ప్రజాక్షేత్రంలో మహిళా వికాసం
ABN , Publish Date - May 06 , 2026 | 05:06 AM
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు మహిళా అభ్యర్థులు ప్రత్యేకతను చాటుకున్నారు. విభిన్న వర్గాలు... భిన్న నేపథ్యాల నుంచి...
ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు మహిళా అభ్యర్థులు ప్రత్యేకతను చాటుకున్నారు. విభిన్న వర్గాలు... భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన వీరు... ప్రత్యర్థులను వెనక్కు నెట్టి విజేతలుగా నిలిచారు. రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు... ప్రజల పక్షాన చట్ట సభల్లో తమ వాణి వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. వారే వీరు...
తొలి అడుగులోనే చరిత్ర
‘‘ఒక మహిళగా జీవించాలంటే ఎంతో శ్రమ పడాలి. హిజాబ్ ధరించి జీవించడానికి మరింత కష్టపడాలి. ఒక మహిళగా, ముస్లిం మహిళగా, హిజాబ్ ధరించే ముస్లిం మహిళగా... ఇక్కడికి చేరుకోవడానికి ఇప్పటికే ఎన్నో అవరోధాల్ని అధిగమించాను...’’ఇటీవలి కేరళ ఎన్నికల ప్రచారం సందర్భంలో ఫాతిమా తహిలియా చెప్పిన మాటలివి. ఆ తరువాత... తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె... అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఆఖరి అవరోధాన్ని కూడా దాటేశారు. 78 ఏళ్ళ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) తరఫున చట్టసభలకు ఎన్నికైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
ఎన్నెన్నో వివాదాలు...
కోళికోడ్‌లోని పెరంబ్రా నియోజకవర్గం అభ్యర్థిగా ఫాతిమా పేరును (ఐయూఎంఎల్) ప్రకటించినప్పటి నుంచి ఎన్నో వివాదాలకు ఆమె కేంద్రబిందువయ్యారు. సైబర్ దాడులను, ఆన్‌లైన్ వేధింపులను, దూషణలను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో అశ్లీలమైన వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. హిజాబ్ ధరించిన మహిళగా ఆమె పాలనా సామర్థ్యంపై అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఒక వైపు ప్రచారంలో తీరికలేని ఫాతిమా... వీటన్నిటినీ తట్టుకోడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. అయితే మహిళల నుంచి, యువత నుంచి ఆమెకు అద్భుతమైన మద్దతు లభించింది.

వేధింపులపై గొంతు విప్పి...
కోళికోడ్‌లోని పెరువయల్‌లో పుట్టిన ఫాతిమా కాలికట్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదివారు. విద్యార్ధి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె ‘ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్’ (ఎంఎ్‌సఎఫ్) క్రియాశీలకంగా పని చేశారు. దానికి జాతీయ ఉపాధ్యక్షురాలుగా నియమితురాలయ్యారు. ‘ముస్లిం యూత్ లీగ్’ రాష్ట్ర కార్యదర్శిగానూ వ్యవహరించారు. కాగా... ఐయుఎంఎల్‌లో 2021లో లైంగిక వేధింపులకు గురయ్యామంటూ గొంతు విప్పిన మహిళల్లో ఫాతిమా ఒకరు. ఈ వివాదం నేపథ్యంలో ఎంఎ్‌సఎఫ్ జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి పార్టీ ఆమెను తొలగించింది. కొన్ని రోజుల తరువాత... ఆమె తొలి అధ్యక్షురాలిగా, ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎంఎ్‌సఎఫ్ మహిళా విభాగం ‘హరిత’ రాష్ట్ర కమిటీని కూడా ఐయుఎంఎల్ రద్దు చేసింది. దీంతో పార్టీకి ఫాతిమా పూర్తిగా దూరమైనట్టేనని పరిశీలకులు భావించారు. కానీ ఆమె తిరిగి పార్టీలోకి రావడం, పెరంబ్రా నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగడం సంబంధిత వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.
