కమనీయం... అంజన్న నిజరూపం
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:08 AM
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి భక్తులకు అభయప్రదాత. ఇష్టకామ్యాలను తీర్చే కొంగుబంగారం. నిత్యం చందనంతో అలంకృతుడై కనిపించే స్వామి...
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి భక్తులకు అభయప్రదాత. ఇష్టకామ్యాలను తీర్చే కొంగుబంగారం. నిత్యం చందనంతో అలంకృతుడై కనిపించే స్వామి... ఆరు దశాబ్దాల తరువాత... దివ్యమంగళమైన నిజరూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు.
కొండలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతం మధ్య కొలువైన జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం... అరుదైన ఆధ్యాత్మిక ఘట్టమైన ‘చందనోత్సవా’నికి సిద్ధమవుతోంది. మూలవిరాట్టుపై పేరుకుపోయిన చందన కవచాన్ని తొలగించి, స్వామివారి సహజ శిలారూపాన్ని భక్తులకు దర్శింపజేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంతకీ ఏమిటీ చందనోత్సవం? దాని విశిష్టత ఏమిటి?
చందనోత్సవం, మహాసంప్రోక్షణ
కొండగట్టు అంజన్న ఆరాధనలో చందనానికి విశిష్ట స్థానం ఉంది. స్వామివారికి చందనం సమర్పించడం భక్తుల విశ్వాసంలో ముఖ్యమైన ఆచారంగా కొనసాగుతోంది. మూలవిరాట్టుకు అలంకరిస్తున్న చందనం ఎన్నో ఏళ్ళుగా పేరుకుపోతూ కవచంలా ఏర్పడుతూ ఉంటుంది. అరవయ్యేళ్ళ క్రితం ఆ కవచాన్ని తొలగించారు. కాగా... స్వామివారి సహజ రూపం భక్తులకు పూర్తిగా కనిపించని పరిస్థితి నెలకొనడంతో... చందన కవచాన్ని తొలగించాలని పదేళ్ళుగా భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో... చందనోత్సవం జరపాలని అర్చకులు అధికారులు నిర్ణయించారు. చందనోత్సవానికి ముందుగా అర్చకులు దీక్షలు స్వీకరించి ప్రత్యేక పూజలు, యజ్ఞాలు, హోమాలు నిర్వహించనున్నారు.
ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకూ జరిగే మహా సంప్రోక్షణ సందర్భంగా మూలవిరాట్ దర్శనాన్ని నిలిపివేస్తారు. ఆ రోజుల్లో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసే దారు ఆంజనేయ ఉత్సవమూర్తి, శ్రీ వేంకటేశ్వరస్వామి, మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవచ్చు. చందనాన్ని తొలగించాక ఈ నెల 21వ తేదీ నుంచి 41 రోజుల పాటు అంజన్న నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. ఆ తరువాత మళ్ళీ చందన సమర్పణ ఉంటుంది. చందనం పూత లేకుండా స్వామివారి సహజ శిలారూపాన్ని దర్శించుకునే అవకాశం ఆరు దశాబ్దాల తర్వాత రావడంతో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.
అటు ఆంజనేయుడు, ఇటు నారసింహుడు
కొండగట్టు క్షేత్రం ఆవిర్భావం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం... రామ రావణ యుద్ధం సమయంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు... హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. హనుమ సంజీవనితో తిరిగివస్తూండగా... ఆ పర్వతంలో కొంతభాగం ఇక్కడ పడింది. అందుకే ఈ ప్రాంతానికి ‘కొండగట్టు’ అనే పేరు వచ్చింది. మరో కథ ప్రకారం... నాలుగైదు శతాబ్దాల క్రితం కొడిమ్యాల ప్రాంతానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి ఈ గుట్ట ప్రాంతంలో పశువులను మేపేవాడు. ఒక రోజు మందలోని ఆవు తప్పిపోవడంతో దాన్ని వెతుకుతూ తిరిగి అలసిపోయాడు. ఒక చెట్టు కింద నిద్రపోయాడు. అతనికి ఆంజనేయస్వామి కలలో ప్రత్యక్షమై... దగ్గరలోని ముళ్ళ పొదల్లో తాను వెలసి ఉన్నానని, ఎండా వానల నుంచి రక్షణ తనకు కల్పించాలని సూచించారు. నిద్రనుంచి. మేల్కొన్న సంజీవుడు... పొదలను తొలగించగా స్వామివారి మూర్తి కనిపించింది. అనంతరం అక్కడ చిన్న ఆలయ నిర్మాణం జరిగింది. కాలక్రమేణా అది సుప్రసిద్ధమైన నేటి కొండగట్టు క్షేత్రంగా విస్తరించింది. కొండగట్టు అంజన్న క్షేత్రానికి మరో ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఆంజనేయస్వామి ఏక ముఖంతో గాని, పంచ ముఖంతో గాని దర్శనమిస్తుంటారు. కానీ ఇక్కడి మూలవిరాట్టు ద్విముఖ స్వరూపంగా... ఒకవైపు ఆంజనేయ స్వామి రూపం, మరొకవైపు నరసింహ స్వరూపం కనిపించడం ఈ క్షేత్రం విశిష్టత. అంజన్న దీక్షను 11, 21, 41 రోజుల పాటు ఆచరించే సంప్రదాయం కూడా ఈ క్షేత్రంలో ఉంది.
ముక్క వేణుగోపాల్, జగిత్యాల.
అపూర్వ ఘట్టం
ఆరు దశాబ్దాల తరువాత జరగబోయే చందనోత్సవం... సాఽధారణమైన ఉత్సవం కాదు. ఈ క్షేత్ర సంప్రదాయానికి సంబంధించిన అపూర్వ ఘట్టం. అయితే... ఇది అరవయ్యేళ్ళకే జరపాలనే ఆచారం కానీ, నియమం కానీ లేవు. మూలవిరాట్టు మీద పేరుకుపోయిన చందనం పరిమాణాన్ని బట్టి నిర్వహించడం ఆనవాయితీ. పదేళ్ళ నుంచి చేస్తున్న విజ్ఞప్తులు ఫలించి... ఇప్పుడు ఈ ఉత్సవం జరగనుండడం సంతోషదాయకం. చిన్నతనంలో అంజన్న నిజరూపాన్ని చూసిన తరం... ఇప్పుడు జీవితం మలిదశలో మరోసారి ఆ దివ్య రూపాన్ని దర్శించే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. స్వామివారి సహజ శిలారూపాన్ని తిలకించాలని ఈ తరం భక్తులు కూడా ఆత్రుతగా ఉన్నారు.
చిరంజీవి
కొండగట్టు దేవస్థానం ప్రధాన అర్చకుడు
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..