ఇషాన్ ఇష్ట సఖి
ABN , Publish Date - Feb 18 , 2026 | 05:33 AM
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ తరువాత దేశానికి క్రికెట్ అభిమానులకు ఇషాన్ కిషన్ ఫీవర్ పట్టుకుంది. అదే సమయంలో మరో పేరు కూడా ఇప్పుడు తెగ వినిపిస్తోంది....
న్యూస్‌మేకర్
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ తరువాత దేశానికి క్రికెట్ అభిమానులకు ఇషాన్ కిషన్ ఫీవర్ పట్టుకుంది. అదే సమయంలో మరో పేరు కూడా ఇప్పుడు తెగ వినిపిస్తోంది. అది ఎవరో కాదు... ఇషాన్ ప్రియురాలు అదితి హుండియా. క్రీజ్‌లో ఉన్న అతడి స్ర్కీన్ షాట్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి... ఓ మూడు హార్ట్ ఎమోజీలు కూడా జత చేసింది. ఇక నెటిజనులు ఆగుతారా..! లెక్కకు మించిన లైక్‌లు... వేలకు వేల షేర్లతో సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఎవరీ అదితి..? ఏమిటి ఆమె ప్రత్యేకత?
అదితి హుండియా... క్రికెట్ ప్రపంచానికి పరిచయమైంది ఇషాన్ స్నేహితురాలిగానే. కానీ అంతకుముందే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజస్థాన్ జైపూర్‌కు చెందిన ఆమె... ప్రముఖ మోడల్. ఒకప్పుడు ‘ఫెమినా మిస్ ఇండియా’ పోటీల ఫైనలిస్టు. త్రుటిలో అందాల కిరీటం చేజారినా... ఆ పోటీలతో 29 ఏళ్ల అదితి పేరు దేశమంతటికీ పరిచయమైంది. ముఖ్యంగా చెదరని ఆమె ఆత్మవిశ్వాసం నాడు న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకుంది. ఆ మరుసటి ఏడాది ‘మిస్ దివా’గా అవతరించింది. బ్రాండ్ విలువను అమాంతం పెంచేశాయి. పలు ప్రముఖ బ్రాండ్‌లు ఈ మోడల్‌ను తమ ప్రచార కర్తగా నియమించుకున్నాయి.
వ్యాపార కుటుంబం...
జైపూర్‌లో పుట్టి పెరిగిన అదితి తండ్రి లలిత్ హుండియా వ్యాపారవేత్త. తల్లి బబిత. సోదరుడు యష్. జైపూర్‌లోని ‘ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్’లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన అదితి... ‘సెయింట్ జేవియర్స్ కాలేజీ’ నుంచి బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (బీబీఏ) పట్టా పొందింది. కుటుంబ నేపథ్యం, కెరీర్ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా బీబీఏను ఎంచుకుంది.
ఇన్‌స్టాలో చురుగ్గా...
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అదితి... ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు దాదాపు మూడు లక్షల మంది ఫాలో అవుతున్నారు. తన మోడలింగ్, బ్రాండ్ ప్రమోషన్ షూట్స్ తదితర వీడియోలు, ఫొటోలు అభిమానులతో పంచుకొంటుంది. అయితే వ్యక్తిగత విషయాలను సాధ్యమైనంతవరకు గోప్యంగా ఉంచుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో గడిపిన క్షణాలను అరుదుగా అప్‌లోడ్ చేస్తుంటుంది.
ఐపీఎల్‌తో అలా...
భారత్ స్టార్ ఓపెనర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌తో అదితి ప్రేమ బంధం గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీరిద్దరూ ఇప్పటివరకు ఎక్కడా ఆ విషయంపై మాట్లాడకపోయినా... 2019 నుంచి సాన్నిహిత్యంగా ఉన్నట్టు సమాచారం. ఐపీఎల్ కావచ్చు... అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు... ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ కావచ్చు... ఇషాన్ ఎక్కడ ఆడితే అక్కడ ప్రత్యక్షమవుతుంది అదితి. అతడి విజయానికి తన ఆనందాన్ని జోడించి అందరితో పంచుకొంటుంది. మొన్నటి మ్యాచ్‌లో ఇషాన్ మెరుపు బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌కు నిద్ర లేని రాత్రులు మిగిల్చాడు. అతడు అర్ధ శతకం కొట్టి, బ్యాట్‌తో అభివాదం చేస్తున్న స్ర్కీన్ షాట్‌ను అదితి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దానికి మూడు హార్ట్ సింబల్స్‌ను కూడా జోడించింది. వారిద్దరి మధ్య ప్రేమ బంధానికి ఇది మరో రుజువు అంటూ నెటిజనులు ఆ పోస్టును లైక్‌లతో ముంచెత్తుతున్నారు. అన్ని మాధ్యమాల్లో షేర్ చేయడంతో ఒక్కసారిగా అదితి పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతోంది.
పెళ్లి ప్రస్తావన...
దాదాపు ఏడేళ్లుగా కలిసి తిరుగుతున్న అదితి, ఇషాన్‌ల బంధంలో మరో అడుగు ముందుకు పడిందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ తరువాత ఇరువురూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఇషాన్ ఎవరిని ఇష్టపడితే వారితోనే అతడి పెళ్లి చేస్తాం. ఇందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాడి పెద్దన్నయ్య పెళ్లి కూడా ఇలానే జరిగింది’ అంటూ ఇషాన్ కిషన్ తాతయ్య అనురాగ్ పాండే వెల్లడించారు. అంతేకాదు... అదితి, ఇషాన్ డేటింగ్‌లో ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు. దీంతో వారి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరింది. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన 27 ఏళ్ల ఇషాన్ కిషన్ స్వరాష్ట్రం... బిహార్. పాట్నాలో పుట్టి పెరిగిన అతడు కొద్ది కాలంలోనే భారత జట్టులో స్టార్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. బౌలర్లకు సింహస్వప్నంగా మారాడు. కెరీర్‌లో ఒడుదొడుకులు ఎదురైనా నిరంతర కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా కథ ముగిసినట్లేనా?
ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