మార్పు దిశగా...
1948లో స్థాపించిన ఐయుఎంఎల్‌కు కేరళలో, ప్రధానంగా మలబార్ ప్రాంతంలో మంచి పట్టుంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో నామమాత్రమైన ఉనికి కూడా ఉంది. ఆ పార్టీ 1996లో, 2021లో కేరళలో మహిళలను పోటీలో నిలబెట్టింది. కానీ వారు ఓడిపోయారు. ఆ తరువాత... తాజా ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు టిక్కెట్ ఇచ్చింది. వారిలో ఫాతిమా ఒకరు. సీపీఎం సీనియర్ నాయకుడు టి.పి.రామకష్ణపై ఆమె అయిదువేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరచడం దిశగా ముస్లిం లీగ్‌లో మార్పులకు దోహదం చేసే పరిణామంగా... ఫాతిమా గెలుపునకు ప్రాధాన్యం ఉంది.

అంట్లు తోమిన చేతులతో..
కలితా మాఝీ
ఒక సామాన్య గృహ కార్మికురాలు ప్రజా ప్రతినిధిగా ఎదగడం అంటే అది గెలుపు మాత్రమే కాదు.. భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం. పశ్చిమ బెంగాల్‌లోని ఔస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన కలితా మాఝీ ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రూ. 2,500 జీతం నుంచి..
బహుశా ఏ రాజకీయ నాయకుడి అఫిడవిట్‌లోనూ ఇంత తక్కువ ఆస్తులు కనిపించవేమో! కలితా మాజీ దాదాపు రెండు దశాబ్దాలపాటు ఇళ్లలో పాచి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించారు. నెలకు కేవలం రూ. 2,500 సంపాదనతో జీవనం సాగించిన ఆమె నేడు తన నియోజకవర్గ ప్రజల గొంతుకను అసెంబ్లీలో వినిపించబోతున్నారు. 38 ఏళ్ల కలిత భర్త సుబ్రతా మాఝీ దినసరి కూలీ.
ఓటమి నుంచి నేర్చుకున్న పాఠం
కలితా మాఝీ రాజకీయాల్లోకి ఒక్క రోజులోనే రాలేదు. గత దశాబ్ద కాలంగా బూత్‌స్థాయి కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశారు. 2021 ఎన్నికల్లో బీజేపీ ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ఆమె కుంగిపోలేదు. తన నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయిలో పట్టు సాధించారు. ఫలితంగా తాజా ఎన్నికల్లో మళ్లీ అవకాశం లభించింది. టీఎంసీ అభ్యర్థి శ్యామ ప్రసన్న లహోరీపై 12,535 ఓట్ల మెజారిటీతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆమెకు లక్షకు పైగా ఓట్లు రావడం ఆమె మంచితనానికి, పట్టుదలకు నిదర్శనం.
నిరాడంబరతకు నిలువుటద్దం
కలిత అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ. 1.61 లక్షలు మాత్రమే. ఆమె గెలుపు ఖరారు కాగానే గతంలో ఆమె ఇంటి పనులు చేస్తున్న ఫొటో వైరల్ అయింది. దానిని చూసి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు ఆమెను కొనియాడుతున్నారు. బెంగాల్ రాజకీయాల్లో ఒక సామాన్య మహిళా కార్మికురాలు శాసన సభ్యురాలిగా ఎన్నిక కావడం గొప్ప నిర్మాణాత్మక మార్పుకు సంకేతం.

