మెట్‌గాలాలో భారతీయం
ABN , Publish Date - May 07 , 2026 | 06:09 AM
ఏటా న్యూయార్క్‌లో జరిగే ‘మెట్ గాలా’లో ఈసారి భారతీయ వారసత్వం ధగధగలాడింది. ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి, రిలయన్స్ ఇండస్ట్రీస్....
న్యూస్ మేకర్స్
ఏటా న్యూయార్క్‌లో జరిగే ‘మెట్ గాలా’లో ఈసారి భారతీయ వారసత్వం ధగధగలాడింది. ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వారసురాలు ఇషా అంబానీ, జైపూర్ రాజవంశీకురాలు రాకుమారి గౌరవి కుమారి అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. వీరితోపాటు లారెన్ వాసర్, ఆరియానా ఫిలిప్ అనే ఇద్దరు విభిన్నమైన వనితలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
సుధారెడ్డి.. నగధగలు
ఈ మెగా షోలో ప్రధాన ఆకర్షణ ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి మేఘా సుధారెడ్డి. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ‘ట్రీ ఆఫ్ లైఫ్’ థీమ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన డ్రెస్‌లో అబ్బురపరిచారు. ఈ లుక్‌కు మరింత వన్నె తెచ్చేలా ఖరీదైన కంఠాభరణంలో మెరిసిపోయారు. దీని విలువ సుమారు రూ.142 కోట్లు ఉంటుందని అంచనా. త్రికోణాకారపు రోజ్‌కట్ డైమండ్స్‌తో ప్రముఖ స్టైలిస్ట్ మారియల్ హెనిన్ దీన్ని రూపొందించారు. హారం లాకెట్‌లో ఖరీదైన 550 కేరెట్ల ముదురు ఊదా నీలం రంగు టాంజానియా వజ్రాన్ని పొదిగారు. మెరిలానీ క్వీన్’గా పిలిచే ఆకర్షణీయమైన ఈ లాకెట్ టాంజానియాలోని మెరిలానీ ప్రాంతానికి చెందినదిగా చెబుతారు. దానికి జతగా చేతి వేళ్లకు 30 క్యారెట్ల పోల్కీ డైమండ్ రింగ్, 40 క్యారెట్ల యాషర్ కట్ కొలంబియన్ పచ్చను ధరించారు.
ఆమె ధరించిన డ్రెస్‌ను మచిలీపట్టణం కలంకారీ శైలిలో సహజ రంగులు అద్ది, చేతితో నేశారు. మన నేల సంస్కృతిని ప్రతిబింబించేలా పాలపిట్ట, జమ్మిచెట్టు, తంగేడు పువ్వు, సూర్య, చంద్ర ఆకృతులు అందులో పొందుపరిచారు. దీని తయారీకి 90 మంది హస్తకళాకారులు 3,400 గంటలకు పైగా శ్రమించారు. ‘వీటన్నిటి వెనుకా ఉన్న మానవ స్పర్శే నన్ను కదిలిస్తుంది. వేలాది గంటలు, లెక్కలేనన్ని చేతులు, తరతరాల జ్ఞానం అల్లుకుని ఈ ఒకేఒక్క క్షణాన్ని తీర్చిదిద్దుకున్నాయి’ అంటూ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుధారెడ్డి పోస్ట్ చేశారు. ఇంకా... హైదరాబాద్ కేవలం తన జన్మస్థలం మాత్రమే కాదని, అది ఒక భాష, ఒక లయ, ఒక ప్రయాణం అని రాసుకొచ్చారు.
