కర్మలే కారణం
ABN , Publish Date - May 01 , 2026 | 05:14 AM
సుభ ఒక సత్యాన్వేషి. మానవ సమాజంలోని అసమానతలను చూసి అతను ఎంతో కలత చెందాడు. సమీప ప్రాంతానికి గౌతమ బుద్ధుడు వచ్చాడని అతనికి తెలిసింది. వెంటనే ఆయన దగ్గరకు...
సద్బోధ
సుభ ఒక సత్యాన్వేషి. మానవ సమాజంలోని అసమానతలను చూసి అతను ఎంతో కలత చెందాడు. సమీప ప్రాంతానికి గౌతమ బుద్ధుడు వచ్చాడని అతనికి తెలిసింది. వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళాడు. చేతులు జోడించి ‘‘భగవాన్! ఈ లోకంలో కొందరు అల్పాయుష్కులు, మరికొందరు దీర్ఘకాలం జీవిస్తారు. కొందరు నిరంతర రోగులు, కొందరేమో ఆరోగ్యవంతులు. కొందరు అందంగా ఉంటారు, మరికొందరు వికారంగా కనిపిస్తారు. కొందరు శక్తిమంతులు మరికొందరు బలహీనులు. కొందరు ధనవంతులు ఇంకొందరు నిత్య దరిద్రులు. ఈ తేడాలన్నీ ఎందుకు ఉన్నాయి? వారు అలా ఉండడానికి కారణం ఏమిటి?’’ అని ప్రశ్నించాడు.
‘‘దానికి కారణం వారివారి కర్మలే’’ అని బుద్ధభగవానుడు బదులిస్తూ... ‘‘ప్రాణాన్ని తీసి తన చేతులను రక్తసిక్తం చేసుకున్న వేటగాడు అల్పాయుష్కుడు. సర్వ ప్రాణుల పట్ల దయతో, కరుణతో ఉండేవాడు దీర్ఘాయువు పొందుతాడు. పిడికిలి, రాయి, బడితె లాంటి ఆయుధాలతో ఇతరులను హింసించినవాడు అనేక వ్యాధులు కలిగిన రోగి అవుతాడు. ఇతరులకు చేతనైన సేవ చేసినవాడు ఆరోగ్యవంతుడు అవుతాడు. కలహకారి, కోపిష్టి, చిరాకు పడేవాడు వికారుడవుతాడు. ఎవరు ఏమన్నా కోపించనివాడు, ద్వేషం లేనివాడు అందగాడిగా జన్మిస్తాడు. ఇతరుల పట్ల ఈర్ష్య, అసూయలు ఉన్నవాడు శక్తిహీనుడు, శాంతి సహనాలు కలిగినవాడు శక్తిమంతుడు అవుతాడు. లోభ బుద్ధితో ఉండి, దానధర్మాలు చేయకుండా జీవించినవాడు దరిద్రుడు అవుతాడు. దాతృత్వ బుద్ధి కలిగి, ఉదారంగా దానధర్మాలు చేసినవాడు మరు జన్మలో ధనవంతుడు అవుతాడు. గర్వంతో, అహంకారంతో ఇతరులను గౌరవించకుండా హీనంగా చూసేవాడు మరుజన్మలో హీనుడుగా పుడతాడు. ఇతరులపట్ల వినయవిధేయతలతో మెలిగేవాడు ఉత్తమ జన్ముడు అవుతాడు. పండితులను, గుణవంతులను గౌరవించనివాడు, మంచి చెడులను, నిత్యానిత్యాలను, సత్యాలను తెలుసుకోవాలనే ఆలోచన లేనివాడు అవిద్యావంతుడు అవుతాడు. పండితులను గౌరవించి, ప్రశ్నించి, అన్వేషించేవాడు విజ్ఞానవంతుడు అవుతాడు’’ అని వివరించాడు.
‘‘అంతేకాదు... ప్రతి ప్రాణికి దేని కర్మ దానికి ఉంటుంది. దేని సహజాత కారణం దానికి ఉంటుంది. దేని రక్త బంధువులు దానికి ఉంటారు, దేని ఆశ్రయం దానికి ఉంటుంది’’ అని ముగించాడు బుద్ధుడు.‘‘పావన చరితా! బుద్ధ ప్రపూర్ణా! ధన్యోస్మి’’ అంటూ సుభ వెనుతిరిగాడు.
సనాతనధర్మం ప్రతిపాదించిన కర్మ సిద్ధాంతాన్ని ప్రపంచంలోని ప్రతి మతం ఏదో ఒక రూపంలో అంగీకరిస్తుంది. బౌద్ధం ప్రబోధించిన పది పారమార్థిక విలువలు (పారమితలు) సామాన్యుణ్ణి సైతం పరిపూర్ణ జ్ఞానిగా చేస్తాయనడంలో సందేహం లేదు. జ్ఞానాన్వేషణలో బుద్ధుడిగా మారిన గౌతముడే దీనికి ఉదాహరణ.
రాచమడుగు శ్రీనివాసులు
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు