Share News

తల్లి పాలు తక్కువ కాకుండా...

ABN , Publish Date - Aug 04 , 2026 | 03:33 AM

బిడ్డకు తల్లిపాలు అమృత సమానం. కాబట్టి ఆ అమృతంలో కొరత రానివ్వకుండా, అందుకు అడ్డుపడే కారణాలను కూడా సకాలంలో సరిదిద్దుకోవాలి. అప్పుడే తల్లీ బిడ్డల ఆరోగ్యం...

తల్లి పాలు తక్కువ కాకుండా...

బిడ్డకు తల్లిపాలు అమృత సమానం. కాబట్టి ఆ అమృతంలో కొరత రానివ్వకుండా, అందుకు అడ్డుపడే కారణాలను కూడా సకాలంలో సరిదిద్దుకోవాలి. అప్పుడే తల్లీ బిడ్డల ఆరోగ్యం నిక్షేపంగా ఉంటుందని అంటున్నారు వైద్యులు.

ఆగష్టు 1 - 7, వరల్డ్‌ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ వీక్‌

పిల్లలకు ఇన్‌ఫెక్షన్లు సులభంగా సోకుతాయి కాబట్టి తల్లులు, బ్రెస్ట్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే! అలాగని అందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు పాటించవలసిన అవసరం లేకపోయినా, శుభ్రంగా స్నానం చేయడం తప్పనిసరి. అదనంగా క్రీములు, పౌడర్లు, పరిమళాలు వాడుకోవలసిన అవసరం లేదు. వాడుకోకూడదు కూడా! వీలైనంత వరకూ బ్రెస్ట్‌ను పొడిగా ఉంచుకోవాలి. బిడ్డకు పాలిచ్చే ముందు, కొన్ని పాలు తీసుకుని నిపుల్‌కు మర్దన చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల చనుమొనలు పొడిబారిపోయి, చిట్లిపోకుండా ఉంటాయి.

బ్రెస్ట్‌ ఫీడింగ్‌ పట్ల అవగాహన ముఖ్యం

బిడ్డకు పాలివ్వడం, సహజసిద్ధ చర్య అయినప్పటికీ, తల్లికీ బిడ్డకూ అసౌకర్యం కలగకుండా, బిడ్డ ఆకలి తీరేలా పాలిచ్చే పద్ధతుల గురించి గర్భిణిగా ఉన్నప్పటి నుంచే అవగాహన ఏర్పరుచుకోవాలి. అందుకోసం ప్రముఖ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండే లాక్టేషన్‌ కన్సల్టెంట్స్‌ను కలవొచ్చు. వీళ్లను కలవడం వల్ల, ప్రసవం తర్వాత, చనుమొనల్లో సమస్యలు, బిడ్డకు పాలివ్వడంలో ఇబ్బందులను ప్రారంభంలోనే కనిపెట్టి వాటిని సరిదిద్దుకునే వీలు కలుగుతుంది. కొందరికి రొమ్ము పరిమాణం బిడ్డ పాలు తాగడానికి అనుకూలంగా లేకపోవచ్చు, ఇంకొందరికి ఇన్వర్టెడ్‌ నిపుల్స్‌ ఉండొచ్చు. ఇంకొందరికి పాల గురించే పలు రకాల అనుమానాలు ఉండొచ్చు.

కొలస్ట్రమ్‌: ప్రసవమైన వెంటనే పాలు ధారగా కారిపోవు. మొదట్లో ఒకట్రెండు రోజుల పాటు ‘కొలస్ట్రమ్‌’ అనే చుక్కల రూపంలో చిక్కని ద్రవం బయటకొస్తుంది. ఇది బిడ్డకెంతో విలువైనది. ఈ పాలను పిండి పారేయకుండా, తప్పనిసరిగా బిడ్డకు పట్టించాలి.

బిడ్డ పొజిషన్‌: పాలిచ్చే ముందు సౌకర్యవంతమైన ప్రదేశంలో, సౌకర్యవంతంగా కూర్చుని, ఆ తర్వాతే బిడ్డను ఒళ్లోకి తీసుకోవాలి. వెన్నుకు ఆసరా ఉండేలా చూసుకుని, కాస్త వెనక్కి వాలి బిడ్డకు పాలివ్వాలి.

