జబర్దస్త్... జమ్దానీ
ABN , Publish Date - Apr 29 , 2026 | 02:44 AM
జమ్దానీ చీరల మూలాలు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉన్నాయి. ఈ సంప్రదాయ చేనేత చీరలను, సంక్లిష్టమైన నేత నైపుణ్యాల సహాయంతో నాజూకైన మస్లిన్ వస్త్రంతో నేస్తారు...
ఫ్యాషన్
ప్రత్యేకమైన సందర్భాల కోసం ఎంచుకునే చీరలు ప్రత్యేకతలను కలిగి ఉండాలి. జమ్దానీ చీరలు ఆ కోవకు చెందినవే! నీతా అంబానీ మొదలు దీపికా పదుకొణె, కంగనా రనౌత్ వరకూ అనేక మంది ప్రముఖులు ముచ్చటపడే జమ్దానీ చీరల మీద ఓ లుక్కేద్దాం రండి!
జమ్దానీ చీరల మూలాలు బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉన్నాయి. ఈ సంప్రదాయ చేనేత చీరలను, సంక్లిష్టమైన నేత నైపుణ్యాల సహాయంతో నాజూకైన మస్లిన్ వస్త్రంతో నేస్తారు. పశ్చిమ బెంగాల్‌లోని శాంతిపూర్, ఫులియా, ధనిఖాలి ప్రాంతాల్లో ఈ చీరలను ఎక్కువగా నేస్తారు. ఇక్కడి నిపుణులైన చేనేత కళాకారులు పట్టు, నూలు దారాలతో అందమైన ఆకృతులను సృష్టిస్తూ, ప్రతి చీరకూ నిర్దిష్టమైన ప్రత్యేకతను, గుర్తింపును సమకూరుస్తూ ఉంటారు.
యునెస్కో గుర్తింపు...
అన్నిటికీ మించి, చేనేత డిజైన్ ప్రక్రియ జమ్దానీ చీరలకు భిన్నమైన గుర్తింపును తెచ్చిపెడుతోంది. చేనేత కళాకారులు మొదట, మగ్గం మీద మోటి్‌ఫలను మలిచి, వస్త్రం మీద తేలుతున్నట్టు కనిపించే పూల ఆకృతులను సృష్టిస్తారు. ఒక్కో చీర తయారీకి కనీసం 20 నుంచి 30 రోజుల సమయం పడుతుంది. అంతిమంగా రూపొందిన చీరలోని ఆకృతులు, అల్లికలు కళాకారుల కృషికి అద్దం పడుతూ ఉంటాయి. తేలికగా ఉండే జమ్దానీ చీరలు ప్రత్యేకించి వేసవికి ఎంతో అనువుగా, సౌకర్యవంతంగా ఉంటాయి. సాంస్కృతిక విలువను కలిగిన ఈ సంప్రదాయ చేనేత చీరలు యునెస్కో గుర్తింపు కూడా పొందాయి.
ప్రముఖులు మెచ్చిన చీర
జమ్దానీ చీరలను అనేక మంది బాలీవుడ్ నటీమణులు, ప్రముఖులు ఇష్టపడుతూ ఉంటారు.
నీతా అంబానీ
న్యూయార్క్‌లో జరిగిన టైమ్ 100 సదస్సు కోసం నీతా, జమ్దానీ చీరను ఎంచుకున్నారు. స్థానికతను ప్రతిబింబించే గిరిజనులు, జంతువులు, పక్షులు, చెట్ల మోటిఫ్స్ ఈ చీరకు అరుదైన ఆకర్షణను తెచ్చిపెట్టాయి
కంగనా రనౌత్
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచార సమయంలో అందమైన తెల్ల జమ్దానీ చీరలో మెరిసిపోయింది కంగనా రనౌత్
దీపిక పదుకొనె: ఐవరీ జమ్దానీ చీరకు, ఎరుపు, బంగారు వర్ణం బ్లౌజ్‌ను మ్యాచ్ చేసి, అలరించింది దీపికా పడుకొనె. గోల్డెన్ లేస్, ఎర్ర గాజులు, చాంద్‌బాలీలు జమ్దానీ చీరకు అదనపు ఆకర్షణను తెచ్చిపెట్టాయి
విద్యా బాలన్: తెల్లని జమ్దానీ చీరకు, బంగారు రంగు బ్లౌజ్, తక్కువ ఆభరణాలతో కలిపి ధరించిన విద్యాబాలన్, హూందాతనంతో మెరిసిపోయింది
అలియా భట్: లేస్ డిటెయిలింగ్‌తో కూడిన ఆకుపచ్చ జమ్దానీ చీరను తెల్లని బ్లౌజ్‌తో మ్యాచ్ చేసి, సమకాలీన్ లుక్‌తో మైమరిపించింది ఆలియా భట్
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