విస్మయ’మైన ఆరంభం
ABN , Publish Date - Aug 09 , 2026 | 03:35 AM
‘విస్మయా మోహన్‌లాల్... వెండితెరపై మరో వారసురాలు. మోహన్‌లాల్ తనయగా ఆమెకు వేదిక ఎప్పటినుంచో సిద్ధంగా ఉంది. కానీ ‘స్టార్ కిడ్’ ముద్రను దాటి... అసిస్టెంట్ డైరెక్టర్‌గా...
టీజర్
‘విస్మయా మోహన్‌లాల్... వెండితెరపై మరో వారసురాలు. మోహన్‌లాల్ తనయగా ఆమెకు వేదిక ఎప్పటినుంచో సిద్ధంగా ఉంది. కానీ ‘స్టార్ కిడ్’ ముద్రను దాటి... అసిస్టెంట్ డైరెక్టర్‌గా, పుస్తక రచయితగా తనదైన ప్రపంచంలో విహరిస్తోంది. ఢిల్లీలో గళమెత్తిన విద్యార్థులకు మద్దతునిచ్చి విమర్శలు ఎదుర్కొన్నా... ఇప్పుడు 32 ఏళ్ల వయసులో తెరపై తొలి అడుగు వేసినా... ప్రత్యేకతను చాటుతూ ముందుకు సాగుతున్న విస్మయ జర్నీ ఇది.
సగటు సినీ వారసులకు భిన్నం విస్మయ. 32 ఏళ్ల వయసులో ఒక నటి, అదీ ఒక సూపర్‌స్టార్ కుమార్తె తెరంగేట్రం చేయడం ‘విస్మయ’ంగానే అనిపించవచ్చు. కానీ ఆమె రూటు సెపరేటు. దశాబ్దాలుగా నాన్న మోహన్‌లాల్, ఆ తరువాత అన్నయ్య ప్రణవ్ తెరను ఏలుతున్నా... తను మాత్రం ఆ దిశగా ఆచితూచి అడుగులు వేసింది. తిరువనంతపురంలో పుట్టిన విస్మయ... తల్లి సుచిత్రది కూడా సినీ నేపథ్యమున్న కుటుంబమే. ఆమె తండ్రి దివంగత సినీ నిర్మాత బాలాజీ. అమ్మానాన్న విస్మయను ముద్దుగా మాయ అని పిలుస్తారు. ఊటీలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆమె చెక్‌రిపబ్లిక్ రాజధాని ప్రాగ్, బ్రిటన్, అమెరికాలో థియేటర్ ఆర్ట్‌లో శిక్షణ పొందింది. స్కూల్లో ప్రదర్శించిన నాటకంలో ఉత్తమ సహాయనటి అవార్డు గెలుచుకుందని మోహన్‌లాల్ ఓ సందర్భంలో చెప్పారు. అన్నయ్య ప్రణవ్‌లానే తనకు కూడా ప్రయాణాలు, విదేశీ పర్యటనలంటే చాలా ఇష్టం. 2020... కొవిడ్ సమయంలో విస్మయ థాయ్‌లాండ్ వెళ్లింది. లాక్‌డౌన్ నేపథ్యంలో కొన్ని నెలల ఇంటికి తిరిగి రాలేకపోయింది. కానీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. ‘ముయ్ థాయ్’ అనే యుద్ధ కళలో శిక్షణ తీసుకోవడానికి ఉపయోగించుకుంది. ఈ శిక్షణవల్ల ఆమె ఇరవై కిలోల బరువు తగ్గింది.
‘‘థాయ్‌లాండ్‌లోని సముయ్‌కు వెళ్లినప్పుడు కొన్ని వారాలు మాత్రమే ఉంటానని అనుకున్నాను. కొవిడ్‌వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. దాంతో ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నాను. కానీ ఏంచేయాలనే దానిపై స్పష్టత లేదు. ఆ సమయంలోనే ఫిట్‌కో అనే ఫిట్‌నెస్ క్యాంపులో ‘ముయ్ థాయ్’ నన్ను ఆకర్షించింది. అంతేకాదు... సముయ్ ఒక అద్భుతమైన ద్వీపం. ఆహ్లాదమైన బీచ్‌లు, సుందరమైన సూర్యాస్తమాయాలు, అడవులు, జలపాతాలు... మనసును పరవశింపజేస్తాయి. నా బైక్‌పై తిరుగుతూ ఆ అందాలన్నీ ఆస్వాదిస్తుంటాను. చాలా స్వేచ్ఛగా, సురక్షితంగా అనిపిస్తుంది. ఆ ప్రాంత ప్రజలు ఎంతో ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా ఉంటారు. ద్వీపంలో దిగినప్పటి నుంచీ ఒక చక్కని సామూహిక భావన ఏర్పడింది. నాటి నుంచి తరచూ సముయ్‌కు వెళ్లి సేద తీరుతుంటాను. అది నా సొంత ఇల్లు అనే భావన కలుగుతుంది’’ అంటూ ఓ సందర్భంలో విస్మయ వెల్లడించింది.
హృదయంలో స్థానం...
స్కూల్ రోజుల్లో గడిపిన ఊటీ కూడా ఆమెకు బాగా నచ్చిన ప్రాంతాల్లో ఒకటి. ‘‘బాల్యంలో ఎక్కువ భాగం నీలగిరి పర్వత శ్రేణుల్లోని ఊటీలో గడిపాను. అప్పట్లో ఇంకా ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండేది. చెట్లు ఎక్కుతూ, సరస్సుల్లో ఈదుతూ, ఉప్పు, కారంతో పచ్చిమామిడికాయ ముక్క తింటూ, టీ తాగుతూ, రాత్రిళ్లు చలిమంటల చుట్టూ కూర్చొనేవాళ్లం. ఊరంతా తిరిగేవాళ్లం. చెబుతుంటే సాధారణంగానే అనిపిస్తాయి ఇవన్నీ. కానీ అవే అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. మళ్లీ ఆ రోజులకు తిరిగివెళతానంటే నేను ఏదైనా చేస్తాను. ఊటీకి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం’’ అంటూ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకుంది ఈ నటి. వీటితోపాటు తనకు ఇష్టమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో మొదటిది హిమాలయాలు. రెండోది థాయ్‌లాండ్. మూడోది ప్రాగ్.
‘‘హిమాలయాల్లోని హంప్టా పాస్‌లో ట్రెక్కింగ్ చేసి, స్పితి లోయను సందర్శించాను. నిజంగా అది ఓ ఉత్కంఠభరిత అనుభవం. థాయ్‌లాండ్‌లో సముయ్, చియాంగ్ నుంచి కొన్ని గంటల దూరంలో, మయన్మార్ సరిహద్దు సమీపంలో ఉన్న పై అనే చిన్న పట్టణంలోనూ నివసించాను. ఆ రెండు ప్రదేశాలూ చాలా మనోహరంగా, అందంగా ఉంటాయి. ఇక ప్రాగ్... అక్కడ ఏడాదిపాటు ఉన్నాను’’ అంటున్న విస్మయకు సోలో ట్రావెలింగ్‌పై మక్కువ ఎక్కువ. ఎక్కడికి వెళ్లినా కొద్ది రోజుల్లోనే పర్యాటక ప్రాంతాలన్నీ చుట్టేయాలని అనుకోదు. పూర్తి స్థాయిలో ఆస్వాదించేందుకు అవసరమైనన్ని రోజులు అక్కడ గడుపుతుంది. అది వారం కావచ్చు... ఏడాది కావచ్చు.
కదిలించే దృశ్యాలు అక్షరాలుగా...
విస్మయ అభిరుచుల్లో కవిత్వం రాయడం, ఫొటోగ్రఫీ కూడా ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తనకు బాగా గుర్తుకువచ్చేది దోశలు, ఇంట్లో పెంపుడు కుక్కలు. ‘‘నాకు దక్షిణాది వంటకాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కేరళ వంటకాలు. ప్రత్యేకంగా అప్పం, దోశలు బాగా తింటాను. అలాగే థాయ్ వంటకాలు చాలా రుచిగా, కారంగా ఉంటాయి’’ అంటున్న ఆమె ఆ మధ్య ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ పేరుతో ఒక పుస్తకం కూడా ప్రచురించింది. ఎన్నో ఏళ్లుగా తను రాసిన కవితల సంకలనం. ఈ పుస్తకానికి సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుంది. ‘ఒక సున్నితమైన ప్రయాణం’గా ఆయన దాన్ని అభివర్ణించారు.