నయా ‘కెప్టెన్’
ప్రేమలతా విజయకాంత్
ప్రేమలతా విజయకాంత్... తమిళ రాజకీయాల్లో సుపరిచితురాలు. ఒకప్పటి స్టార్ హీరో, ‘కెప్టెన్’గా అభిమానుల హృదయాల్లో ముద్ర వేసుకున్న నాయకుడు, ‘దేశీయ మర్పోక్కు ద్రవిడ కళగం’ (డీఎండీకే) వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్ సతీమణి. పార్టీ ప్రధాన కార్యదర్శి. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విరుదాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. నాడు సినిమాల్లో బిజీగా ఉన్న విజయకాంత్ 2005లోడీఎండీకేను స్థాపించారు. ఆయన సతీమణిగా ప్రేమలత కూడా అదే ఏడాది రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. పలు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. భర్త విజయాల్లో భాగమయ్యారు. 2018లో పార్టీ కోశాధికారిగా నియమితులయ్యారు.
తమిళనాడు వేలూరు జిల్లా అంబూరులో పుట్టిన ప్రేమలత తండ్రి కన్నయ్య సుగర్ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పని చేసేవారు. తల్లి హంసవేణి గృహిణి. ఇంగ్లిష్ లిటరేచర్‌లో బీఏ చదివిన ప్రేమలత... జాతీయ స్థాయి క్రీడాకారిణి కూడా. షార్ట్‌పుట్, డిస్కస్ త్రోలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలో, 1990లో విజయకాంత్‌ను పరిణయమాడారు. వీరికి ఇద్దరు కుమారులు... విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండియన్.
డీఎండీకేలో అడుగుపెట్టిన నాటి నుంచి ప్రేమలత పార్టీ కోసం శ్రమించారు. పార్టీ నిర్మాణంలో, దాన్ని బలోపేతం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారం మొదలు ప్రతి కార్యక్రమంలోనూ భర్తకు అండగా నిలిచారు. 2023లో విజయకాంత్ మరణం తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకేతో పొత్తులో భాగంగా విరుదాచలం స్థానం నుంచి పోటీ చేశారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన పోరు లో చివరకు 2,387 ఓట్ల స్వల్ప మెజారిటీతో టీవీకే అభ్యర్థి ఎస్.విజయ్‌పై గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆమె ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ అనుభవం నేర్పిన పాఠాలతో ఈసారి మరింతగా కష్టపడ్డారు. అనుక్షణం ప్రజలతో మమేకమయ్యారు. భర్త అడుగుజాడల్లో నడిచిన ఆమె... 57 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి చట్ట సభలో తన గళం వినిపించనున్నారు.

కన్నీటి పోరాటం నుంచి
రత్న దేబ్‌నాథ్
పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై ఒక సామాన్య మహిళ అసామాన్య విజయాన్ని నమోదు చేసింది. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ ఘటనలో కన్నబిడ్డను కోల్పోయి న్యాయం కోసం వీధికెక్కిన రత్న దేబ్‌నాథ్ నేడు పానిహటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. ఒక చేదు జ్ఞాపకం నుంచి పుట్టిన ఈ రాజకీయ ప్రస్థానం బెంగాల్ గడ్డపై మహిళా రక్షణకు ఒక కొత్త ఆశగా నిలుస్తోంది.
అజేయుడిపై అఖండ విజయం
తొలి ప్రయత్నంలోనే రత్న దేబ్‌నాథ్ నమోదు చేసిన విజయం సామాన్యమైనది కాదు. పానిహటిలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉద్దండుడు, టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్‌ఘో్‌షపై ఆమె 28 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేకపోయినా, తన బిడ్డకు జరిగిన అన్యాయంపై ఆమె సాగించిన ధర్మపోరాటం ప్రజల గుండెలను తాకింది.
విషాదం నుంచి విప్లవం వరకు
2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆసుపత్రిలో విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అమానుష హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ బాధితురాలి తల్లే రత్న దేబ్‌నాథ్. ఆసుపత్రి ప్రాంగణంలో తన బిడ్డకు జరిగిన అన్యాయంపై ఆమె మౌనంగా ఉండిపోలేదు. వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ, దోషులకు కఠిన శిక్ష పడాలని గళమెత్తారు. నాటి మమత ప్రభుత్వం ప్రదర్శించిన ఉదాసీనత, సాక్ష్యాల విధ్వంసం వంటి అంశాలు ఆమెను రాజకీయ రణరంగంలోకి దూకేలా చేశాయి.

