Share News

ప్రయాణాన్ని నిర్దేశించేది గమ్యమే

ABN , Publish Date - Jul 31 , 2026 | 01:21 AM

‘జీవితం ఒక ప్రయాణం’ అని చాలామంది తరచుగా అంటూ ఉంటారు. కానీ ‘అంతిమంగా ఎక్కడికి వెళుతున్నాం?’ అని ప్రశ్నించుకోవడానికి మనం చాలా అరుదుగా విరామం తీసుకుంటాం. వయసుతో...

ప్రయాణాన్ని నిర్దేశించేది గమ్యమే

యోగా

‘జీవితం ఒక ప్రయాణం’ అని చాలామంది తరచుగా అంటూ ఉంటారు. కానీ ‘అంతిమంగా ఎక్కడికి వెళుతున్నాం?’ అని ప్రశ్నించుకోవడానికి మనం చాలా అరుదుగా విరామం తీసుకుంటాం. వయసుతో పాటు లక్ష్యాలు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి. చిన్న వయసులో మనం అందరి ఆమోదాన్ని, ఆటపాటలను కోరుకుంటాం. కౌమారదశలో... విద్యా సంబంధమైన విజయం, గుర్తింపు మన ప్రాధాన్యతలు అవుతాయి. యువకులు మంచి కెరీర్‌ను, ఆర్థిక భద్రతను, సొంత అస్తిత్వాన్ని కోరుకుంటారు. ఆ తరువాత... పలుకుబడిని, స్థిరత్వాన్ని, వారసత్వాన్ని ఆశిస్తాం. ఈ విధంగా జీవితంలోని ప్రతి దశ ఒక కొత్త గమ్యాన్ని నిర్దేశిస్తుంది. మన ప్రాధాన్యతలు, ఎంపికలు ఆ మారుతున్న ఆకాంక్షలను సహజంగానే అనుసరిస్తాయి. ఇటువంటి పరిణామం మానవ జీవితంలో ఒక సాధారణమైన భాగం. అయినప్పటికీ... నిరంతరం మారుతున్న లక్ష్యాలు అంతర్గతంగా అశాంతిని, గందరగోళాన్ని, ‘తరువాత ఏమిటి?’ అనే అంతులేని అన్వేషణను కూడా సృష్టించగలవు. గాఢమైనది, మార్పులేనిది అయిన లక్ష్యానికి బదులుగా... మన నిర్ణయాల్ని శాశ్వత విలువలకన్నా పరిస్థితులే తరచుగా నిర్దేశిస్తాయి.

దృక్కోణం మారింది...

ఎంబిబిఎస్‌ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు ‘హార్ట్‌ఫుల్‌నె్‌స’లో చేరే అదృష్టం నాకు కలిగింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే... అది నా జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన అంశాల్లో ఒకటిగా నేను గ్రహించాను. దానికి కారణం... అది నా భౌతికమైన ఆశయాలను రాత్రికి రాత్రి మార్చినందుకు కాదు, నేను వాటిని చూసే దృక్కోణాన్ని నిశ్శబ్దంగా మార్చింది కాబట్టి. ‘జీవితానికి అంతిమ లక్ష్యం... అంతర్గతంగా పరిణామం చెందడం, చైతన్యాన్ని శుద్ధి చేసుకోవడం’ అనే ఆలోచనను అది నాకు పరిచయం చేసింది. వృత్తిపరమైన విజయం, విద్యాపరమైన నైపుణ్యం, ఆర్థికపరమైన శ్రేయస్సు, సామాజికమైన సంబంధాలు... ఇవన్నీ నాకు ప్రధానమైనవిగానే ఉన్నాయి. కానీ... అవి అంతిమ గమ్యంగా కాకుండా మైలు రాళ్ళుగా మారాయి. నేను తీసుకున్న ప్రతి ప్రధాన నిర్ణయాన్ని ఈ దృక్పథం సూక్ష్మ స్థాయిలో ప్రభావితం చేసింది. పోలిక కన్నా ఎదుగుదలను, స్వీయ ప్రచారం కన్నా సేవను, గాఢమైన వాంఛలకు బానిస కాకుండా శ్రేష్టతను ఎంచుకొనేలా నన్ను ప్రోత్సహించింది. వైద్య విద్యార్థిగా, ఆ తరువాత ఇటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టుగా, ఇప్పుడు ఉపాధ్యాయుడిగా, మెంటార్‌గా... విజయాలను కృతజ్ఞతతో, వైఫల్యాలను సమదృష్టితో ఎదుర్కొవడానికి ఈ ఆధ్యాత్మికమైన ఆలంబన నాకు సాయపడింది. ఇది నా ఆశయాలను తగ్గించలేదు... ఆ ఆశయాలు ఒక ఉన్నతమైన ప్రయోజనానికి అనుగుణంగా ఉండడానికి దోహదపడింది.


ప్రతి దశకు గొప్ప అర్థం

మనకు స్పష్టమైన ఒక ఆధ్యాత్మిక లక్ష్యం ఉన్నప్పుడు జీవితంలోని ప్రతి దశకు గొప్ప అర్థం చేకూరుతుంది. అప్పుడు... మారుతున్న మన లక్ష్యాలు ఒకదానితో ఒకటి పోటీపడవు. బదులుగా... అవి ఒకే గమ్యం వైపు సామరస్యపూర్వకమైన అడుగులుగా మారుతాయి. విద్య మన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకొనే సాధనంగా, వృత్తి సేవ చేసే అవకాశంగా, కుటుంబం ప్రేమను, బాధ్యతను పెంపొందించే ప్రదేశంగా మారుతాయి. అలాగే విజయాలు అహంకార ప్రదర్శనకు బదులు కృతజ్ఞతను వ్యక్తపరిచే సందర్భాలుగా మారుతాయి. మనం ఎంచుకొనే మార్గాన్ని, ప్రయాణించే వేగాన్ని, దారిలో ఎదురయ్యే అవరోధాలకు మనం ప్రతిస్పందించే తీరును నిర్ధారించేది... అంతిమ గమ్యమే. లక్ష్యాలు నిరంతరం మారుతూ ఉండే ఈ ప్రపంచంలో... మార్పుల మధ్య ఒక స్పష్టతను స్థిరమైన ఆధ్యాత్మిక లక్ష్యం మనకు ఇస్తుంది. అంతర్గతంగా మనల్ని సమతుల్యతతో ఉంచుతూనే... జీవిత లక్ష్యాల సాధనలో పూర్తిగా నిమగ్నమయ్యేలా చేస్తుంది. విజయానికి కొలమానం ఎంత కూడబెట్టామనేది మాత్రమే కాదనీ... ఎలా పరిణామం చెందామనేది కూడాననీ మనకు గుర్తు చేస్తుంది.

డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌

ట్రైనర్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌, 9440087532

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 01:21 AM