‘‘ఒక కవితా సంకలనం రాయాలని నేను ఎప్పుడూ కూర్చోలేదు. అది ఇన్నేళ్లుగా రాసిన కవితల చిన్న చిన్న భాగాల సమాహారం మాత్రమే. ప్రస్తుతం రెండో పుస్తకం మీద పని చేయడం మొదలుపెట్టాను. ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఏదైనా విషయం నన్ను కదిలించినప్పుడు, ఏవైనా భావాలు పొంగినప్పుడు వాటికి అక్షర రూపం ఇస్తుంటాను. అలాగే కొన్నిసార్లు ప్రకృతిని చూసి పరవశించినప్పుడు చిత్రాలు గీస్తాను. అయితే ఆరంభంలో ఇలాంటి కవిత రాయాలని కానీ, ఫలానా రూపంలో బొమ్మ వేయాలని కానీ అనుకోను. అందుకే ఒకచోట మొదలై మరొకవిధంగా రూపాంతరం చెందుతాయి. నా కవితలు, చిత్రాలను లోతుగా పరిశీలిస్తే తమను తాము ఆవిష్కరించుకొన్నట్టు అనిపిస్తాయి. రచయిత్రి ఎలెనా ఫెర్రాంటే చాలా ఇష్టం. కొన్నేళ్ల కిందట ‘నియాపోలిటన్’ సిరీస్ చదివాను. ఆమె రాసే విధానం చాలా సహజంగా, అందంగా ఉంటుంది’’ అంటోంది విస్మయ.
కెమెరా ముందుకు...
మళయాళ చిత్రం ‘తుడక్కం’తో విస్మయ తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ‘తుడక్కం’ అంటే ఆరంభం అని అర్థం. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకుడు. చిత్రాన్ని నిర్మిస్తున్న ‘ఆశీర్వాద్ సినిమాస్’ ఆమెను ‘వెలుగు నుంచి ఉద్భవిస్తున్న కథకురాలు’గా అభివర్ణించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో ‘మీనూ’గా ప్రధాన పాత్ర పోషించిన ఆమె ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో మోహన్‌లాల్ అతిథిపాత్రలో కనిపిస్తారు.
నిర్భయంగా... నిర్మొహమాటంగా...
ఏ విషయం గురించి అయినా విస్మయ నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడుతుంది. నీట్ పేపర్ లీక్‌పై ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన తెలిపిన విద్యార్థులకు మద్దతుగా నిలిచింది. ‘మీరు నిరసనకారులతో ఏకీభవించాల్సిన అవసరం లేదు.వారి డిమాండ్లకూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ పౌరులు తమ గళం విప్పినప్పుడు చర్చలకు బదులుగా అణచివేసేలా బలప్రయోగం జరిగితే... మనం ఎలాంటి ప్రజాస్వామ్యంలోకి మారుతున్నామనేది ఒక్కసారి ప్రశ్నించుకోవాలి’ అంటూ ఆమె చేసిన పోస్ట్‌పై దుమారం రేగింది. దీనిపై స్పందించిన విస్మయ... తన మాటలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించింది. ‘మనది ఒక ప్రజాస్వామ్య దేశమని నేను నమ్ముతాను. అంటే మనం ప్రశ్నించడానికీ, మన వాదన వినిపించడానికీ ఎల్లప్పుడూ మనకు అవకాశం ఉండాలి. బలప్రయోగానికి బదులు సంప్రతింపులు జరపాలి. రాజకీయాలు మానవత్వాన్ని ఎప్పటికీ అధిగమించకూడదని నేను భావిస్తున్నాను. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా నా అభిప్రాయం మారదు’ అంటూ బదులిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