Share News

విశ్వశాంతి మార్గం

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:52 AM

21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదాంతం చెప్పిన పరమ సత్యాన్ని, క్వాంటమ్‌ భౌతికశాస్త్రంలోని విశ్వశక్తి క్షేత్రాన్ని గ్రహించడానికి మార్గం... యోగా. వేదాంతంలోని ఉన్నతమైన, అగోచరమైన ...

విశ్వశాంతి మార్గం

21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదాంతం చెప్పిన పరమ సత్యాన్ని, క్వాంటమ్‌ భౌతికశాస్త్రంలోని విశ్వశక్తి క్షేత్రాన్ని గ్రహించడానికి మార్గం... యోగా. వేదాంతంలోని ఉన్నతమైన, అగోచరమైన సత్యం యోగా ద్వారా మరింత నిర్దిష్టంగా స్పష్టమవుతుంది. ఇది వ్యక్తులు అంతరంగంలోకి సాగించే ప్రయాణానికి ఆరంభం. యోగా అనేది వ్యక్తికి, అలాగే సమాజానికి కూడా ఆనందపు ద్వారాలను తెరిచే తాళం చెవి. వ్యక్తివాదం వల్ల, అహంకార ప్రవృత్తుల వల్ల కలిగే వ్యక్తిగతమైన, సామూహికమైన దుఃఖాన్ని ఇది నిర్మూలిస్తుంది. యోగా ఆనందం, చైతన్యం లాంటి ప్రాపంచిక ప్రయోజనాలను అందించడమే కాకుండా ఆత్మను ఉత్తేజపరుస్తుంది. కార్యనిర్వహణకు ఎంతో అవసరమైన అంతర్‌ దృష్టి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కార్యాచరణలో నైపుణ్యాన్ని అందిస్తుంది. సవాలుతో కూడుకున్న పరిస్థితులను ఒత్తిడికి గురికాకుండా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

ప్రతి బిడ్డ పుట్టుకతోనే యోగి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా... మూడేళ్ళ వయసు వరకూ పిల్లలు సహజంగానే అనేక యోగాసనాలు, ముద్రలను ప్రదర్శిస్తారు. శిశువు మనఃస్థితి, శ్వాస తీరుతెన్నులు యోగిని పోలి ఉంటాయి. యోగా మన లోలోపల ఉన్న ఆ బాల్యపు సౌందర్యాన్ని, అమాయకత్వాన్ని మేల్కొలుపుతుంది. ఎంతోమంది వివిధ అనారోగ్యాల నుంచి కోలుకోవడానికి యోగా సాయపడిందనేది అందరికీ తెలిసిన విషయమే. అది మన వ్యక్తిత్వంలో తక్షణమే సంపూర్ణ సమతుల్యతను తీసుకువస్తుంది. తీవ్రమైన సంక్లిష్టతలను, ధోరణులను సరిదిద్దుతుంది. నిజానికి, నేడు ప్రవర్తనా శాస్త్రాలు అన్వేషిస్తున్న అనేక పరిష్కారాలను యోగా అందించగలదని ఆశించవచ్చు.


వ్యక్తులు ధ్యాన అనుభవాన్ని కాస్త రుచి చూసినప్పుడు... వారి జీవితం మారిపోతుంది. జైళ్ళలో కూడా దీన్ని మేము గమనించాం. ఖైదీలు ప్రాథమిక ప్రాణాయామంతో ఆరంభించినప్పుడు... వారు సులభంగా ధ్యానంలోకి వెళతారు. వారి ప్రవర్తన యమ, నియమాలను (పతంజలి మహర్షి ప్రతిపాదించిన సామాజిక, వ్యక్తిగత ప్రవర్తనా నియమావళిని) ప్రతిబింబించడం ప్రారంభిస్తుంది. వివిధ ప్రవృత్తులకు చెందిన ప్రజల జీవితాలను ఊహించని రీతిలో సమూలంగా యోగా మార్చగలదు. అది హృదయాన్ని మెత్తబరుస్తుంది. మేధస్సుకు పదును పెడుతుంది. గందరగోళాన్ని తొలగిస్తుంది. ఈ శతాబ్దంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్ళలో డిప్రెషన్‌ ఒకటి. ఇలాంటి సందర్భంలో, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాల్సిన సాధనం... నిస్సందేహంగా యోగానే. విజ్ఞానశాస్త్రం, క్రీడలు, సంస్కృతి మాదిరిగానే... యోగా, క్రమశిక్షణ వర్ధిల్లడానికి కూడా ప్రోత్సాహం అవసరం. సామాన్యుల నుంచి పాలకులవరకూ అందరూ యోగాను ఆచరిస్తే... అది గొప్ప సామరస్యాన్ని తీసుకువస్తుంది. అన్ని దేశాలూ యోగ జ్ఞానాన్ని అక్కున చేర్చుకోవడం ఆరంభిస్తే... విశ్వ శాంతి త్వరలోనే సాధ్యమవుతుంది.

శ్రీశ్రీరవిశంకర్‌

ఇవి కూడా చదవండి..

కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

పంట గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 19 , 2026 | 04:52 AM