దీపాల పున్నమి
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:39 AM
కార్తిక మాసంలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. ఈ మాసం శివుడికి, విష్ణువుకు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం. ఆలయాల్లో, గృహాల్లో...
విశేషం
24న కార్తిక పౌర్ణమి
కార్తిక మాసంలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. ఈ మాసం శివుడికి, విష్ణువుకు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం. ఆలయాల్లో, గృహాల్లో దీపారాధన, అభిషేకాలు అత్యంత పుణ్యప్రదం. ముఖ్యంగా... కార్తిక పౌర్ణమికి ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత ఉంది.
ప్రతి మాసంలో పౌర్ణమి ఏ నక్షత్రంలో వస్తుందో... ఆ నక్షత్రం పేరిట ఆ మాసం పేరును పూర్వులు నిర్ణయించారు. తదనుగుణంగా కృత్తికా నక్షత్రం నాడు పున్నమి వచ్చే మాసం... కార్తిక మాసం. ఇంకో విశేషం ఏమిటంటే... మనకు పన్నెండు మాసాలు ఉన్నప్పటికీ... మిగిలిన మాసాలలో వెలిగించే దీపాలకు ఆ మాసం పేరు లేదు. ఒక్క కార్తిక మాసంలో వెలిగించే దీపాన్ని మాత్రమే ‘కార్తిక దీపం’ అని అంటారు. కార్తిక మాసంలో దీపం వెలిగించడం అనంతమైన పుణ్యాన్నిస్తుందని పెద్దలు చెప్పారు. కృత్తికా నక్షత్రం అగ్నిదేవుడికి ప్రతీక. కార్తిక మాసం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. సూర్యతేజం మందగించి, చలి పెరుగుతుంది. వాతావరణంలో వేడి పెరగడానికి మంటలు వేస్తూ ఉంటారు. ఈ సమయంలో... దీపం రూపంలో అగ్నిని ఆరాధించాలని పురాణాలు చెబుతున్నాయి. దీపం అంటే ప్రకాశం. దీపమే పరమేశ్వర స్వరూపం. దీపం జ్ఞానానికి చిహ్నం. మనలో అజ్ఞానం, అవిద్య అనే చీకటులను తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుతూ దీపారాధన చేయాలి. కార్తిక మాసంలోనే కాదు... ప్రతిరోజూ ఉభయ సంధ్యల్లో దీపారాధన చేయాలని శాస్త్రం నిర్దేశించింది.
దోషానికి ప్రాయశ్చిత్తం
ఆశ్వయుజ మాసం చివర్లో... అంటే దీపావళి అమావాస్య రోజున మొదలుపెట్టి... కార్తిక మాసం అంతటా దీపాలను వెలిగించాలి. వాటిలో కార్తిక పౌర్ణమి రోజున దీపాలను వెలిగించడం అత్యంత శుభప్రదం. మన ఇంట్లో నిత్యం దీపం వెలుగుతూ ఉండాలి. అలా చేయకపోతో ఇంట్లో నివసించేవారికి దోషం కలుగుతుంది. అందరికీ అన్ని రోజులూ అది వీలు కాకపోవచ్చు. లేదా కొన్నిసార్లు పొరపాట్లు జరగవచ్చు. ఆ దోషాలకు ప్రాయశ్చిత్తంగా కార్తిక పౌర్ణమినాడు 365 వత్తులున్న గుత్తి దీపాన్ని ఆవు నేతిలో ముంచి వెలిగిస్తూ ఉంటారు అలాగే... కార్తిక పౌర్ణమి నాడు చేసే స్నాన, జప, ధ్యానాదులు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఆ రోజున వెలిగిస్తూ... మన పాపాలను ప్రక్షాళన చేయాలని, లోకమంతా సుభిక్షంగా, సంతోషంగా, శాంతిలో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించాలి. .
జ్వాలాతోరణం, దేవ దీపావళి
కార్తిక పౌర్ణమి నాడు శివాలయాల్లో జ్వాలాతోరణం ఉత్సవం జరుగుతుంది. శివుడు క్షీర సాగర మధన సమయంలో ఉద్భవించిన హాలహలాన్ని మింగినప్పుడు... పార్వతి తన భర్తకు ఎలాంటి ఆపద కలుగకూడదని కోరుకుంటూ, జ్వాలాతోరణం కింద నుండి భర్తతో తిరుగుతానని మొక్కుకొని, దాన్ని తీర్చుకున్నదనే కథ ఉంది. కాగా... త్రిపురాసుర సంహారానంతరం విజయుడై వచ్చిన శివుడికి ‘జ్వాలాతోరణం’తో పార్వతి స్వాగతం చెప్పిందనేది మరొక కథ. ‘దేవ దీపావళి’గా కాశీ క్షేత్రంలో ఈ రోజును ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడులోని అరుణాచలంలో ‘ కార్తిక దీపోత్సవం’ అత్యంత వైభవంగా జరుగుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టివేత.. రూ.710 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం..
నైలాన్ తాడుతో చిన్నారి చేతులు కట్టేసి కొట్టిన టీచర్.. తమిళనాడు స్కూల్లో ఘటన