రొమ్ముల్లో సమస్యలు

కొత్త తల్లుల్లో బిడ్డకు పాలిచ్చే పద్ధతులు, రొమ్ముల్లో తలెత్తే సమస్యల గురించిన అవగాహన ఉండదు. కానీ వీటి గురించి ముందే తెలుసుకుని ఉండడం మంచిది.

చనుమొనలు చిట్లడం: బిడ్డ చనుమొనను మాత్రమే నోట్లోకి తీసుకుంటే సరిపోదు. చనుమొనతో పాటు చుట్టూరా ఉండే ఏరియోలాను నోట్లోకి తీసుకుని, పాలు తాగేలా చూసుకోవాలి. చనుమొననే నోట్లోకి తీసుకుని పాలు తాగడం వల్ల దాని చుట్టూరా ఉన్న చర్మం చిట్లిపోయి, బిడ్డకు పాలివ్వడం ఇబ్బందికరంగా మారిపోతుంది.

పాల గడ్డలు: రొమ్ములో పాలు నిల్వ ఉండిపోయి, గడ్డలు కట్టే పరిస్థితి ఇది. ఇలా నిల్వ ఉండిపోయు, గడ్డలు కట్టే వీల్లేకుండా, అదనంగా రొమ్ములో మిగిలిపోయిన పాలను ఎప్పటికప్పుడు పిండి, బిడ్డ కోసం నిల్వ చేసుకోవాలి. రొమ్ములో పాలు గడ్డలు కట్టినప్పుడు హాట్‌ కంప్రెషన్‌ వాడుకోవాలి. దాంతో గడ్డలు కొంతమేరకు కరుగుతాయి. గడ్డలు మరీ ఇబ్బందికరంగా మారినప్పుడు వైద్యులను కలవాలి. ఇలాంటి సందర్భాల్లో వైద్యులు, రొమ్ముల్లోని పాలు బయటకు వచ్చేయడానికి ప్రేరేపించే ఆక్సిటోసిన్‌ను వాసన చూపిస్తారు. ఇన్‌ఫెక్షన్‌ మొదలై, మాస్టైటి్‌సకు దారి తీస్తే, యాంటీబయాటిక్స్‌ తీసుకోవాల్సి వస్తుంది. అరుదుగా కొందరికి చిన్న సర్జరీ అవసరమవుతుంది.


ఇన్వర్టెడ్‌ నిపుల్స్‌: సాధారణంగా ప్రసవానంతరం చనుమొనలు బయటకొచ్చేస్తాయి. అరుదుగా కొందరికి లోపలకు ముడుచుకుపోయి ఉన్నప్పుడు, చేత్తో లాగే ప్రయత్నం చేయకూడదు. బదులుగా నిపుల్‌ పుల్లర్‌ సహాయంతో బిడ్డకు పాలిచ్చే ప్రయత్నం చేయాలి. నిపుల్‌ షీల్డ్‌ కూడా ఇందుకు బాగా ఉపయోగపడుతుంది.

పాలు పెరగడం కోసం...

కొందరు తల్లుల దగ్గర బిడ్డకు సరిపడా పాలు ఉండవు. అలాంటి సందర్భాల్లో... మెంతులు, మునగాకు, సోంపు, జీలకర్ర, వెల్లుల్లి, హలీమ్‌ విత్తనాలు, నువ్వులు, ఓట్స్‌, బార్లీ, రాగులు, పప్పుదినుసులు, ఆకుకూరలు, నట్స్‌, డ్రైఫ్రూట్స్‌ ఆహారంలో చేర్చుకోవాలి. వెల్లుల్లిని నేతిలో వేయించి తినడం, వెల్లుల్లి రసం, జీరా వాటర్‌ తాగడం, మెంతుల లడ్డు, హలీమ్‌ పాయసం, నువ్వుల లడ్డు, రాగి మాల్ట్‌, మునగాకు పప్పు, పెసరపప్పు కిచిడి, గోండ్‌ లడ్డు మొదలైన బలవర్థకమైన పదార్థాలన్నీ ప్రసవానంతరం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ పదార్థాల్లో ప్రొటీన్‌తో పాటు ఐరన్‌, క్యాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పిల్లలకు పాలిచ్చే తల్లులు, పలురకాల పప్పుదినుసులు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు, విత్తనాలు తీసుకోవాలి.

డాక్టర్‌ కె. భార్గవి రెడ్డి

కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజీ,

బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 03:33 AM