Share News

గురువును ఎలా ఎంచుకోవాలి?

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:13 AM

సందేహం ఎప్పుడూ మంచి విషయాల గురించే వస్తుంది. కోపాన్ని, ద్వేషాన్ని ఎవరూ సందేహించరు. ఎవరైనా ‘‘నిన్ను ద్వేషిస్తున్నాను’’ అని అంటే ‘‘నిజంగానా?’’ అని అడగరు. కానీ ‘‘నిన్ను ఎంతో...

 గురువును ఎలా ఎంచుకోవాలి?

చింతన

సందేహం ఎప్పుడూ మంచి విషయాల గురించే వస్తుంది. కోపాన్ని, ద్వేషాన్ని ఎవరూ సందేహించరు. ఎవరైనా ‘‘నిన్ను ద్వేషిస్తున్నాను’’ అని అంటే ‘‘నిజంగానా?’’ అని అడగరు. కానీ ‘‘నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను’’ అంటే పూర్తిగా నమ్మడానికి మనసు సంకోచిస్తుంది. గురువు విషయంలోనూ అంతే! గురువు ప్రేమకు, జ్ఞానానికి సజీవ స్వరూపం. కాబట్టి గురువు గురించి కూడా కొన్నిసార్లు సందేహం కలుగవచ్చు. ఎప్పుడూ కాకపోయినా... అప్పుడప్పుడు రావడం సహజం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... పన్నెండేళ్ళకు ఒకసారి గురుగ్రహం తన ప్రభావంలో బలహీనమైన దశలోకి ప్రవేశిస్తుంది. జ్ఞానానికి, ధర్మానికి, మార్గదర్శకత్వానికి ప్రతీక అయిన గురుగ్రహానికి ఆ సమయంలో శక్తి తగ్గినట్టు భావిస్తారు. దాని ప్రభావంవల్ల మనసు సందేహాలతో నిండిపోవచ్చు, శరీరం బలహీనంగా అనిపించవచ్చు లేదా అనారోగ్యానికి లోనుకావచ్చు.. కానీ అది తాత్కాలికమైన దశ మాత్రమేనని జ్ఞానులు తెలుసుకుంటారు. కొంతకాలం తరువాత ఆ దశ తొలగిపోతుంది. గురువు విషయంలోనూ అంతే.

మీ హృదయమే చెబుతుంది...

ప్రాచీన కాలంలో పిల్లలు గురుకులంలో ప్రవేశించినప్పుడు... వారి స్వభావాన్ని, సామర్థ్యాన్ని ఆచార్యులు ముందుగా పరిశీలించేవారు. తరువాత ఎవరు సంగీతాన్ని, ఎవరు గణితాన్ని, ఎవరు వేదాలను, ఆయుర్వేదాన్ని లేదా ఇతర విద్యలను అభ్యసించాలో నిర్ణయించేవారు. ఈ విధంగా చిన్నారుల్లో ప్రతి ఒక్కరూ తమ స్వభావానికి అనుగుణమైన మార్గాన్ని ఎంచుకొనేవారు. అయితే ఇది చిన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది, పెద్దవారికి కాదు. మరి మనం గురువును ఎలా ఎంచుకోవాలి? ఒకసారి మీరు జ్ఞాన మార్గంలో ప్రవేశించిన తరువాత ‘‘ఇదే నాకు సరైన స్థలం. ఈయనే నా గురువు’’ అని చెప్పేది మీ హృదయమే. ఆ విధంగానే మీరు ఒకరిని గురువుగా స్వీకరిస్తారు. గురువు వచ్చి ‘‘నేనే నీ గురువును’’ అని ఎప్పుడూ చెప్పడు. అలా ఎవరైనా చెబితే... దాన్ని నమ్మకండి. గురువును మీ మీద ఎవరూ రుద్దలేరు. ఆ అనుభూతి మీ అంతరంగం నుంచే ఆవిర్భవించాలి. మీ హృదయమే ఆ వ్యక్తి నిజాయితీని, ఆధ్యాత్మికతను గుర్తిస్తుంది. మీరు ఒకరిని గురువుగా అంగీకరించిన క్షణం నుంచే మీలోని బాధ, సందేహం చాలావరకూ కరిగిపోతాయి. జీవిత ప్రయాణంలో మీరు ఒంటరివారు కాదనే విశ్వాసం మీలో బలపడుతుంది. కొంతమంది కొన్ని సందర్భాలలో తమ గురువును సందేహిస్తారు. తమ కోరికలను నెరవేర్చుకోవడానికి గురువును ఒక సాధనంగా భావించినప్పుడు, గురువు తమకోసం కొన్ని అద్భుతాలు చేయగలరా? అని పరీక్షించినప్పుడు లేదా తమ చర్యలకు గురువును ఒక సాకుగా ఉపయోగించినప్పుడు అలాంటి సందేహాలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసం దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. కానీ నిజమైన విశ్వాసం, సత్యం ఎప్పుడూ దెబ్బతినవు. విచ్ఛిన్నమయ్యేది మన తప్పుడు ఆశలు, అవాస్తవికమైన అంచనాలే.


ఆ అనుబంధాన్ని అనుభవించాలి...

మనల్ని భయం నుంచి దూరం చేయడానికి కొద్దిపాటి ప్రేమయినా, మార్గదర్శకత్వమైనీ సరిపోతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో గురువు అవసరమని చెబుతారు. ముఖ్యంగా, గురువుతో ఒక అనుబంధాన్ని అనుభవించడం అవసరం. లేకపోతే మన హృదయంలో బాధ, అనిశ్చితి, భయం అలాగే మిగిలిపోతాయి. గురువుతో లేదా జ్ఞానంతో మీకు అనుబంధం ఏర్పడినప్పుడు, గురువు మిమ్మల్ని సరైన దారిలో నడిపిస్తున్నారనే విశ్వాసం కలిగినప్పుడు... మీలో ప్రశాంతత నెలకొంటుంది. ఆ శాంతితో మీ హృదయం నిండిపోతుంది.. మధ్యమధ్యలో సందేహాలు వచ్చినా... అవి ఎక్కువసేపు నిలవవు. మీరు ఒంటరివారు కాదనే భరోసా ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. అప్పుడు, నిరాశతో వచ్చిన కన్నీళ్ళు... కృతజ్ఞతతో నిండిన ఆనందబాష్పాలుగా ఎలా మారుతాయో మీరు స్వయంగా అనుభూతి చెందుతారు.

శ్రీశ్రీరవిశంకర్‌

గురువు కలిగించే అయిదు ప్రయోజనాలను ఉపనిషత్తులు పేర్కొన్నాయి, అవి: జ్ఞాన రక్షణ (జ్ఞాన రక్ష... గురువు సన్నిధిలో జ్ఞానం వికసిస్తుంది). దుఃఖ క్షయం (దుఃఖం క్రమంగా తొలగిపోతుంది). సుఖ ఆవిర్భావం (ఎటువంటి కారణం లేకుండానే ఆనందం ఉప్పొంగుతుంది). సమృద్ధి (సమృద్ధి కలుగుతుంది). సర్వ సంవర్ధన (మనలోని అన్ని ప్రతిభలు వికసిస్తాయి).

ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 05:13 AM