Share News

కలను వదిలి కళ వైపు

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:16 AM

అమ్మానాన్నల ఎన్నో ఏళ్ల కల... తమ కుమార్తెను డాక్టర్‌గా చూడాలని. ఆ కలను తనదిగా చేసుకొని ఎంతో శ్రమించారు ఆమె. కానీ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని...

కలను వదిలి కళ వైపు

సంకల్పం

అమ్మానాన్నల ఎన్నో ఏళ్ల కల... తమ కుమార్తెను డాక్టర్‌గా చూడాలని. ఆ కలను తనదిగా చేసుకొని ఎంతో శ్రమించారు ఆమె. కానీ ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని... మెడిసిన్‌ సీటు వదులుకున్నారు. తెర మరుగవుతున్న సిక్కిం సంప్రదాయ థాంగ్కా చిత్రకళకు ప్రాణం పోయాలని నిర్ణయించుకున్నారు. దానికోసం ఒక సంస్థను నెలకొల్పి... ఆ కళకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన సెర్నయా పాల్మో కథ ఇది.

‘‘ఎన్నో అనుకొంటాం. ఏదేదో చేయాలని కలలు కంటాం. అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతే అది జీవితం ఎలా అవుతుంది! సిక్కింలోని నామ్చీ మా స్వస్థలం. నేను పుట్టింది ఢిల్లీలో అయినా పెరిగింది అక్కడే. అమ్మానాన్నలు ఉన్నత విద్యావంతులు. నన్ను కూడా తమలా ఉన్నతంగా చూడాలని అనుకున్నారు. డాక్టర్‌ను చేయాలని కలలు కన్నారు. వారి ఆలోచనలకు తగ్గట్టుగానే నేనూ చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేదాన్ని. డాక్టర్‌ను కావాలన్న ఆశయంతో ఢిల్లీకి వెళ్లి శిక్షణ తీసుకున్నాను. ఎందుకో అది నాకు సంతృప్తిని ఇవ్వలేదు. ఏదో వెలితిగా అనిపించింది. అమ్మానాన్నల కలను నాదిగా చేసుకొని ఇన్నాళ్లూ పరుగెత్తుతున్నాను. కానీ అది కాదు నేను కోరుకున్నది. మరి నా మనసుకు నచ్చింది ఏమిటి? ఆలోచిస్తే... నేను పెరిగిన నేపథ్యం అంతర్లీనంగా నన్ను కుదురుగా కూర్చోనివ్వడంలేదని అర్థమైంది. మా హిమాలయ ప్రాంతం భిన్న సంస్కృతులు, వైవిధ్యమైన కళలకు నెలవు. నా జీవన విధానంలో ఒక భాగమైన ఆ కళలకు పూర్వ వైభవం తేవాలని నిర్ణయించుకున్నాను. ఇదే నా నిజమైన లక్ష్యం అని భావించాను.

మెడిసిన్‌ కాదనుకొని...

ఎప్పుడైతే నా ఆలోచన మారిందో... ఇక ఒక్క క్షణం కూడా ఢిల్లీలో ఉండలేదు. మెడిసిన్‌లో సీటు వదులుకుని వదిలేసి సొంతూరి బాట పట్టాను. పారిశ్రామికవేత్తగా మారి, స్థానిక కళలకు, కళాకారులకు బాసటగా నిలవాలని అనుకున్నాను. దానికోసం బీబీఏ చదివాను. విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చే కుటుంబంలో ఆ నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదు. అయినా ధైర్యంగా అడుగులు వేశాను. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. మా కుటుంబంలో, బంధువుల్లో ఎవరికీ వ్యాపార అనుభవం లేదు. ఇటు వైపు వచ్చిన తొలి వ్యక్తిని నేనే.


3-Navya.jpg

చదువు అవ్వగానే...

నా బీబీఏ అవ్వగానే 2023లో ‘పాల్మో హ్యాండీక్రాఫ్ట్స్‌’ ప్రారంభించాను. సిక్కిం సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించి, ప్రోత్సహిస్తూ, కళలను నమ్ముకొని జీవిస్తున్నవారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశాను. సంప్రదాయ థాంగ్కో చిత్రకళతో పాటు ప్రత్యేక ఫర్నీచర్‌, హిమాలయ, సిక్కిం ప్రజల సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన హస్తకళాకృతులు ఉత్పత్తి చేస్తున్నాం. థాంగ్కా చిత్రాలు పట్టు లేదా నూలు వస్త్రాలపై చిత్రించే థాంగ్కా చిత్రాలకు టిబెట్‌, భూటాన్‌, నేపాల్‌లోని బౌద్ధ సమాజాల్లో ఆధ్యాత్మికమైన ప్రాముఖ్యత ఉంది. ఇవి బుద్ధుడు, బౌద్ధ గురువులతో పాటు ధ్యానం, ఆచారవ్యవహారాలకు సంబంధించిన పవిత్ర కథలను చెబుతాయి. మా ప్రతి కళారూపం చేతితో తయారు చేసిందే. ఫర్నీచర్‌ను కూడా చేతితో చెక్కి, రంగులు వేస్తాం. యంత్రాలనేవి ఉపయోగించం. ప్రామాణికత, హస్తకళా నైపుణ్యం మా పనికి మూలస్తంభాలు.

దేశవిదేశాల్లో...

మా ఉత్పత్తులను తొలుత మా ప్రాంతానికి వచ్చే పర్యాటకులు కొనుగోలు చేసేవారు. క్రమంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. తక్కువ కాలంలోనే మా చుట్టుపక్కల గ్రామాలు దాటి రాష్ట్రం, దేశ వ్యాప్తంగా అమ్మకాలు విస్తరించాయి. ఇప్పుడు ఆగ్నేయ ఆసియా, ఐరోపా దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. చియాంగ్‌ మాయి లాంటి ప్రముఖ నగరాల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు సిక్కిం హస్తకళా నైపుణ్యాన్ని ప్రపంచ ముందు ఉంచడానికి దోహదపడ్డాయి. మా ఉత్పత్తులకు కావల్సిన ముడిసరుకును సాధ్యమైనంతవరకు స్థానికంగానే సేకరిస్తాం. దీనివల్ల ప్రాంతీయంగా ఉండే సరఫరాదారులకు ఆదాయం లభిస్తుంది.

కీలక ఘట్టం...

ఈ ప్రయాణంలో ఎన్నో పురస్కారాలు, సత్కారాలు అందుకున్నాను. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలు అందుకోవడం వీటన్నిటి కంటే నాకు ఎంతో విలువైనది. నా జీవితంలో కీలక ఘట్టం ఏమిటంటే... ఇటీవల జరిగిన అఖిలభారత స్థాయి సదస్సులో పాల్గొనే అవకాశం రావడం. వ్యవస్థాపకత, సంస్కృతి, యువత సాధికారత గురించి అందులో మాట్లాడాను. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఏదిఏమైనా అతితక్కువ కాలంలోనే నేను అనుకున్న లక్ష్యాన్ని చేరినందుకు ఎంతో సంతృప్తిగా ఉంది.’’

ఇవి కూడా చదవండి..

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం

కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే

Updated Date - Jun 04 , 2026 | 12:16 AM