Share News

తొలి అద్భుతం

ABN , Publish Date - Jan 30 , 2026 | 05:30 AM

మానవ రూపంలో జన్మించిన దైవసుతుడైన ఏసు ప్రభువు తనలోని మానవాతీత శక్తిని ప్రకటించిన తొలి సన్నివేశం... ఒక పెళ్ళి విందు. బెత్లెహేములో జన్మించిన ఏసుక్రీస్తు ఆచూకీ తెలియకుండా...

తొలి అద్భుతం

దైవమార్గం

మానవ రూపంలో జన్మించిన దైవసుతుడైన ఏసు ప్రభువు తనలోని మానవాతీత శక్తిని ప్రకటించిన తొలి సన్నివేశం... ఒక పెళ్ళి విందు. బెత్లెహేములో జన్మించిన ఏసుక్రీస్తు ఆచూకీ తెలియకుండా... ఆ పసి శిశువుతో ఈజిప్ట్‌కు వెళ్ళి, అక్కడ కొన్నాళ్ళు తలదాచుకున్నారు ఆయన తల్లిదండ్రులు మరియా, యేసేపు. ఆ తరువాత తమ సొంత ఊరైన నజరేతుకు తిరిగి వచ్చి అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. కొన్నేళ్ళ తరువాత... గలిలియా తీరంలోని వారి ఇంటికి... కానా అనే ఊరుకు చెందిన దూరపు బంధువుల నుంచి ఒక పెళ్ళికి ఆహ్వానం వచ్చింది. అప్పటికి పెద్దవాడైన ఏసును ఆ పెళ్ళికి తనతోపాటు మరియా తీసుకువెళ్ళింది.

పెళ్ళికి వచ్చిన అతిథులకు విందులో భాగంగా ద్రాక్ష రసం ఇచ్చి గౌరవించడం ఆనాటి ఆచారం. అయితే, ఆనాటి విందులో ద్రాక్ష రసం అయిపోయింది. తమకు తగిన మర్యాదలు చేయలేదని అతిథులు భావిస్తే తన పరువు పోతుందనే ఆందోళనలో ఆ ఇంటి యజమాని ఉన్నాడు. వారి దయనీయ స్థితిని మరియా గమనించింది. ఆ విషయం ఏసుకు చెప్పి, ‘‘ఏం చేయాలి?’ అంటూ బాధపడింది. ఆ పేద కుటుంబీకుల దీనావస్థను చూడలేక, తల్లి అభిమతం మేరకు... ఆరు పాత బానలను యేసు రప్పించాడు. వాటిలో నీరు పోయించాడు. ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అది ఎన్నడూ సేవించనంత రుచిగా ఉండడం చూసి... అతిథులు ఆశ్చర్యపోయారు. పెళ్ళి చేస్తున్న దంపతుల ఆనందానికి అవధులు లేవు. వారు యేసుకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.


‘నీరు ద్రాక్షరసంగా ఎలా మారింది?’ అనే ప్రశ్న గలిలియా సముద్రతీరంలో మారుమోగింది. ప్రభువులోని దైవత్వం ప్రజలకు కనిపించింది. అది ఆయన బహిరంగంగా ప్రదర్శించిన తొలి అద్భుతం. ఏసు వెంట ఉండే శిష్యులు ఆయన మహిమను అప్పుడు గుర్తించారు. ఆయనలోని శక్తిని బలంగా నమ్మారు. భూమిమీదకు ఏసు రాక... ప్రజల ఆధ్యాత్మికమైన అవసరాలు తీర్చడానికి. కానీ ఇటువంటి లౌకికమైన అవసరాలు కూడా ఆయన సమయానుసారం తీర్చాడు. తల్లి మాట ప్రకారం... తనలోని దైవత్వాన్ని ప్రదర్శించాడు. అంతేకాదు... పాత బానల్లో కొత్త నీరు నింపి, దాన్ని ద్రాక్ష రసంగా మార్చి... అప్పటివరకూ యూదామతంలో ఉన్న ప్రాచీన సంప్రదాయాలు ‘ఇక చెల్లవు’ అనే సందేశాన్ని ప్రతీకాత్మకంగా ప్రభువు చూపించాడంటారు పండితులు.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌ 9866755024

ఇవి కూడా చదవండి..

సిట్ అధికారులకు లేఖ రాసిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని విజ్ఞప్తి..

కిందపడినా.. వీడియో ఆగకూడదు.. ఈ ఫొటొగ్రాఫర్ పనితనం చూస్తే..

Updated Date - Jan 30 , 2026 | 05:30 AM