Share News

ప్రభువుకూ తప్పని శోధన

ABN , Publish Date - Feb 13 , 2026 | 02:16 AM

ఏసు క్రీస్తు తన చుట్టూ ఉన్న ప్రజలను చైతన్యపరచడం కోసం బోధన ప్రారంభించడానికి ముందు... తగినంత శక్తిని ప్రసాదించాల్సిందిగా దేవుణ్ణి ప్రార్థించాడు. ఐహికమైన భోగాలను విడిచిపెట్టి, ధ్యానం ద్వారా...

ప్రభువుకూ తప్పని శోధన

దైవమార్గం

ఏసు క్రీస్తు తన చుట్టూ ఉన్న ప్రజలను చైతన్యపరచడం కోసం బోధన ప్రారంభించడానికి ముందు... తగినంత శక్తిని ప్రసాదించాల్సిందిగా దేవుణ్ణి ప్రార్థించాడు. ఐహికమైన భోగాలను విడిచిపెట్టి, ధ్యానం ద్వారా దేవుడికి దగ్గరయితే... దేవుడు మన మాటలు తప్పకుండా వింటాడని ఆయన ప్రజలకు చెప్పదలిచాడు. దేవుణ్ణి విశ్వాసంతో ప్రార్థిస్తే తగినంత ఆత్మశక్తిని ప్రసాదిస్తాడని తన కార్యాల ద్వారా నిరూపించాడు. ఒక మంచి పని తలపెట్టినప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు తప్పకుండా కష్టాలు ఎదురవుతాయి. కానీ ఆ సమయంలో ఎంత నిబ్బరంగా ఉండాలో క్రీస్తు ప్రబోధించాడు.

ఒకసారి ఆయన నలభై రోజుల పాటు సంపూర్ణంగా ఉపవాసం ఉంటూ... దేవునితో సంభాషించాడు. క్రీస్తు ఆకలితో నీరసంగా ఉన్న ఆ సమయంలో సాతాను ఆయనను సమీపించాడు. ఆయనను మూడు విధాలుగా పరీక్షించాడు. ‘‘ఈ రాళ్ళన్నిటినీ రొట్టెలుగా మార్చుకొని తినవచ్చు కదా!’’ అని సూచించాడు. ‘‘మనుష్యుడు రొట్టెల వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్లా జీవిస్తాడు’’ అని ఏసు జవాబు ఇచ్చాడు. ‘‘నీలో గనుక దైవ శక్తి ఉంటే... ఈ దేవాలయం పైనుంచి దూకి... దేవుని శక్తిని నిరూపించు’’ అని సాతాను రెచ్చగొట్టాడు. ‘‘మనం దేవుని శక్తికి పరీక్ష పెట్టకూడదు కదా!’’ అని బదులిస్తూ ఏసు ఆ మాటలను తిరస్కరించాడు. ‘‘ఇవిగో! ఈ లోక రాజ్యాలన్నీ నీకు దక్కేటట్టు చేస్తాను. ఏదీ, ఒక్కసారి నా కాళ్ళకు మొక్కి నన్ను ఆరాధించు’’ అని క్రీస్తుకు సాతాను ఆశ చూపాడు. ‘‘నీకు కూడా దేవుడైన ఆ ప్రభువుకు మొక్కి, ఆయనను మాత్రమే సేవించాలి’’ అంటూ సాతానును ఏసు గద్దించి తరిమికొట్టాడు.


నలభై రోజుల ఉపవాసం తరువాత శారీరకంగా బలహీనడిన ఏసు తనను చెప్పినవాటికి తేలికగా ఒప్పుకుంటాడని సాతాను భ్రమపడి ఉంటాడు. కానీ ‘మన ఆశయాలను వమ్ము చెయ్యడానికి అనేక ప్రలోభాలు ఎదురవుతాయి. గడ్డు పరీక్షలు ఎదురవుతాయి. వాటన్నిటినీ ఎదిరించాలి. ఆకర్షణలకు బలహీనంగా లొంగిపోకూడదు’ అని తన చర్య ద్వారా ఏసు స్పష్టమైన సందేశం ఇచ్చాడు.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌

9866755024

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 02:16 AM