అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి
ABN , Publish Date - May 01 , 2026 | 05:12 AM
ఒక చిన్న గ్రామం లో ఒక అబ్దుల్ రహీం అనే పేద వృద్ధుడు ఉండేవాడు. రోజూ కూలికి వెళ్ళి సంపాదించే కొద్దిపాటి డబ్బే అతనికి ఆధారం. కానీ అతని హృదయం చాలా పెద్దది. ఒకరోజు సూర్యుడు...
సందేశం
ఒక చిన్న గ్రామం లో ఒక అబ్దుల్ రహీం అనే పేద వృద్ధుడు ఉండేవాడు. రోజూ కూలికి వెళ్ళి సంపాదించే కొద్దిపాటి డబ్బే అతనికి ఆధారం. కానీ అతని హృదయం చాలా పెద్దది. ఒకరోజు సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో... ఆ వేడికి అలసిపోయిన ఒక ప్రయాణికుడు ఆ గ్రామం చేరుకున్నాడు. అతని గొంతు ఎండిపోయింది. ‘‘ఎవరైనా నీరు ఇస్తారా?’’ అని నిస్సహాయంగా గ్రామస్థులను అడిగాడు. కానీ ఎవరికీ మనసు రాలేదు. అప్పుడు రహీం తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతని దగ్గర... తనకోసం దాచుకున్న ఒక గ్లాసుడు నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ‘నేను తాగితే ఒకసారి దాహం తీరుతుంది. ఇతనికి ఇస్తే... అల్లాహ్ సంతోషిస్తాడు’ అనుకుంటూ ప్రయాణికుడికి ఆ నీరు ఇచ్చాడు. అతను ఆ నీరు తాగి.... ‘‘అల్లాహ్ మీకు మంచి చేయాలి’’ అని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. రహీం అనారోగ్యం పాలయ్యాడు. ఈ లోకాన్ని వదిలిపెట్టాడు. పైలోకంలో అతను అల్లాహ్ ముందు నిలబడినప్పుడు... ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే అతను చేసిన పాపాలు ఎదురుగా కనిపించాయి. దాంతో అతను భయపడ్డాడు. ఈలోగా ఒక చిన్న కాంతి వెలిగింది. ఆ కాంతి... ఒక గ్లాసుడు నీళ్ళు! అల్లాహ్ అతన్ని ఉద్దేశించి ‘‘నీకు పెద్ద సంపద లేదు. పెద్ద పనులు చేయలేకపోయావు. జీవనం కోసం పాపకర్మలు కూడా చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు హృదయపూర్వకంగా... నిస్వార్థంగా ఒక గ్లాసుతో ప్రయాణికుడికి మంచినీరు ఇచ్చావు. ఆ రోజు నువ్వు ఇచ్చిన నీళ్ళు... నాకు ఎంతో ప్రియమైన సదఖా’’ అని చెప్పాడు.
‘‘అల్లాహ్ పరిశుద్ధుడు. పరిశుద్ధమైన వాటినే స్వీకరిస్తాడు. ఎవరైనా తమ సక్రమమైన సంపాదన నుంచి ఖర్జూరమంత పరిమాణంలో దానం చేసినా దాన్ని ఆయన కుడి చేతితో స్వీకరిస్తాడు’’ అని దైవ ప్రవక్త మహమ్మద్ చెప్పారు. ‘సదఖా’ (దానం) అంటే ‘అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం’ అని అర్థం. అలా చేసిన ఖర్చు కొంచెమే అయినా... దాని ద్వారా లభించే పుణ్యం వల్ల ఆ మొత్తం వందల రెట్లు అభివృద్ధి చెందుతుంది. సదఖాకు చాలా విపులమైన అర్థం ఉంది. అల్లాహ్ కొందరికి ధనం ఇచ్చాడు. కొందరికి విద్య, మరికొందరికి తెలివితేటలు, ఇంకొందరికి నైపుణ్యం ఇచ్చాడు. అల్లాహ్ మార్గంలో వాటన్నిటినీ వినియోగించడం కూడా సదఖా కిందికే వస్తాయి. ‘‘మంచి మాట కూడా సదఖాయే’’ అని దైవ ప్రవక్త చెబుతూ... ‘‘సదఖా ఇవ్వడం ప్రతి ముస్లిం విధి’’ అని స్పష్టం చేశారు. నలుగురు నడిచే దారి నుంచి ఒక బండరాయిని తొలగించినా, ముల్లును తీసివేసినా, చూపులేని వారికి దారి చూపించినా, దాహంతో ఉన్నవారికి నీరు తాగించినా, బలహీనులను లేపి నిలబెట్టినా, నిస్సహాయులకు సాయం చేసినా... ఇవన్నీ సదఖా కిందికే వస్తాయి. చిత్తశుద్ధితో చేసే సదఖా అమూల్యమైనది.
మహమ్మద్ వహీదుద్దీన్
ఇవి కూడా చదవండి
స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు రెగ్యులర్‌గా మార్పు
చైల్డ్ ట్రాఫికింగ్.. ఫెర్టిలిటీ సెంటర్లపై గుజరాత్ పోలీసుల దాడులు