Share News

దైవానికి చేరువగా...

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:51 AM

ఏసు క్రీస్తు మార్గాన్ని అనుసరించడం కష్టం. ఆ సంగతి ఆయనే స్వయంగా చెప్పాడు. ‘‘నేనూ నీతో వస్తాను’’ అని ఒక వ్యక్తి అడిగినప్పుడు... ‘‘ఆకాశంలో తిరిగే పక్షులకు గూళ్ళు ఉన్నాయి....

దైవానికి చేరువగా...

దైవమార్గం

ఏసు క్రీస్తు మార్గాన్ని అనుసరించడం కష్టం. ఆ సంగతి ఆయనే స్వయంగా చెప్పాడు. ‘‘నేనూ నీతో వస్తాను’’ అని ఒక వ్యక్తి అడిగినప్పుడు... ‘‘ఆకాశంలో తిరిగే పక్షులకు గూళ్ళు ఉన్నాయి. నక్కలకు బొరియలు ఉన్నాయి. మనుష్య కుమారుడికి (క్రీస్తుకు) తలదాచుకొనే స్థలం లేదు’’ అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఆయన మార్గం అంత సులభం కాదు. కానీ ఆ దైవానికి చేరువ చేసే మార్గం అదే.

తనను పూర్తిగా విశ్వసించిన వారిని ఏసు దగ్గరకు తీసుకున్నాడు. సముద్ర తీరంలో ముగ్గురు జాలరులు చిరిగిపోయిన వలలను చేపల వేట కోసం సిద్ధం చేసుకుంటున్నారు. వారిని చూసిన ఏసు ‘‘మిమ్మల్ని మనుషులను పట్టడానికి పంపిస్తాను, రండి’’ అని పిలిచాడు. చదువు సంధ్యలు లేని ఆ వ్యక్తులు ఏసుపై నమ్మకంతో ఆయనను అనుసరించారు. పన్నులు వసూలు చేసే ఉద్యోగి అయిన మత్తయి... తన ఉద్యోగాన్ని, ఆస్తిపాస్తులను విడిచిపెట్టి, ఏసును వెంబడించాడు. యోహాను తన ప్రవర్తనతో ఏసుకు అత్యంత ఇష్టుడు అయ్యాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆయన శిష్యులయ్యారు. అయితే చివరివరకూ అందరూ ఒకే రీతిలో లేరు. రోమన్‌ సైనికులు వచ్చినప్పుడు... ఏసు ఎవరో తనకు తెలియదని పేతురు మూడుసార్లు అసత్యం చెప్పాడు. ఏసుతో తిరుగుతూ, ఆయన ఔన్నత్యం గురించి తెలిసినా ‘‘ప్రభువు గాయాలు చూస్తే కాని ఆయన మరణించాడని నమ్మలేను’’ అన్నాడు తోమాస్‌. ఏసుతో పాటే ఉంటూ... శత్రువులకు ఆయన ఆచూకీ తెలిపిన శిష్యుడిగా ఇస్కరియోతు యూదా కనిపిస్తాడు. వీరందరూ సమాజంలోని వివిధ రకాల వ్యక్తులకు ప్రతీకలు.

ఏసు మార్గం కఠినమైనదే కానీ... ‘‘నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే వెలుగు’’ అని ప్రభువు పలికిన మాటలను విశ్వసించేవారెవరూ ఆయన మార్గంలో పయనించడానికి వెనుకాడరు. ఆ ప్రయాణంలో కష్టపడేవారికి ఊరట కలిగించేవాడు కూడా ఆయనే. భారాలు మోసి అలసిపోయిన వారందరూ తన దగ్గరకు వస్తే విశ్రాంతి కలుగజేస్తానని ఆయన స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ‘‘ఆయన పయనం ఎటయితే నా గమనం కూడా అటే’’ అనే నిశ్చయంతో ఉండాలి. స్వార్థాన్ని త్యజించాలి. కష్టాలను సహించాలి. అప్పుడు ఏసు మార్గంలో పయనం మనల్ని దైవానికి మరింత చేరువ చేస్తుంది.

ఇవి కూడా చదవండి..

అత్యాచారం కేసు.. తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు..

హోర్ముజ్ తెరవడంపై ఇరాన్-ఒమన్ చర్చలు.. తగ్గిన ముడి చమురు ధరలు

Updated Date - Aug 07 , 2026 | 12:51 AM