ఆకాశమే హద్దుగా.. ఆస్థా
ABN , Publish Date - Jan 26 , 2026 | 02:29 AM
శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే యుద్ధ విమాన గర్జన అది. అనంతమైన నీలి సముద్రంపై గాలిని చీల్చుకుంటూ వెళ్లే యుద్ధ నౌకల పైనుంచి ఎగిరే ఫైటర్ జెట్ అది. నిన్నటి వరకు ఆ కాక్‌పిట్‌లో....
శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే యుద్ధ విమాన గర్జన అది. అనంతమైన నీలి సముద్రంపై గాలిని చీల్చుకుంటూ వెళ్లే యుద్ధ నౌకల పైనుంచి ఎగిరే ఫైటర్ జెట్ అది. నిన్నటి వరకు ఆ కాక్‌పిట్‌లో పురుషులు మాత్రమే కనిపించేవారు. కానీ, ఇప్పుడా రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఆ కాక్‌పిట్‌లో కూర్చున్నది మరెవరో కాదు.. నౌకాదళంలో తొలి మహిళా ఫైటర్ పైలట్ ఆస్థా పూనియా. ఆమె సాధించిన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ విజయం దేశంలోని ప్రతి అమ్మాయి కలలకు నిలువెత్తు సాక్ష్యం. ఈ అద్భుత ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
గతేడాది విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్ డేగా వేదికగా జరిగిన రెండో బేసిక్ హాక్ కన్వర్షన్ కోర్స్ గ్రాడ్యుయేషన్ వేడుక ఒక చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. కఠినమైన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆస్థా పూనియాకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ పురస్కారాన్ని అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (ఎయిర్) రియర్ అడ్మిరల్ జనక్ బెవ్లీ ప్రదానం చేశారు.
నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం
ఒకప్పుడు యుద్ధ విమానాలు నడపడం అనేది పురుషులకు మాత్రమే పరిమితమైన రంగం అనే అపోహ ఉండేది. కానీ, భారత రక్షణ మంత్రిత్వశాఖ, నౌకాదళం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఇప్పుడు మహిళలకు ‘ఎలైట్ ఆపరేషనల్ రోల్స్’ను అందుబాటులోకి తెచ్చాయి. ఆస్థా పూనియా నియామకం ద్వారా సైన్యంలో పెరుగుతున్న నారీశక్తి స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధక్షేత్రంలో సైతం మహిళలు సరిసమానంగా పోరాడగలరని, క్లిష్టమైన యుద్ధ విమానాలను అలవోకగా నియంత్రించగలరని ఆస్థా నిరూపించారు.
హిసావాడ నుంచి హాక్ విమానం వరకు
ఆస్థా పూనియా విజయం వెనుక ఒక సామాన్య మధ్య తరగతి యువతి ప్టటుదల ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పత్ జిల్లాలో ఉన్న హిసావాడ అనే చిన్న గ్రామం ఆమె స్వస్థలం. పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం ఉండే ఆ గ్రామం నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగాలన్న ఆమె కల చిన్నప్పుడే మొదలైంది. చిన్నప్పటి నుంచీ విజ్ఞానశాస్త్రంపై ఉన్న ఆసక్తి, కొత్త విషయాలను తెలుసుకోవాలనే కుతూహలం ఆమెను సైన్యం వైపు నడిపించాయి.
దేశమే ఫస్ట్
రాజస్థాన్‌లోని ప్రసిద్ధ వనస్థలి విద్యాపీఠంలో బీటెక్ పూర్తిచేసిన ఆస్థా.. అక్కడి క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో తన వ్యక్తిత్వాన్ని మలచుకున్నారు. ‘దేశమే ప్రథమం’ అనే నినాదాన్ని తన ఊపిరిగా మార్చుకున్నారు. ‘‘వనస్థలిలో నేర్చుకున్న క్రమశిక్షణ, దేశభక్తి నన్ను ఈ స్థాయికి చేర్చాయి’’ అని ఆమె గర్వంగా చెబుతారు.
వారసుల కోసం దారి
భారత వాయుసేనలో అవని చతుర్వేది వంటి వారు సృష్టించిన బాటలో ఇప్పుడు నౌకాదళం తరపున ఆస్థా పూనియా మరో మైలురాయిని అధిగమించారు. సముద్రంపై నుంచి విమానాలను నడపడం, ల్యాండ్ చేయడం అనేది అత్యంత సాహసోపేతమైన ప్రక్రియ, అటువటి కఠినమైన విధులను చేపట్టేందుకు సిద్ధమైన ఆస్థా.. రేపటి తరం యువతులకు గొప్ప స్ఫూర్తి ప్రదాత. నేడు భారతదేశ రక్షణ రంగంలో మహిళలు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా యుద్ధ నౌకలు, సరిహద్దు గస్తీలు, ఇప్పుడు ఫైటర్ కాక్‌పిట్‌లలోనూ తమ ముద్ర వేస్తున్నారు. ఆస్థా పూనియా సాధించిన ఈ ‘వింగ్స్ ఆఫ్ గోల్డ్’ దేశంలోని కోట్లాదిమంది అమ్మాయిల కలలకు రెక్కలు తొడిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవి కూడా చదవండి..
త్వరలోనే మూడో ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా భారత్.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి గణతంత్ర ప్రసంగం
ఇది ఎన్నికల పోరు కాదు, ప్రజాస్వామ్య యుద్ధం.. విజయ్
Read Latest National News