ఇషా.. 400 ఏళ్లనాటి చరిత్ర
ఇషా అంబానీ ధరించిన గోల్డెన్ టిష్యూ సిల్క్ శారీని ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించారు. అయితే, అందరి కళ్లు ఆమె ధరించిన బ్లౌజ్‌పైనే నిలిచాయి. ఎందుకంటే అది అరుదైన వజ్రాల సమాహారం. దాదాపు 1,800 క్యారెట్ల వజ్రాలను ఈ బ్లౌజ్ కోసం ఉపయోగించారు. మరీ ముఖ్యంగా, హైదరాబాద్ నిజాంలు తమ తలపాగాకు ధరించే ‘సర్పేచ్’ అనే చారిత్రక ఆభరణాన్ని ఈ బ్లౌజ్ వెనుక భాగంలో బ్రూచ్‌గా అమర్చారు. నీతా అంబానీ వ్యక్తిగత సేకరణ నుంచి తీసుకున్న ఈ ఆభరణం పచ్చలు, వజ్రాలు, కుందన్ పనితనంతో మెరిసిపోతూ భారతీయ కళావైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
ఈ వేడుకలో ఇషా ధరించిన మరో అరుదైన వస్తువు మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు చెందిన బ్రేస్‌లెట్. 17వ శతాబ్దానికి చెందిన ఈ ఆభరణంలో వజ్రాలు, కెంపులు, స్పినెల్స్ పొదిగి ఉన్నాయి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన బ్రేస్‌లెట్ విలువ రూ. 200 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఒక చక్రవర్తి వాడిన ఆభరణాన్ని ఆధునిక ఫ్యాషన్‌కు జోడించి ఇషా అంబానీ అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనిని సుమారు 50 మంది కళాకారులు 1,200 గంటలపాటు శ్రమించి రూపొందించారు. 1953లో బరోడా మహారాణి సీతాదేవి తన కాలి పట్టీలలోని పచ్చలు, వజ్రాలను అమెరికన్ వ్యాపారి హ్యారీ విన్‌స్టన్‌కు విక్రయించగా, ఆయన వాటితో ఒక అద్భుతమైన నెక్లె్‌సను తయారుచేశారు. ఆ చారిత్రక హారాన్ని అంబానీ కుటుంబం సొంతం చేసుకుని ఈ వేడుక కోసం తిరిగి వినియోగించడం విశేషం.
అమ్మమ్మ చీరలో రాకుమారి
జైపూర్ రాజవంశీకురాలు రాకుమారి గౌరవి కుమారి ఈ వేడుకలో తన అరంగేట్రంతో అందరి దృష్టినీ ఆకర్షించారు. ఆధునిక డిజైన్లపై మోజుతో కాకుండా.. తన కుటుంబ మూలాలను, గతాన్ని గౌరవిస్తూ ఆమె ఎంచుకున్న ఆహార్యం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. గౌరవి ధరించిన దుస్తులు ఒక కథను చెప్పాయి. ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా గుర్తింపు పొందిన తన అమ్మమ్మ, దివంగత జైపూర్ మహారాణి గాయత్రీదేవికి చెందిన అసలైన పింక్ షిఫాన్ చీరను ఆమె ఎంచుకున్నారు. ఆ వింటేజ్ చీరను ప్రఖ్యాత డిజైనర్ ప్రబల్ గురుంగ్ ఒక స్టైలిష్ గౌనుగా మలిచారు.
విభిన్న మోడళ్లు
పుట్టుకతోనే వెంటతెచ్చుకున్న వైకల్యానికి కొంతమేరకు సర్దుకుపోవచ్చు. కానీ కెరీర్‌ను మలుచుకునే కీలకమైన వయసులో ఊహించని పరిణామంతో అంగవైకల్యం ప్రాప్తిస్తే, ఆ వేదనను, బాధను అధిగమించడం చాలా కష్టం. దురదృష్టవశాత్తూ, లారెన్ వాసర్‌కు అదే దుస్థితి ఎదురైంది. 24 ఏళ్ల వయసులో ఈ మోడల్, యాక్టివిస్ట్... టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌కు గురైంది. టాంపన్ వాడకంతో ముడిపడి ఉండే ఈ సమస్య లారెన్ విషయంలో అవయవ విచ్ఛేదానికి దారి తీసింది. 2012లో ఎడమ కాలునూ, 2018లో కుడికాలునూ కోల్పోయిన లారెన్, అర్ధాంతరంగా అంగవైకల్యం బారిన పడింది. దాంతో ఆమె మోడలింగ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఎనిమిది నెలల పాటు వీల్‌చైర్‌కే పరిమితమైన సమయంలో, తన భావోద్వేగాలను ఏమాత్రం దాచుకోలేకపోయిందామె. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోవడంతో, తాను తీవ్రంగా కుంగిపోయాననీ, బాత్రూంలో ఏడుస్తూ ఉండిపోయేదాన్ననీ ఒక సందర్భంలో బహిరంగంగా చెప్పుకుంది. ఇక మీదట మోడలింగ్ పరిశ్రమ తననెప్పటికీ ఆదరించదని అనుకున్నానని కూడా చెప్పుకుంది. నిజానికి అదే నిజాయితీ ఆమె కెరీర్‌కు దన్నుగా మారింది.
బంగారం కాళ్ల అమ్మాయిగా...
కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందని అంటారు. అదే విధంగా లారెన్ కాలి గాయాలు, మానసిక గాయాలూ మానిపోయాయి. గాయాల నుంచి కోలుకోగానే, బంగారంతో తయారైన కృత్రిమ కాళ్లను ధరించడం మొదలుపెట్టిందామె. అంతే కాకుండా టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం కోసం, కృత్రిమ కాళ్లనే ఫ్యాషన్ భాషగా మార్చుకుని, ఫ్యాషన్ షోలలో ప్రదర్శించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఆమెకు ‘ది గర్ల్ విత్ గోల్డెన్ లెగ్స్’ అనే పేరొచ్చింది. తాజా మెట్‌గాలాలో సైతం బంగారంలా మెరిసేపోయే దుస్తులతో, బంగారంతో తయారైన కృత్రిమ కాళ్లతో పవర్‌ఫుల్ ఫ్యాషన్ ఫిగర్‌గా తన ఉనికిని చాటుకుంది.
ఆరియానా రోజ్ ఫిలిప్
ఆరియానా, 2001, మార్చి 11న ఆంటిగ్వాలో క్వాడ్రాప్లెజిక్ సెరిబ్రల్ పాల్సీతో పుట్టింది. మూడేళ్ల వయసులో ఆమెతో పాటు ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లిపోయి, న్యూయార్క్‌లో స్థిరపడింది. తనంతట తాను ఏ పనీ చేసుకోలేని ఆరియానా, తన వైకల్యానికి కుంగిపోకపోగా, 14 ఏళ్ల వయసు నుంచే బ్లాగులు రాయడం మొదలుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. 2016లో, 14 ఏళ్ల వయసులో ఆరియానా రాసిన ‘దిస్ కిడ్ కెన్ ఫ్లై: ఇట్స్ ఎబౌట్ అబిలిటీ(నాట్ డిసబిలిటీ) మెమొయిర్‌తో రచయితగా గుర్తింపు పొందింది. ఈ పుస్తకం ద్వారా, క్వాడ్రాప్లెజిక్ సెరిబ్రల్ పాల్సీతో బాల్యంలో తానెదుర్కొన్న అనుభవాలను వివరించింది ఆరియానా. ఆ తర్వాత ఎడిటోరియల్ ఫీచర్స్‌తో ఫ్యాషన్ ప్రపంచంలోకి ప్రవేశించి, తన మోడలింగ్ కెరీర్‌ను మలుచుకుంది. 2018లో మొట్టమొదటి నల్ల జాతి ట్రాన్స్‌జెండర్, దివ్యాంగ మోడల్‌గా ఒక ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీకి ప్రాతినిధ్యం వహించింది. అప్పటి నుంచి ప్రముఖ ఫ్యాషన్ ఫొటో షూట్స్, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ తనదైన ప్రత్యేక గుర్తింపు సాధించింది. 2022, మోషినోస్ స్ర్పింగ్/సమ్మర్ షోలో ప్రధాన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ వాక్ కోసం, వీల్‌చైర్ వాడుకున్న మొట్టమొదటి మోడల్‌గా కూడా గుర్తింపు పొందింది. తాజా మెట్ గాలాలో సైతం వీల్‌చైర్‌లో మెరిసిన మొట్టమొదటి రన్‌వే మోడల్‌గా పేరు పొందింది.
‘గళమెత్తిన దివ్యాంగులను కార్యకర్తలుగా ముద్ర వేయడం పరిపాటిగా మారిపోయింది. మా శరీరాల్లో వైకల్యాలూ, మాకు కల్పించవలసిన వసతుల గురించి ఎవరికీ ఎటువంటి అవగాహనా ఉండదు. ఇలాంటి సామాజిక వ్యవస్థను సవాలు చేస్తూ ఉంటాం కాబట్టి మాకు కార్యకర్తలనే బిరుదులిస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా దివ్యాంగులకు ఎక్కడా, ఏ వేదిక మీదా ప్రాతినిథ్యం ఉండేది కాదు. మెట్ గాలా లాంటి ఇలాంటి కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొనగలుగుతామనే ఆలోచనే దివ్యాంగులకు ఉండేది కాదు. ఆ స్థితి నుంచి ఎదిగి, మెట్ గాలాలో హాజరయ్యే స్థాయికి చేరుకోగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ మెట్‌గాలా వేదికగా తన ఆనందాన్ని పంచుకుంది.
ఇవి కూడా చదవండి:
సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్
భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!