Share News

ఆపత్సమయంలో ఆశాకిరణాలు

ABN , Publish Date - Nov 13 , 2026 | 01:49 AM

మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం దేవుడి సంకల్పమైన ఒక పరీక్ష. సుఖ సంతోషాలు ఉన్నప్పుడు అల్లా్‌హను స్మరించడం ఎంత ముఖ్యమో... కష్టాల్లో ఉన్నప్పుడు...

ఆపత్సమయంలో ఆశాకిరణాలు

సందేశం

మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం దేవుడి సంకల్పమైన ఒక పరీక్ష. సుఖ సంతోషాలు ఉన్నప్పుడు అల్లా్‌హను స్మరించడం ఎంత ముఖ్యమో... కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం అంతకంటే ముఖ్యం. మనిషి చేసే మంచి పనులు, నిజాయితీ, నైతిక విలువలు ఆపత్సమయంలో గొప్పగా ఆదుకుంటాయి. దానికి ఉదాహరణగా ఒక కథను దైవ ప్రవక్త మహమ్మద్‌ తన సహచరులకు వివరించారు.

ఒకప్పుడు ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తూ... హఠాత్తుగా వర్షం రావడంతో తలదాచుకోడానికి ఒక గుహలో ప్రవేశించారు. వర్షం ధాటికి కొండ పైనుంచి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి, గుహ ప్రవేశమార్గాన్ని మూసేసింది. ఆ ముగ్గురూ ఎంత ప్రయత్నించినా ఆ బండరాయిని కదిలించలేకపోయారు. గుహలో ఇరుక్కుపోయారు.

‘అల్లాహ్‌ కోసం నిష్కల్మషంగా మనం చేసిన సత్కర్మలను గుర్తు చేసుకుందాం. వాటిని పరిగణించి బయటపడే మార్గం చూపించాలని అల్లా్‌హను ప్రార్థిద్దాం’’ అని నిశ్చయించుకుకున్నారు. మొదటి వ్యక్తి తల్లితండ్రుల పట్ల ఎనలేని విధేయతను చూపించే వ్యక్తి. అతను రోజూ వారికి పాలు అందించేవాడు. ఒక రోజు అతను ఇంటికి ఆలస్యంగా చేరుకున్నాడు. అప్పటికి అతని తల్లిదండ్రులు నిద్రపోతున్నారు. వారిని లేపడం ఇష్టంలేక... పాల పాత్రను పట్టుకొని వారిపక్కనే అతను నిలబడ్డాడు. వారు మేల్కొనేవరకూ వేచి ఉన్నాడు. ఈ సంఘటనను అతను గుర్తు చేసుకుంటూ... అల్లాహ్‌ను ప్రార్థించాడు. వెంటనే బండరాయి కాస్త కదిలింది. కానీ బయటకు వెళ్ళడానికి సరిపడే మార్గం ఏర్పడలేదు.

రెండో వ్యక్తి ఒక మహిళను ఎంతగానో ఇష్టపడేవాడు. ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేశాడు. కానీ ఒక సందర్భంలో ఆమెతో తన కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. చివరకు ఆమెను ఒప్పించాడు. కానీ అల్లా్‌హకు భయపడాలని ఆమె అతనికి గుర్తు చేయడంతో... తను చెయ్యాలనుకున్నది పాపం అని గ్రహించాడు. ఆమెను ఏమీ చెయ్యకుండా వదిలేశాడు. ఆమె తిరిగి ఇచ్చిన డబ్బు కూడా తీసుకోలేదు. ఈ సంఘటనను గుర్తు చేసుకొని అతను అల్లాహ్‌ను ప్రార్థించగా... బండరాయి మరికాస్త కదిలింది. అయినా వారు బయటకు రావడం సాధ్యపడలేదు. ఇక... మూడో వ్యక్తి దగ్గర ఒక కార్మికుడు పని చేసేవాడు. ఒక రోజు ఆ కార్మికుడు తనకు రావలసిన డబ్బు తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అతని కోసం వెతికిన ఈ యజమాని... ఆ డబ్బును తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. దాని ద్వారా వచ్చిన లాభాలతో పశువులను, ఇతర సంపదలను కొన్నాడు. కొన్నేళ్ళ తరువాత ఆ కార్మికుడు వచ్చి... తన కూలి డబ్బుల గురించి అడిగాడు. అప్పుడు యజమాని... అతనికి ఇవ్వాల్సిన మొత్తంతో పాటు... దాని పెట్టుబడితో సమకూరిన అన్నిటినీ అతనికి అప్పగించి ఆ కార్మికుడి హక్కును కాపాడాడు. ఆ ఉదంతాన్ని గుర్తు చేసుకొని మూడో వ్యక్తి అల్లా్‌హను ప్రార్థించగా... ఆ బండరాయి పూర్తిగా తొలగిపోయింది. ఆ ముగ్గురు సురక్షితంగా గుహనుంచి బయటపడ్డారు.


ఈ కథ మన జీవితానికి గొప్ప సందేశాలను ఇస్తుంది. మొదటిది తల్లిదండ్రుల పట్ల విధేయత. అది కేవలం బాధ్యత మాత్రమే కాదు... గొప్ప సత్కర్మ. రెండోది అల్లాహ్‌ పట్ల భయంతో పాపాలకు దూరంగా ఉండడం. ఎవరూ చూడని సమయంలో కూడా మనస్సును అదుపులో ఉంచుకోవడమే నిజమైన దైవభీతి. మూడోది ఇతరుల హక్కులను కాపాడడం. ముఖ్యంగా కష్టపడి పని చేసిన కార్మికుడికి తగిన ప్రతిఫలం అందించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం చేసే మంచిపనులు కేవలం సమాజంలో పేరు ప్రతిష్టల కోసం కాకుండా... అల్లాహ్‌ సంతృప్తి కోసం చెయ్యాలి. అలాంటి పనులను ఎప్పుడూ చిన్నవిగానో, భారంగానో భావించకూడదు. కష్టకాలంలో అవే మనకు ఆశాకిరణాలుగా మారవచ్చు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 01:49 AM