‘లెఫ్ట్’ కోటలో పాగా
కె.ఎ.తులసి
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువమందిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో కొంగాడ్ ఒకటి. సీపీఎం కంచుకోటల్లో ఒకటైన ఈ స్థానంలో ప్రధాన పార్టీలు ఎల్‌డీఎఫ్ (వామపక్ష కూటమి), యూడీఎఫ్ (కాంగ్రెస్ కూటమి), బీజేపీ... మూడింటి నుంచీ మహిళలు పోటీ పడ్డారు. సీపీఎం తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే కె.శాంతకుమారి మరోసారి పోటీకి దిగారు. షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేసిన ఈ సీటులో... 2026లో ఓటమిపాలైన రేణు సురే్‌షకు బీజేపీ మళ్ళీ టిక్కెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో... కాంగ్రెస్ తమ అభ్యర్థిగా కె.ఎ.తులసిని ప్రకటించడం ఆ పార్టీ కార్యకర్తలకు సైతం విస్మయం కలిగించింది. ఎందుకంటే... 2011లో ఈ నియోజకవర్గం ఏర్పాటు తరువాత... మూడు ఎన్నికల్లోనూ సీపీఎం (ఎల్‌డీఎఫ్) విజయం సాధించింది. అంతేకాదు... మెజారిటీ శాతం పెరుగుతూ వచ్చింది. దీంతోపాటు... ఇటీవలి స్థానిక ఎన్నికల్లో... ఎల్‌డీఎఫ్ అయిదు, యూడీఎ్‌ఫకు మూడు పంచాయతీల్లో గెలిచాయి. న్యాయవాద వృత్తి నుంచి రాజకీయాల్లోకి దిగిన శాంతకుమారి ఈసారి కూడా విజయం సాధిస్తారని విశ్లేషకులు కూడా గట్టిగా నమ్మారు. ఈ ఎన్నికల్లో తులసి ఓడిపోతే... ఆమె భర్త, పాలక్కాడ్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన వి.కె.శ్రీధరన్ ప్రతిష్ఠ మంటగలిసిపోతుందనే వ్యాఖ్యలు వినిపించాయి.
అయితే ‘‘గెలుపు విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు’’ అన్నారు తులసి. ‘‘ఎన్నికల్లో పోటీ చేయడం ఇది తొలిసారి కావచ్చు. కానీ రాజకీయాలు నాకు కొత్తేం కాదు’’ అంటున్న తులసి... కేరళ పీసీసీ జనరల్ సెక్రటరీగా, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు హిస్టరీ ప్రొఫెసర్‌గా పని చేశారు. ‘తులసీ టీచర్’గా గుర్తింపు పొందారు. సామాన్య గృహిణిగా తనను తాను ప్రదర్శించుకోవడం ద్వారా ఓటర్లకు దగ్గరయ్యారు. మరోవైపు... కొంగాడ్‌లో పలుకుబడి ఉన్న సీపీఎం తిరుగుబాటు నేత పి.కె.శశిని యూడీఎ్‌ఫలోకి తీసుకురావడం ద్వారా ఎల్‌డీఎఫ్ ఓట్లను గణనీయంగా చీల్చగలిగారు. 3,700 పై చిలుకు మెజారిటీతో గెలిచారు. ‘‘ఒకే ఇంట్లో ఎంపీ, ఎమ్మెల్యే ఉండడం అరుదు. వారు భార్యాభర్తలు కావడం మరీ అరుదు. మహిళలు ప్రజాప్రతినిధులైతే భర్తలే పాలిస్తారనే భావన సర్వత్రా ఉంది. కానీ నేను స్వతంత్రంగా పని చేస్తాను. నాదైన ముద్ర వేస్తాను’’ అంటున్నారు తులసి.
ఇవి కూడా చదవండి
గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..
రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్