Share News

శాంతి జనించాల్సింది అక్కడే!

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:56 AM

దేశాల మధ్య సంఘర్షణలు, యుద్ధాలు, భౌగోళికమైన రాజకీయ ఉద్రిక్తతల గురించి ఇప్పడు మనం నిత్యం వార్తలు వింటున్నాం. ఇవి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని, భయాందోళనలను కలిగించే వాతావరణాన్ని...

శాంతి జనించాల్సింది అక్కడే!

యోగా

దేశాల మధ్య సంఘర్షణలు, యుద్ధాలు, భౌగోళికమైన రాజకీయ ఉద్రిక్తతల గురించి ఇప్పడు మనం నిత్యం వార్తలు వింటున్నాం. ఇవి ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని, భయాందోళనలను కలిగించే వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.. మన దైనందిన జీవితాలకు ఇవి దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ ఈ సంఘటనల ద్వారా కలిగే మానసికమైన, భావోద్వేగమైన ప్రభావం మన ఆలోచనల్లోకి, హృదయాలలోకి నిశ్శబ్దంగా చొచ్చుకుపోతుంది. కేవలం కొలస్ట్రాల్‌, రక్తపోటు, జీవనశైలి అలవాట్ల వల్ల మాత్రమే కాదు... భావోద్వేగ, మానసిక స్థితుల వల్ల కూడా మానవ హృదయం తీవ్రంగా ప్రభావం అవుతుంది. ఈ విషయాన్ని ఒక కార్డియాలజిస్టుగా నేను తరచూ గమనిస్తున్నాను. ఆందోళన, భయం, దీర్ఘకాలికమైన ఒత్తిడి... ఇవన్నీ మన హృదయనాళ వ్యవస్థలో సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తాయి. యుద్ధం గురించి వచ్చే వార్తలతో, అనిశ్చితితో, సోషల్‌ పోలరైజేషన్‌తో నిండిన నేటి ప్రపంచం ప్రజలలో అశాంతి పెరగడానికి దారితీస్తోంది. నిరంతరమైన మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరగడం, గుండె లయ క్రమం తప్పడం, నిద్రలో ఆటంకాలు, రోగనిరోధకశక్తి బలహీనపడడం లాంటివి జరుగుతాయనీ, గుండె జబ్బు తలెత్తే ప్రమాదం కూడా పెరుగుతోందని వైద్యశాస్త్రం మరింత ఎక్కువగా గుర్తిస్తోంది. మనసుకు, గుండెకు దగ్గర సంబంధం ఉంది. మనసు అశాంతిగా ఉంటే... ఆ ప్రభావం గుండె మీద ఉంటుంది.

శక్తిమంతమైన ఒక ప్రార్థన

ప్రపంచ శాంతి కేవలం భౌతిక పరిణామం మాత్రమే కాదు. దేశాల మధ్య మనం చూస్తున్న బాహ్యమైన సంఘర్షణలు వ్యక్తులలోని అంతర్గత సంఘర్షణలను కూడా తరచుగా ప్రతిబింబిస్తాయి. భయం, అహం, దురాశ, అభద్రత మానవుల మీద ఆధిపత్యం వహించినప్పుడు... ఆ భావోద్వేగాలు సామూహిక మానవ ప్రవర్తనలో, కొన్నిసార్లు దేశాల స్థాయిలో కూడా వ్యక్తమవుతాయి. శాశ్వతమైన శాంతి బయటినుంచి కాదు... మానవ హృదయంలోంచి ఉద్భవించాలి. ఇలాంటి సందర్భంలోనే హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యానం, ప్రార్థన లాంటి అభ్యాసాలు గాఢమైన లోదృష్టిని అందిస్తాయి. ప్రతి రాత్రి నిద్రకు ముందు చేసే శక్తిమంతమైన ఒక ప్రార్థనను హార్ట్‌ఫుల్‌నెస్‌ సంప్రదాయం అందించింది. అది... ‘‘ఓ గురుదేవా! మానవ జీవితానికి నిజమైన లక్ష్యం నీవే. మేము ఇప్పటికీ కోరికలకు బానిసలం. తద్వారా మా పురోగతికి ఆటంకం కలిగించుకుంటున్నాం. అత్యున్నతమైన దశకు మమ్మల్ని తీసుకువెళ్ళే ఏకైక దైవం, శక్తి నీవే.’’ - ఈ ప్రార్థన కేవలం ఒక ఆచారం కాదు... మన పరిమితులను, మన కోరికలను, ప్రతి మానవునిలో ఉండే అంతర్గతమైన సామరస్యాన్ని, ఉన్నతమైన చైతన్యం వైపు పరిణామం చెందాలనే గాఢమైన ఆకాంక్షను ఇది గుర్తు చేస్తుంది.


