోళాశంకరుడు.
‘‘స్వామీ! అన్నీ ఏవేవో తీరు కోరికలు చెబుతున్నారు. మరి ఈ ఏర్పాట్లను అమ్మ ఒప్పుకుంటుందా? పెళ్ళి ప్రారంభంలోనే ముఖం నిండుగా కోపంతో మమ్మల్ని ‘‘ఏమిటిది?’’ అని అడిగితే ఇదంతా నీ ఆలోచనేనని చెప్పడం మాకు తగదు కదా! ముహూర్తాన్నీ, ఏర్పాట్లనూ కాస్త మార్చవచ్చు కదా?’’ అంటే... ఆయన మరింత పెద్దగా నవ్వి ‘‘పిల్లలారా! ఆమె నాకు ఏనాటి నుంచో అర్థాంగి. పెళ్ళి జరిగేది ఈ రోజున కాదు. ఏనాడో జరిగింది. మాది ఒకరికోసం ఒకరు తపస్సు చేసుకోగా ఏర్పడిన వివాహం, అనుబంధం, దాంపత్యం. ఇదంతా ఆమెకు ఇష్టమై, నాకు నచ్చి చేసుకున్న, చేసుకుంటున్న వివాహమూ, ఏర్పాట్లూ. ఇద్దరి భావాల ఐక్యతే ప్రధానం తప్ప... ఎవరి ఇష్టాల ప్రకారం వాళ్ళు ఏర్పాటు చేసుకొని, ఆ కలబోతని వివాహం అనుకోకూడదు. ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మా వివాహాన్ని మహాశివరాత్రి తెల్లవారుజామున పెట్టండి. మీరు నిద్రకి ఆగలేక, రా(లే)కపోతే ‘ఆ ముహూర్తాన్ని పెట్టిన మాదే తప్పు’ అని సమర్థించుకుంటాం’’ అన్నాడు శివుడు. అమ్మ ముసిముసిగా నవ్వుతూ ఆయనను చూస్తోంది. అదీ దాంపత్యమంటే!
డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు