హృదయం నేర్పే పాఠం
ABN , Publish Date - Feb 13 , 2026 | 02:26 AM
మరణం చాలా అరుదుగా తన రాకను ప్రకటిస్తుంది. అది చాలాసార్లు రెండు హృదయ స్పందనల మధ్య, రెండు శ్వాసల మధ్య వస్తుంది. కార్డియాలజిస్టుగా నేను ఆసుపత్రి పడకల పక్కన...
మరణం చాలా అరుదుగా తన రాకను ప్రకటిస్తుంది. అది చాలాసార్లు రెండు హృదయ స్పందనల మధ్య, రెండు శ్వాసల మధ్య వస్తుంది. కార్డియాలజిస్టుగా నేను ఆసుపత్రి పడకల పక్కన నిలబడి ఉంటాను. అక్కడ మానిటర్లు వెలుగుతూ ఉంటాయి. కానీ ప్రాణం అప్పటికే నిష్క్రమించి ఉంటుంది. ‘హార్ట్‌ఫుల్‌నెస్’ శిక్షకుడిగా... సజీవంగా ఉన్నా అంతర్గతమైన భారంతో, అశాంతితో, మరణానికి భయపడుతున్న వ్యక్తులతో కూర్చుంటాను. మరణం అంటే కేవలం వైద్యపరమైన సంఘటన కాదని ఈ రెండు సందర్భాలు నాకు నేర్పాయి.
హృదయం మాట వినాలి
తీవ్రమైన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఒక మధ్య వయస్కుడు నాకు గుర్తున్నారు. యాంజియోప్లాస్టీ, మందులు, అత్యవసర పర్యవేక్షణ... ఇలా సాంకేతికంగా వీలైన ప్రతిదాన్నీ చేసేం. అయినప్పటికీ అతను స్పృహతో ఉన్న చివరి క్షణాల్లో తన రిపోర్టుల గురించో, వైద్యప్రక్రియల గురించో అడగలేదు. ‘‘డాక్టర్, నేను ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు. నా హృదయం చెప్పిన మాట ఎన్నడూ వినలేదు’’ అన్నాడు. అతని గుండె అకస్మాత్తుగా విఫలం కాలేదు. అపరిమితమైన ఒత్తిడి, భావోద్వేగాలను అణచివేయడం, నిరంతరమైన మానసిక కల్లోలం కారణంగా అది ఏళ్ళ తరబడీ అలసిపోయింది. హృదయంలో పేరుకుపోయిన ముద్రలు దాన్ని బరువుగా మారుస్తాయని ‘హార్ట్‌ఫుల్‌నె్‌స’లో మేము చెబుతాం. దాన్ని ‘స్ట్రెస్ ఓవర్‌లోడ్’ అని వైద్యం పిలుస్తుంది. నేడు గుండె జబ్బుల మరణాల్లో చాలావరకూ అంతుపట్టనివేమీ కాదు. అవి దీర్ఘకాలికమైన అంతర్గత అసమతుల్యత తాలూకు ఫలితం. గుండె కొలస్ట్రాల్‌కూ, రక్తపోటుకూ మాత్రమే కాదు... భయం, కోపం, క్రమబద్ధంకాని భావోద్వేగాలకు కూడా స్పందిస్తుంది.
జీవితం ఒక ప్రవాహం
‘హార్ట్‌ఫుల్‌నెస్’ సిద్ధాంతం గుండెను మానవ అస్తిత్వానికి మధ్యలో నిలుపుతుంది.. కేవలం ఒక పంపుగా కాదు, స్పృహకు సంబంధించిన కేంద్రంగా. గుండె భారంగా ఉన్నప్పుడు జీవితం భారమవుతుంది. గుండె తేలికగా ఉంటే అనారోగ్యాన్ని కూడా చులాగ్గా ఎదుర్కొంటుంది. ఒకప్పుడు అడ్వాన్స్‌డ్ హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స చేశాను. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, అయినా ఆయన భయాన్ని ప్రదర్శించలేదు. అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారని అడిగాను. ‘‘నేను నా హృదయంతో గడపడం నేర్చుకున్నాను. జరగాల్సింది జరుగుతుంది’’ అన్నారు చిరునవ్వుతో. ఈ అంగీకారం పరిత్యాగం కాదు. అది సమర్పణ. ‘హార్ట్‌ఫుల్‌నె్‌స’లో ఒక ప్రధాన సూత్రం. అతని భౌతికమైన గుండె బలహీనంగా ఉంది, కానీ అంతర్గతమైన హృదయం నిర్మలంగా ఉంది. హార్ట్‌ఫుల్‌నెస్’ ధ్యానంలో మేము ఆలోచనలతోనో, భావోద్వేగాలతోనో పోరాటం చేయం. సౌమ్యంగా గమనించి, అంతర్గతమైన శుద్ధి జరగడానికి వీలు కలిగిస్తాం. హృదయాన్ని ఇలా రోజువారీగా శుభ్రపరిస్తే.... మరణ భయంతో సహా భయాలన్నీ మెల్లగా తొలగిపోతాయి. మరణం మనల్ని భయపెడుతుంది. ఎందుకంటే నియంత్రణ, గుర్తింపు, అసంపూర్ణమైన కోరికలను మనం అంటిపెట్టుకొని ఉంటాం. ఆ అతుక్కుపోవడాన్ని ధ్యానం సడలిస్తుంది. కాలక్రమేణా... జీవితం స్వాధీనత కాదనీ, ప్రవాహం అనీ మన అనుభవంలోకి వస్తుంది.
అప్పుడు అది అపరిచితం కాదు...
ప్రతి ధ్యానం ఒక చిన్న మరణం... భావోద్వేగాలను, భారాలను, అశాంతిని, అహంకారాన్ని వదులుకోవడం. ఈ అంతర్గతమైన మరణం క్రమం తప్పకుండా జరిగినప్పుడు.... శారీరకమైన మరణం ఇక ఏమాత్రం అపరిచితమైనది కాదు. దిగ్ర్భాంతి కలిగించదు. వైద్యులుగా... మరణాన్ని జాప్యం చేయడం కోసం మేము శిక్షణ తీసుకున్నాం. కానీ మానవులుగా... హృదయాన్ని ఎలా సిద్ధం చేయాలో కూడా నేర్చుకోవాలి. నిశ్శబ్దం హృదయానికి పోషణను ఇస్తుంది. భావోద్వేగమైన పరిశుభ్రత దాన్ని తేలిక పరుస్తుంది. స్వచ్ఛమైన హృదయం విభిన్నంగా వృద్ధాప్యం చెందుతుంది... అది ప్రశాంతంగా నిష్క్రమిస్తుంది. మరణం జీవితానికి వ్యతిరేకం కాదు. అది ‘జీవితం’ అనే ఒక అనుభవానికి ముగింపు. జీవితానికి హృదయం మార్గనిర్దేశం చేసినప్పుడు, ధ్యానం ద్వారా మద్దతు ఇచ్చినప్పుడు... మరణం ఒక శత్రువులా రాదు. అది నిశ్శబ్దంగా, గౌరవంగా... చక్కగా బాణీ కట్టిన
శ్రావ్యమైన గీతపు చివరి స్వరంలా వస్తుంది. తేలికగా జీవించిన ఒక హృదయం చివరి స్పందనలో ఇబ్బంది పడదు.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్,
ట్రైనర్, హార్ట్‌ఫుల్‌నెస్. 9440087532
ఇవి కూడా చదవండి..
114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు