Share News

రైడ్స్‌తో... రయ్‌ రయ్‌

ABN , Publish Date - Mar 09 , 2026 | 03:23 AM

అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో రైడ్‌ ఆపరేటర్‌ వృత్తుల్లో సాధారణంగా పురుషులే కనిపిస్తూ ఉంటారు. కానీ ఇవే వృత్తుల్లో అంతే సమానంగా రాణిస్తూ, తమ ప్రతిభను చాటుకుంటున్నారు...

రైడ్స్‌తో... రయ్‌ రయ్‌

అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో రైడ్‌ ఆపరేటర్‌ వృత్తుల్లో సాధారణంగా పురుషులే కనిపిస్తూ ఉంటారు. కానీ ఇవే వృత్తుల్లో అంతే సమానంగా రాణిస్తూ, తమ ప్రతిభను చాటుకుంటున్నారు వండర్‌లా మహిళా రైడ్‌ ఆపరేటర్లు. అప్రమత్తత, భద్రతలే ప్రధానంగా సాగే జాయ్‌ రైడ్స్‌ నిర్వహణలో సత్తా చాటుకుంటున్న రైడ్‌ ఆపరేటర్స్‌ను నవ్య కలిసింది. ఆ వృత్తి అనుభవాలు వాళ్ల మాటల్లోనే...

వృత్తిపరమైన సంతృప్తికి కొదవ లేదు

మాది ఇబ్రహీం పట్నం దగ్గర పోల్కంపల్లి. 2022 సెప్టెంబరులో వండర్‌లా రైడ్‌ ఆపరేటర్‌గా చేరాను. ఇక్కడ ఆపరేటర్లు అందరూ యువతులే! అయితే ప్రతి రైడ్‌ ఆపరేటర్‌ నెలకోసారి రైడ్‌ మారిపోతూ ఉంటుంది. అలా పది నెలలు పది రకాల రైడ్స్‌ను నిర్వహిస్తూ ఉంటాం. మహిళలకు స్వతహాగానే పిల్లల పట్ల ఆపేక్ష ఉంటుంది. కాబట్టి పిల్లల రైడ్స్‌ను మహిళలకే పరిమితం చేశారు. ఇక్కడ ఉద్యోగం చేస్తూనే డిగ్రీ పూర్తి చేయగలిగాను. వండర్‌లా, ప్రయాణ సదుపాయాలు, నామమాత్రపు రుసుముతో భోజన సదుపాయాలను కూడా అందిస్తోంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ వృత్తిలోనే కొనసాగాలని అనుకుంటున్నాను. పిల్లల రైడ్స్‌ కాబట్టి ఏ చిన్న ప్రమాదానికీ ఆస్కారం లేకుండా చూసుకోవాలి. అందుకోసం నెల రోజుల పాటు నిపుణుల దగ్గర శిక్షణ తీసుకున్నాం. శిక్షణ పూర్తయిన తర్వాత కూడా నెల రోజుల పాటు రైడ్స్‌ నిర్వహణను ప్రత్యక్షంగా గమనించి, ఆ తర్వాతే రైడ్‌ ఆపరేషన్‌కు అనుమతిస్తారు. రైడ్‌ ఆపరేటర్‌ మమ్మల్ని మేం కాపాడుకుంటూ, రైడ్స్‌ ఎక్కే పిల్లలను కాపాడుకోవడం మా విధి. రైడ్స్‌లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ను సంప్రతించి వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తూ ఉంటాం. నిజానికి ఆ పరిస్థితి ఇప్పటివరకూ తలెత్తలేదు.

పంది పల్లవి, పోల్కంపల్లి.


ప్రమాదాలకు తావుండదు

మాది రావిరాల గ్రామం. ఇంటర్‌ వరకూ చదువుకున్నాను. వండరల్‌లా ప్రారంభం నుంచి దీన్లో పని చేస్తున్నాను. రైడ్‌కు ముందు దాని పనితీరును, పరిసరాలనూ పరీక్షించుకుని రైడ్‌ ఆపరేటింగ్‌కు సిద్ధపడుతూ ఉంటాను. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో మాకు శిక్షణలో నేర్పించారు. చిన్న చిన్న సాంకేతిక సమస్యలను మేమే పరిష్కరించుకుంటూ ఉంటాం. ప్రతి రైడ్‌కూ ఎరుపు, పసుపుపచ్చ, నారింజ అలర్ట్‌ కోడ్స్‌ ఉంటాయి. అకస్మాత్తుగా రైడ్‌ ఆగిపోతే పసుపుపచ్చ కోడ్‌గా పరిగణించాలి. పరిస్థితి నియంత్రణ తప్పి గొడవలు జరిగితే నారింజ, రక్తం కారేంత పరిస్థితి తలెత్తితే దాన్ని ఎరుపు రంగు కోడ్‌గా పరిగణిస్తాం. వీటిలో ఏ పరిస్థితి తలెత్తినా రైడ్స్‌ దగ్గర అందుబాటులో చెకర్స్‌ ఉంటారు. ఒకవేళ పిల్లలు భయపడి గోలచేసినా, వెంటనే రైడ్‌ ఆపేసి, దింపేస్తూ ఉంటాం. పిల్లల భద్రత కోసం ఎత్తు పరిమితులను పాటిస్తాం. 85 సెంటీమీటర్ల కంటే తక్కువ, 140 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న పిల్లలను రైడ్స్‌కు అనుమతించం. నాకు ఇద్దరు పిల్లలు. మా వారు వాటర్‌ ప్లాంట్‌లో పని చేస్తారు. ఇక్కడ భద్రతకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఈ వృత్తిలోనే కొనసాగమని మా వారు ప్రోత్సహిస్తూ ఉంటారు.

బండారు మమత, రావిరాల

ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌తో...

2018లో రైడ్‌ ఆపరేటర్‌గా చేరాను. ఈ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ గురించి తెలిసి, ఫ్రెండ్‌తో కలిసి ఇక్కడకొచ్చాను. ఇద్దరం రైడ్‌ ఆపరేటర్స్‌గా కొనసాగినా, కొంత కాలానికి నా స్నేహితురాలు పెళ్లి చేసుకుని ఉద్యోగం మానేసింది. నేను ఇక్కడే కొనసాగుతున్నాను. డిగ్రీ పూర్తి చేశాను. ప్రస్తుతం ఎమ్‌బిఎ చేస్తున్నాను. పెద్దల రైడ్స్‌తో పోల్చితే, పిల్లల రైడ్స్‌ నిర్వహణ ఎక్కువ క్లిష్టం. పెద్దలు చెప్పిన మాట వింటారు. కానీ పిల్లలు ఎవరి మాటా వినరు. కాబట్టి రైడ్‌ తిరుగుతున్నంత సేపూ రెప్ప వాల్చకుండా గమనిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరినీ గమనిస్తూ ఉండాలి. అయినా కొందరు అల్లరి పిల్లలు దుందుడుగా వ్యవహరిస్తూ పరిగెత్తి కింద పడిపోవడం, ఢీకొనడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చిన్న చిన్న గాయాలు, దెబ్బలు తగిలినా తక్షణ చికిత్స కోసం మా దగ్గర ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ కూడా ఉంటుంది. ఈ వృత్తిలో ఎలాంటి ఒత్తిడులూ ఉండవు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇదే వృత్తిలో కొనసాగాలనే ఆలోచన ఉంది

ముదిగొండ సౌందర్య, ఇబ్రహీంపట్నం

0000-Navya.jpg


ప్రయాణ సదుపాయం ఉందని...

ట్రిపుల్‌ ఇ చదివాను. కానీ సిటీకి దూరంగా ఉంటున్నాను కాబట్టి చదువుకు తగిన ఉద్యోగంలో చేరాలంటే ఎక్కువ దూరం ప్రయాణాంచాల్సి వస్తుంది. పైగా వండర్‌లా ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ఉండడంతో ఇక్కడే రైడ్‌ ఆపరేటర్‌ ఉద్యోగాన్ని ఎంచుకున్నాను. 2023లో ఈ ఉద్యోగంలో చేరాను. ఇక్కడ పనిలో ఎలాంటి ఒత్తిడీ ఉండదు. పిల్లల రైడ్స్‌ ఆపరేట్‌ చేస్తాను కాబట్టి రోజంతా సరదాగా గడిచిపోతుంది. సెలవు రోజుల్లో బడి పిల్లలందరూ ఒకేసారి వండర్‌లాకు వచ్చేస్తూ ఉంటారు. దాంతో రైడ్స్‌ దగ్గర కూడా రద్దీ పెరిగిపోతుంది. ఆ సమయంలో టీచర్ల సహాయంతో పిల్లలను కట్టడి చేసి, జాగ్రత్తగా రైడ్స్‌ను నడిపిస్తూ ఉంటాను. పిల్లలు ఎన్నిసార్లైనా రైడ్స్‌ ఎక్కొచ్చు. కొంతమంది మళ్లీ మళ్లీ రైడ్స్‌ ఎక్కాలని గోల చేస్తారు. అయినా విసుక్కోకుండా పిల్లలను ఎక్కించి రైడ్స్‌ తిప్పుతూ ఉంటాను.

గజ్జె అనిత, బిఎన్‌రెడ్డి నగర్‌

మొదట్లో భయపడినా...

మాది ఖమ్మం దగ్గర సత్తుపల్లి. ప్రస్తుతం కోకో కప్‌ రైడ్‌ను ఆపరేట్‌ చేస్తున్నాను. 2023 మార్చిలో ఈ ఉద్యోగంలో చేరాను. మొదట్లో రైడ్స్‌ను చూసి వీటిని నేను నిర్వహించ గలుగుతానో, లేదోనని భయపడ్డాను. కానీ శిక్షణలో నా భయాలన్నీ పటాపంచలయ్యాయి. పిల్లలతో ఎలా వ్యవహరించాలో తెలిసింది. అన్ని రకాల రైడ్స్‌లో శిక్షణ పొందాను కాబట్టి ప్రతి రైడ్‌నూ ఆత్మవిశ్వాసంతో నిర్వహించగలుగుతున్నాను. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా స్పీడ్‌ డయల్స్‌ ద్వారా అధికారులను సంప్రతించి పరిస్థితిని పరిష్కరిస్తూ ఉంటాను. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో బిటెక్‌కు మధ్యలోనే స్వస్థి చెప్పవలసి వచ్చింది. ఈ ఉద్యోగంతో ప్రస్తుతం కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. నా హాస్టల్‌ ఫీజు కట్టుకుంటూ, ఇంటికి కూడా డబ్బు పంపిస్తున్నాను. ఖాళీ సమయాల్లో యూట్యూబ్‌లో కోడింగ్‌ నేర్చుకుంటున్నాను. బిబిఎ కూడా చదువుతున్నాను.

సుభాషిణి, రాగన్నగూడ

భద్రతకే పెద్ద పీట

రైడ్స్‌ నిర్వహణ సమర్థంగా, సజావుగా సాగినప్పుడే సందర్శకులు సురక్షితమైన, ఆనందదాయకమైన అనుభవాన్ని పొందగలుగుతారు. కాబట్టి ప్రతి రైడ్‌ ఆపరేటర్‌కు అత్యుత్తమ శిక్షణ అందించడం జరిగింది. ప్రతిరోజు వేలాది మంది వండర్‌లాను సందర్శిస్తూ ఉంటారు కాబట్టి మరీముఖ్యంగా పిల్లల రైడ్స్‌ విషయంలో రైడ్‌ ఆపరేటర్లు రెట్టింపు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి శిక్షణలో భాగంగా ప్రాథమిక సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు అదనంగా ఆర్థిక స్వావలంబన కూడా సాధించగలుగుతున్నారు. ఈ మహిళా ఉద్యోగులు వండర్‌లా అతిథులకు జీవితాంతం గుర్తుంచుకోదగిన ఆనందదాయకమైన అనుభవాన్ని అందిస్తూ ఉండడం వండర్‌లాకు ఎంతో గర్వకారణం.

ధీరన్‌ చౌదరి, సీవోవో, వండర్‌లా హాలిడేస్‌ లిమిటెడ్‌

ఇవి కూడా చదవండి:

254 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. కివీస్ బౌలర్ అరుదైన రికార్డ్

అహ్మదాబాద్ పిచ్.. టీమిండియా ఆందోళన పడుతోందా..

Updated Date - Mar 09 , 2026 | 03:34 AM