Share News

అమ్మతనం అన్నీ నేర్పింది

ABN , Publish Date - Nov 15 , 2026 | 02:55 AM

‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన కియారా అద్వానీ బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది....

అమ్మతనం అన్నీ నేర్పింది

సండే సెలబ్రిటీ

‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన కియారా అద్వానీ బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది. తొలి సినిమా పరాజయం నేర్పిన పాఠాల నుంచి సిద్ధార్థ్‌తో ప్రేమకథ వరకు... మాతృత్వపు మధురానుభూతుల నుంచి కెరీర్‌ కొత్త మైలురాళ్ల వరకు... ఆమె ప్రయాణంలో ఎన్నో మలుపులు... ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...

చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగిన వాతావరణమే నన్నిక్కడకు చేర్చింది. నా మొదటి సినిమా ‘ఫగ్లీ’ విడుదలైన శుక్రవారం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అప్పుడే ఇండస్ట్రీ అసలు స్వరూపం అర్థమైంది. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు, ప్రతీ శుక్రవారం తలరాత మారుతుందని తెలుసుకున్నాను. మొదటి సినిమా ఫెయిల్‌ అయ్యాక మరో అవకాశం వస్తుందా? అన్న భయం వేసింది. కానీ, నటనపై ఉన్న ఇష్టమే నన్ను నిలబెట్టింది. గతంలో ఏ ఆడిషన్లలో అయితే తిరస్కరించారో, ఆ తర్వాత అవే సంస్థలు నాకు అవకాశాలు ఇచ్చాయి.

సినిమాను తలపించే ప్రేమ

బయటి నుంచి చూసేవారికి మా ప్రేమకథ ఒక సినిమా లాగే కనిపిస్తుంది. కానీ, ప్రతి జంటకు ఎదురయ్యే సవాళ్లు మాకూ ఎదురయ్యాయి. ‘లస్ట్‌ స్టోరీస్‌’ షూటింగ్‌ పూర్తయ్యాక మా స్నేహితుడు అమృత్‌పాల్‌ బింద్రా ఇచ్చిన పార్టీలో సిద్ధార్థ్‌ను మొదటిసారి కలిశాను. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత ‘షేర్షా’ సినిమా మా ఇద్దరినీ మరింత దగ్గర చేసింది. అందులోని విక్రమ్‌ బాత్రా, డింపుల్‌ చీమా పాత్రలు మా భావోద్వేగాలతో కలిసిపోయాయి.

విడిపోవాలనే ఆలోచన

ఒకానొక సమయంలో సిద్ధార్థ్‌ కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకున్నాడు. నాకేమో మా బంధం భవిష్యత్తు ఏంటో తెలియక అయోమయంగా ఉండేది. స్పష్టత కోసం ఆలోచించినప్పుడు, విడిపోవడమే మంచిదేమో అన్న చర్చ కూడా జరిగింది. కానీ, ‘షేర్షా’ షూటింగ్‌ కోసం సిద్ధార్థ్‌ కార్గిల్‌ వెళ్లినప్పుడు పరిస్థితి మారింది. అక్కడ ఫోన్‌ సిగ్నల్స్‌ సరిగ్గా లేకపోయినా, వరుసగా ముప్పై రోజులపాటు నాకు రోజూ ఫోన్‌ చేసి విశేషాలు చెప్పేవాడు. ఆ సంభాషణలే మా మధ్య దూరాన్ని చెరిపేశాయి. ఆ తర్వాత కూడా చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. నేను ‘జగ్‌ జగ్‌ జీయో’ సినిమాలోని ‘రంగిసరి’ పాట షూటింగ్‌లో ఉన్నప్పుడు సిద్ధార్థ్‌ పువ్వులు తీసుకుని నన్ను కలవడానికి వచ్చాడు. వ్యానిటీ వ్యాన్‌లో మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకున్నాం. ఆ కలయిక మా బంధానికి కొత్త మలుపు ఇచ్చింది. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక 2023 ఫిబ్రవరిలో జైసల్మేర్‌లో పెళ్లి చేసుకున్నాం.


తెలుగు తెరపై నా ప్రయాణం

హిందీ సినిమాలతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేయడం మరపురాని అనుభవం. మహేశ్‌బాబు సరసన ‘భరత్‌ అనే నేను’, అలాగే రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాలలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాను. భాషలు, సంస్కృతి వేరైనా సినిమా చూసే ప్రేక్షకుడి భావోద్వేగాలు ఒక్కటేనని తెలుగు పరిశ్రమ నేర్పింది. కథలో నిజాయితీ ఉంటే ఏ భాషలోనైనా ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుసుకున్నాను.

వైవిధ్యమైన పాత్రలే నా బలం

నటిగా ఒకే రకమైన పాత్రలకు పరిమితం కావడం నాకు ఇష్టం లేదు. మహిళలను ఒక బాక్స్‌లో బంధించకూడదు. ‘లస్ట్‌ స్టోరీ్‌స’లోని మేఘా, ‘షేర్షా’లోని డింపుల్‌, ‘సత్యప్రేమ్‌ కీ కథ’లోని కథ.. ప్రతీ పాత్ర నా వ్యక్తిత్వంలో కొంత భాగాన్ని మిగిల్చింది. మేఘా పాత్ర నన్ను ధైర్యశాలిగా మార్చితే, డింపుల్‌ నిశ్చలమైన ప్రేమను నేర్పింది. కథ పాత్ర నాలో భావోద్వేగ మార్పులు తెచ్చింది.

