Share News

మాట్లాడే ముందు...

ABN , Publish Date - Sep 11 , 2026 | 04:33 AM

మనం మాట్లాడే విధానంలో మనల్ని లోతుగా ఆవిష్కరించే విషయం ఒకటి ఉంది. మనం గొప్ప పదవిలో ఉండొచ్చు. గొప్ప జ్ఞానం కలిగి ఉండొచ్చు. జీవితంలో అద్భుతమైన...

మాట్లాడే ముందు...

యోగా

మనం మాట్లాడే విధానంలో మనల్ని లోతుగా ఆవిష్కరించే విషయం ఒకటి ఉంది. మనం గొప్ప పదవిలో ఉండొచ్చు. గొప్ప జ్ఞానం కలిగి ఉండొచ్చు. జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించి ఉండొచ్చు. చక్కటి దుస్తులు ధరించి ఆకర్షణీయంగా ఉండచ్చు. కానీ కొద్ది నిమిషాల సంభాషణలోనే... మన మాటలు, స్వరం, విరామాలు, ప్రతిచర్య. ఆఖరికి మన మౌనం కూడా ‘మనం ఎవరం?’ అనే కథను చెప్పేస్తాయి. కాబట్టి సంభాషణ కేవలం సమాచార మార్పిడి మాత్రమే కాదు... మన అంతర్గత శక్తికి వ్యక్తీకరణ కూడా.

‘అహింసాత్మక సంభాషణ

‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ సంప్రదాయానికి ఆది గురువైన, ఫతేగఢ్‌కు చెందిన శ్రీరామ్‌చంద్రను అందరూ ప్రేమగా ‘లాలాజీ మహారాజ్‌’ అని పిలుస్తారు. ఆయన సంభాషణ కళకు విశేషమైన ప్రాధాన్యాన్ని ఇచ్చారు. సంభాషణలో మృదుత్వం, సమతుల్యత, వినయం ఉండాలని, మాటలలో అనవసరమైన పదునును నివారించాలనీ ఆయన బోధించారు. ఇది ఒక అద్భుతమైన అంతర్‌దృష్టి. గొప్ప పనుల ద్వారానే వ్యక్తిత్వం వ్యక్తమవుతుందని మనం తరచుగా అనుకుంటాం. కానీ బహుశా మన వ్యక్తిత్వం సాధారణ క్షణాల్లోనే మరింత స్పష్టంగా బయటపడుతుంది. మనం ఎవరైనా మనతో విభేదించినప్పుడు, విమర్శించినప్పుడు, మన మాట మధ్యలో అడ్డుపడినప్పుడు, మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు లేదా మనల్ని మెచ్చుకోనప్పుడు... మనం ఎలా మాట్లాడతాం? మన సంభాషణ అద్దంలా మారి... మన మనసు స్థిరంగా ఉందో, కలత చెందిందో, దాపరికం లేకుండా ఉందో, రక్షణాత్మకంగా ఉందో, వినయంతో ఉందో లేదా దానిమీద అహం ఆధిపత్యం చెలాయిస్తోందో మనకు తెలియజేస్తుంది. ‘హార్ట్‌ఫుల్‌నె్‌స’లో ‘అహింసాత్మక సంభాషణ’ అనే భావన ఉంది. మనం సాధారణంగా హింసను శారీరక దాడితో ముడిపెడతాం. కానీ ఒక వ్యంగ్యమైన వ్యాఖ్య, అవమానకరమైన మాట, నిర్లక్ష్యపు ధోరణి, ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడం, ఎదుటివారిపై ముద్ర వేయడం, వారి వైఖరిపై తీర్పు చెప్పడం, శిక్షించాలనే ఉద్దేశంతో పాటించే మౌనం... ఇలా హింస అనేక సూక్ష్మమైన రూపాల్లో ఉండవచ్చు. మాటలు కనిపించే గాయాలను కలిగించలేవు. కానీ కంటికి కనిపించని గాయాన్ని సృష్టించగలవు. కాబట్టి అహింసాత్మక సంభాషణ అంటే కేవలం... మర్యాదగా మాట్లాడడం మాత్రమే కాదు. ‘మరొక వ్యక్తిని బాధపెట్టకూడదు’ అనే వాస్తవికమైన అంతర్గత స్థితిని పెంపొందించుకోవడం.


భావోద్వేగ పరిపక్వత

తన మార్గదర్శకుల బోధల నుంచి, మార్షల్‌ రోసెన్‌బర్గ్‌ అభివృద్ధి చేసిన ‘అహింసాయుత సంభాషణ సూత్రాల’ నుంచి స్ఫూర్తిని పొంది... ‘హార్ట్‌ఫుల్‌ కమ్యూనికేషన్‌’ అనే భావనను ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ అభివృద్ధి చేసింది. నిందలు, విమర్శలను శ్రద్ధ, గౌరవంతో కూడిన సంభాషణలుగా మార్చడం దీని ఉద్దేశం. ఇది చాలా సరళమైన అభ్యాసం. ప్రతిస్పందించేముందు ఆగండి. తీర్పు చెప్పే ముందు వినండి. సలహా ఇచ్చేముందు అర్థం చేసుకోండి. నిందించే బదులు అభిప్రాయాన్ని తెలపండి. అవమానించడానికి బదులు సరిదిద్దండి. అగౌరవపరచకుండా విభేదించండి. అవసరమైనప్పుడు దృఢంగా మాట్లాడండి.... కానీ ద్వేషంతో కాదు. మనం చెప్పినదే సరైనదని నిరూపించుకోవాలనే తపన కారణంగానే... మన సంభాషణ చాలావరకూ హింసాత్మకంగా మారుతుంది. అహం విజయాన్ని కోరుకుంటుంది. హృదయం సామరస్యాన్ని కోరుకుంటుంది. అంతమాత్రాన అన్యాయాన్ని సహించనక్కరలేదు. ఏదైనా తప్పు జరిగినప్పుడు మౌనంగా ఉండనక్కర్లేదు. మనం అవమానించకుండా ‘కాదు అని మనం చెప్పగలం. ఖండించకుండా సరిదిద్దగలం. కించపడకుండా విభేదించగలం. ద్వేషం లేకుండా హద్దులను ఏర్పరచుకోగలం. అదే భావోద్వేగ పరిపక్వత.

డాక్టర్‌ శరత్‌రెడ్డి,

కార్డియాలజిస్ట్‌ ట్రైనర్‌ హార్ట్‌ఫుల్‌నెస్‌,

9440087532

ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 11 , 2026 | 04:33 AM