సున్నితమైన ఆకాంక్ష

యుద్ధాలు, సంఘర్షణలు ప్రపంచ చర్చల్లో ఆధిపత్యం వహిస్తున్న ప్రస్తుత కాలంలో... ఈ ప్రార్థన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని హృదయాలు ప్రేమతో, శాంతితో నిండి ఉన్నాయనే భావనతో మనం ధ్యానించినప్పుడు... సంఘర్షణకు దారి తీసే భయం, ద్వేషం, విభజన లాంటి శక్తులను నిశ్శబ్దంగా ఎదుర్కోగలం. హృదయపూర్వకమైన ప్రతి ప్రార్థన సమష్టి సామరస్యానికి దోహదకారిగా మారుతుంది. ఈ కోణంలో చూస్తే... హార్ట్‌ఫుల్‌నెస్‌ ప్రార్థన కేవలం వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, సున్నితమైన ఆకాంక్ష కూడా. ప్రపంచ పరివర్తన మానవ హృదయ పరివర్తనతో ప్రారంభం అవుతుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. ధ్యానం దృక్పథం నుంచి చూస్తే... ధ్యాన అభ్యాసాలు నాడీ వ్యవస్థను శాంతపరుస్తాయి. శ్వాస పద్ధతులను నియంత్రిస్తాయి. ఒత్తిడి కలిగించే హార్మోన్లను తగ్గిస్తాయి. భావోద్వేగపరమైన స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయి. శరీర ధర్మ శాస్త్రాన్ని (ఫిజియాలజీ)ని దాటి, నేటి ప్రపంచంలో ఎంతో అవసరమైన సహానుభూతిని, కరుణను, బాధ్యతను పెంపొందిస్తాయి. వ్యక్తుల హృదయాలలో శాంతి ఉన్నప్పుడే ప్రపంచంలో శాంతి వస్తుందని దాజీ స్పష్టం చేశారు. రోజూ ప్రపంచంలో లక్షలాదిమంది వ్యక్తులు కొన్ని నిమిషాలైనా... మొత్తం ప్రపంచానికి శాంతి, సామరస్యం కలగాలని హృదయపూర్వకంగా కోరుకున్నట్టు ఊహించుకోండి. మానవ చైతన్యాన్ని మార్చే శక్తి అలాంటి సమష్టి ఆకాంక్షకు ఉంది. యుద్ధాలు మనుషుల మనసుల్లో పుడతాయని చరిత్ర వ చెబుతోంది. కాబట్టి శాంతి కూడా అక్కడే పుట్టాలి.

అంతర్గత సామరస్యం

ధ్యానం, ప్రార్థన ద్వారా తమ అంతర్గత కల్లోలాన్ని అణచివేయడాన్ని వ్యక్తులు నేర్చుకున్నప్పుడు... వారు తక్కువ ప్రతిస్పందనతో, మరింత కరుణతో, ఇతరులను అర్థం చేసుకొనే సామర్థ్యంతో ఉంటారు. అప్పుడు కుటుంబాలు ప్రశాంతంగా మారుతాయి. సమాజాలు మరింత సహకరించుకుంటాయి, మరింత మానవీయంగా ఉంటాయి. ప్రపంచ శాంతి కేవలం దౌత్యపరమైన విజయం కాదు, అది మానవత్వం తాలూకు అంతర్గత స్థితికి ప్రతిబింబం. ఒక వైద్యుడిగా ప్రజారోగ్యం, అంతర్గత శాంతి విడదీయరానివని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రశాంతమైన మనసు... హృదయం ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన హృదయాలు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తాయి. ‘శాంతి అంటే యుద్ధం లేకపోవడం కాదు, మన హృదయంలో సామరస్యం ఉండడం’ అని హార్ట్‌ఫుల్‌నెస్‌ ప్రార్థన మనకు గుర్తు చేస్తుంది. ధ్యానం ద్వారా, ప్రార్థన ద్వారా అంతర్గత సామరస్యాన్ని వ్యక్తులు పెంపొందించుకున్నప్పుడు... వారు తమకు తెలియకుండానే, నిశ్శబ్దంగా ప్రపంచ శాంతికి రాయబారులు అవుతారు. ప్రతి వ్యక్తిలోనూ మరింత సామరస్యమైన ప్రపంచం కోసం దోహదపడే సామర్థ్యం ఉంటుంది. ప్రపంచ శాంతి... మానవ హృదయంలోని శాంతితో ఆరంభమవుతుంది. కొన్నిసార్లు నిశ్శబ్దంలో గుసగుసలాడే సరళమైన ప్రార్థన సైతం ప్రపంచ సామరస్యానికి బీజంగా మారుతుంది.

డాక్టర్‌ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్‌,

ట్రైనర్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌. 9440087532

ఇవి కూడా చదవండి

ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..

IPL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 12:56 AM