‘టాక్సిక్‌’లో నదియా పాత్ర

‘టాక్సిక్‌’ సినిమా నా కెరీర్‌లో ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చింది. ఇందులో నేను పోషించిన ‘నదియా’ పాత్ర ఎంతో వైవిధ్యమైనది. దర్శకురాలు గీతూ మోహన్‌దా్‌స ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం నన్ను ఆకట్టుకుంది. యాక్టింగ్‌ కోచ్‌ అతుల్‌ మొంగియాతో చేసిన వర్క్‌షాప్స్‌ పాత్ర లోతుల్లోకి వెళ్లేందుకు సాయపడ్డాయి. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌ వంటి వారితో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం.

మొదటి మూడు నెలల కష్టాలు

పెళ్లి తర్వాత నా జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం మాతృత్వం. అయితే, గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు నాకు చాలా కష్టంగా గడిచాయి. హార్మోన్ల మార్పులు, వికారం వల్ల ఇబ్బంది పడ్డాను. మొదట ఈ శుభవార్తను ఎవరికీ చెప్పకూడదని నేను, సిద్ధార్థ్‌ అనుకున్నాం. కానీ, ఆ మార్పులను ఒంటరిగా ఎదుర్కొవడం నా వల్ల కాలేదు.

తోటి మహిళల ఓదార్పు

ఒకరోజు సిద్ధార్థ్‌తో ‘నేను మా అమ్మతో, అత్తయ్యతో మాట్లాడాలి. నా పరిస్థితిని అర్థం చేసుకునే మహిళలు నా చుట్టూ ఉండాలి’ అని చెప్పాను. ఆ సమయంలో తోటి మహిళల ఓదార్పు నాకు అవసరమైంది. కొన్నిసార్లు స్నేహితుల దగ్గర కూర్చుని ఏడ్చేదాన్ని. వాళ్లు నన్ను ఏమీ ప్రశ్నించకుండా ఓదార్చేవారు. మహిళలు ఒకరికొకరు తోడుగా నిలిస్తే ప్రతీ కష్టాన్ని సులభంగా ఎదుర్కొవచ్చని అప్పుడే తెలిసింది.


‘మామ్‌ గిల్ట్‌’ నుంచి...

మా మొదటి పాప సరాయా పుట్టిన తర్వాత, తిరిగి షూటింగ్‌లకు వెళ్లడం సవాలుగా మారింది. సెట్‌లో ఉన్నప్పుడు పాపను వదిలి వచ్చాననే బాధ, ఇంట్లో ఉన్నప్పుడు పనికి దూరమవుతున్నానే ఆలోచన.. ఇలా ప్రతి వర్కింగ్‌ మదర్‌ ఎదుర్కొనే ‘మామ్‌ గిల్ట్‌’ నన్నూ వెంటాడింది. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ ఇది అందరూ ఎదుర్కొనే సహజమైన అనుభూతి అని అర్థమైంది.

స్నేహితుల మద్దతు

అలాంటి సమయాల్లో తోటి నటీమణులతో మాట్లాడటం నాకు ఎంతో ఊరటనిచ్చింది. అలియా భట్‌, కత్రినా కైఫ్‌ వంటి వాళ్లతో నా అనుభవాలను పంచుకునేదాన్ని. పిల్లల పెంపకం, కెరీర్‌ బ్యాలెన్స్‌ గురించి మాట్లాడుకుంటాం. ‘నువ్వు ఒక్కదానివే కాదు, మేము కూడా ఇదే దశను దాటి వచ్చాం’ అని వాళ్లు చెప్పినప్పుడు మనసు తేలికపడేది.

రెండోసారి తల్లి కాబోతున్న ఆనందం

ఇప్పుడు మేము రెండో బిడ్డకు స్వాగతం పలకబోతున్నాం. అక్టోబర్‌ 7న మా కూతురు సరాయా చేతిలో బేబీ సాక్స్‌ ఉన్న ఫొటోను పంచుకున్నప్పుడు మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో మెట్‌ గాలా వేడుకకు వెళ్లాను, ఇప్పుడు రెండోసారి బేబీ బంప్‌తో ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోకు రావడం మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

ట్రోలింగ్‌ను లైట్‌ తీసుకునే తత్వం

ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం. ఇటీవల నా సినిమాల ఫలితాల విషయంలోనూ, సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ విషయంలోనూ చర్చ జరిగింది. నేను నెగెటివ్‌ ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోను. సినిమాల ఎంపిక నా వ్యక్తిగత ఇష్టం. విమర్శించే వాళ్లకంటే నన్ను అభిమానించే వాళ్లే సోషల్‌ మీడియాలో నా తరఫున సమాధానం చెబుతున్నారు.

నా కలల వారసత్వం

కెరీర్‌ ఆరంభంలో సినిమాలే ప్రపంచం అనుకునేదాన్ని. ఇప్పుడు నా ఆలోచనల్లో పరిణతి వచ్చింది. డబ్బు, పేరు కంటే మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛే అసలైన ‘పవర్‌’ అని నమ్ముతాను. ఫ్యాషన్‌ విషయంలోనూ ఎప్పుడూ సౌకర్యంగా, సింపుల్‌గా ఉండటానికే ఇష్టపడతాను. మరో ఇరవై ఏళ్ల తర్వాత నా జీవితంపై సినిమా తీస్తే.. తన వృత్తిని గౌరవించిన నటిగా, జీవితంలోని ప్రతి దశలోనూ నిజాయితీగా ఉన్న మనిషిగా నన్ను గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 15 , 2026 | 02:55 AM