సత్యం సహనం క్షమ
ABN , Publish Date - Apr 24 , 2026 | 04:53 AM
‘‘విశ్వాసులకు నిజమైన గమ్యం స్వర్గం. స్వర్గంలో చిన్న స్థలం కూడా ప్రపంచం మొత్తం కన్నా గొప్పది’’ అని దైవ ప్రవక్త మహమ్మద్ చెప్పారు. అక్కడ నదులు నిరంతరాయంగా ప్రవహిస్తాయని,,,
సందేశం
‘‘విశ్వాసులకు నిజమైన గమ్యం స్వర్గం. స్వర్గంలో చిన్న స్థలం కూడా ప్రపంచం మొత్తం కన్నా గొప్పది’’ అని దైవ ప్రవక్త మహమ్మద్ చెప్పారు. అక్కడ నదులు నిరంతరాయంగా ప్రవహిస్తాయని, శాంతి స్థిరంగా ఉంటుందని, ఎల్లప్పుడూ ఆనందం అక్కడ నెలకొని ఉంటుందనీ అంతిమ దివ్యగ్రంథమైన ఖుర్‌ఆన్ పేర్కొంది. అటువంటి అత్యున్నతమైన ప్రదేశానికి చేరుకొనే అవకాశం... అల్లాహ్ ప్రసన్నత ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ భూమి మీద ఒక వ్యక్తి జీవించే స్వల్పమైన కాలంలో... దైవం అనుగ్రహం కోసం పడే కష్టాలు, చేసే త్యాగాలు... ఇవన్నీ ఎంతో విలువైనవి.
సత్యం పలకడం, మంచి ప్రవర్తన... వీటిని అనుసరించడం ఏదో ఒక కాలానికో, వ్యక్తికో, ప్రాంతానికో పరిమితం కాదు. ఎల్లప్పుడూ, ప్రతి ఒక్కరూ, ఎక్కడ ఉన్నవారైనప్పటికీ సత్యం మాట్లాడాలి. చక్కటి ప్రవర్తన కలిగి ఉండాలి. ‘‘మీలో ఉత్తముడు ఎవరంటే... మంచి స్వభావం కలిగిన వాడు’’ అని దైవ ప్రవక్త పేర్కొన్నారు.. సత్యం, సహనం, దయ, క్షమ కలిగి ఉండాలని సూచించారు. ‘‘ఒక మహిళ ఎక్కువ సమయం నమాజ్ చేసేది. కానీ ఆమె ప్రవర్తన పొరుగువారికి ఇబ్బంది కలిగించేది. మరో మహిళ ప్రార్థనలు పరిమితంగా చేసినా, ఎవరినీ బాధించేది కాదు. వారిలో మొదటి మహిళ నరకానికి స్వర్గానికి వెళ్తుంది’’ అని చెబుతూ... మన హృదయం శుభ్రంగా ఉండాలని దైవప్రవక్త బోధించారు.
‘‘జీవితం అన్ని సమయాల్లోనూ సుఖంగా ఉండదు. కష్టాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి సహనంతో ఉండేవారికి అపారమైన ప్రతిఫలం ఇస్తాను’’ అని ఖుర్‌ఆన్‌లో అల్లాహ్ స్పష్టం చేశాడు. ఎన్నో కష్టాలు ఎదురైనా అల్లాహ్ పట్ల నమ్మకం కోల్పోని వారికి మంచి రోజులు కచ్చితంగా వస్తాయి. శాంతి లభిస్తుంది. సహనం అంటే కేవలం సహించడం కాదు... అల్లాహ్ మీద దృఢమైన నమ్మకం ఉంచి ముందుకు సాగడం. పశ్చాత్తాపం కూడా దైవానికి ఎంతో దగ్గర చేస్తుంది. మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు. కరుణామయుడైన అల్లాహ్ వాటిని క్షమిస్తూ ఉంటాడు. తౌబా... అంటే మనిషి తన తప్పులను గుర్తించి, నిజాయితీగా పశ్చాత్తాపం చెంది, అల్లా్‌హను ఆశ్రయించాలి. ఇవన్నీ మానవులను స్వర్గానికి చేరువచేసే మార్గాలు.
మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి:
చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం